కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా ఛిన్నాభిన్నం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చైనాను మినహాయిస్తే ఇతర అగ్రరాజ్యాల స్థితిగతులు ఏమంత ఆశాజనకంగా లేవు. భారత్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో –23.9 శాతం వృద్ధి నమోదు చేసిందన్న వార్త దేశీయంగా కొంత ఆందోళన కలిగించింది. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు ఏకంగా రుణాత్మకం కావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కూడా. మరి ఈ ఏడాది వృద్ధి కొంచెమేనా? అసలు ఉంటుందా? ఆగస్టు 31న విడుదలైన జీడీపీ అంకెలు ఆర్థిక వ్యవస్థ వాస్తవికతకు దర్పణమేనా? లేక.. భిన్నమైన కథ ఏదైనా దాగి ఉందా?
చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వైరస్ కట్టడి కోసం భారత్ చాలా ముందుగానే లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అది కూడా చాలా కఠినమైన నిబంధనలతో మార్చి 25వ తేదీ నుంచి పూరి ్తస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో 65 శాతం వరకూ ఉండే రవాణా, తయారీ, గనులు, నిర్మాణం, పర్యాటకం, ఆతిథ్యరంగం అన్నీ అకస్మాత్తుగా మూతపడ్డాయి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమా సికం ప్రారంభంలోనే ఈ కఠినమైన లాక్‌డౌన్ అమలు కావడంతో జీడీపీలో తరుగుదల ఊహించిందే. అయితే ఈ కష్టకాలంలోనూ కొన్ని రంగాల్లో సానుకూల వృద్ధి నమోదు కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఉదాహరణకు వ్యవసాయం. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ సారి 3.4 శాతం వృద్ధి నమోదైంది. సమాచార, ప్రసార శాఖ 7.1 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3.8, స్టోరేజ్ 3.5, బ్యాంకింగ్ 1.2 శాతం వృద్ధి నమోదు చేయడం ఇంకో విశేషం. అంతేకాదు. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రకటించిన తొలి త్రైమాసిక జీడీపీ అంకెల ద్వారా ఆర్థిక వ్యవస్థలోని ఒక పార్శ్వం మాత్రమే వ్యక్తమవుతోంది. మరో పార్శా్యన్ని చూడాలంటే రెండు కీలకమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
సడలింపులతో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ
ఆగస్టు 31న విడుదలైన జీడీపీ అంకెల్లో జూలై నెల మొత్తాన్ని, ఆగస్టులో తొలి 15 రోజులను పరిగణనలోకి తీసుకోలేదు. లాక్డౌన్ నిబంధనలను దశలవారీగా సడలించడం మొదలైన ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోందనేందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. అయితే లాక్‌డౌన్ నిబంధనలు కొన్ని కొనసాగుతూండటం వల్ల అంతా పూర్వస్థితికి చేరిందనీ చెప్పలేని పరిస్థితి. కానీ ఆర్థిక వ్యవస్థ నిలకడగా మళ్లీ పట్టాలెక్కుతోందనేది మాత్రం కళ్లముందు కనిపిస్తున్న దృశ్యం. కార్యాలయాల్లో ఉద్యోగుల రాకపోకలు మొదలుకొని, పార్కులు, రవాణా కేంద్రాల్లోనూ రద్దీ ఎక్కువ అవడం అన్‌లాక్ 3.0లో స్పష్టంగా కనిపించింది. జూలైలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం మునుపటి ఏడాది అదే నెలతో పోలిస్తే 90 శాతానికి చేరుకుంది. తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్ (పీఎంఐ) మే నెలలో 30.8గా ఉండగా జూలైలో 46కు ఎగబాకింది. అన్‌లాక్ 3.0, 4.0లతో పీఎంఐ మరింత ఎక్కువవుతుంది ఆగస్టు నాటి పీఎంఐ 52గా నమోదుకావడం శుభసూచకం. ఇక విద్యుత్తు వినియోగం అనే సూచీని చూస్తే ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2.64 శాతం పెరిగింది. ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు కూడా మార్చి తరువాత అత్యధిక స్థాయిలో నమోదవడం విశేషం. జూలై నెలలో బ్రాడ్ బ్యాండ్ వినియోగం కూడా ఎక్కువైంది.
సానుకూల ‘రుతు’ పవనాలు
ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం తరువాతి నెల జూలైలో దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు 39 శాతం వరకూ పెరగడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. నైరుతీ రుతుపవనాలు కూడా సానుకూలంగా మారి వర్షాలు బాగా కురుస్తూండటం రానున్న త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం నుంచి ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతం లభిస్తుందని స్పష్టం అవుతోంది. ఈ–వే బిల్లులు, బొగ్గు, మోటార్ సైకిళ్ల ఉత్పత్తి వంటి ఇతర సూచీలు కూడా జూలై తరువాత పైకి ఎగబాకుతూండటం గమనార్హం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయానికి వస్తే.. ఏప్రిల్ – జూలై మధ్యకాలంలో భారత్ రికార్డు స్థాయిలో 2200 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్శించింది. గత ఏడాది కూడా 7400 కోట్ల భారీ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్ ఆకర్శించడం తెలిసిందే. జూలైలో దేశీ స్టాక్ మార్కెట్లు ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల మార్కెట్లలో టాప్ మూడింటిలో ఒకటిగా నిలిచింది. సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.7 శాతం వరకూ పెరిగి విలువ దాదాపు 1.9 లక్షల కోట్లకు చేరింది.
సంస్కరణల మంత్రం
గడచిన కొన్ని నెలల్లో దేశ ఆర్థిక విధానంలో తీసుకువచ్చిన పలు సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఫలితాలు చూపించడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైతే ఫలితాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. బొగ్గు తవ్వకాల్లో పూర్తిస్థాయి ప్రైవేట్ భాగస్వామ్యం, వాణిజ్యస్థాయిలో ఉత్పత్తికి అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వ్యవసాయ రంగంలోని పలు నియంత్రణలకూ స్వస్తిచెప్పారు. ఏడు దశాబ్దాల విధానానికి చెల్లుచీటి ఇచ్చేసి ప్రభుత్వం ప్రైవేట్, కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఓకే చెప్పింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను తమకు నచ్చిన చోట ఇష్టమైన ధరకు అమ్ముకునే స్వేచ్ఛ లభించింది. వ్యవసాయ రంగంలో ప్రణాళికాబద్ధంగా పెట్టనున్న రూ.1500 కోట్ల పెట్టుబడులు లాభాలిచ్చే సమయం త్వరలోనే ఉంది. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 49 నుంచి 74 శాతానికి పెరగడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు కంపెనీలను నియంత్రించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వారికి లాభదాయకం కాబట్టి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం పెరుగుతుంది. రక్షణ రంగ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రానున్న ఐదారేళ్లలో దేశీయంగా రక్షణ రంగ తయారీని ప్రోత్సహించేందుకు భారీ ప్రోత్సాహకాలతో ఒక పథకాన్ని ప్రకటించింది.
ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక పథకం కారణంగా రానున్న ఐదేళ్లలో దేశంలో రూ.15 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ పెట్టుబడుల కారణంగా సుమారు 12 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంచనా. ఆపిల్ ఫోన్లు తయారు చేసే రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగట్రాన్ కంపెనీలతోపాటు శాంసంగ్, ఫాక్సా్కన్, హోన్ హాయి, వంటి మొత్తం 22 కంపెనీలు ఈ పథకంపై ఆసక్తి కనపరిచాయి. ఆపిల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు మూడూ ఇటీవలే భారత్‌లో ఐఫోన్–11 ఫోన్ల తయారీని చేపట్టాయి కూడా.
వైమానిక, అంతరిక్ష రంగాలతోపాటు ప్రైవేట్ గనుల తవ్వకాల రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునేందుకు దోహదపడతాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తొలిసారి కచ్చితమైన విధానాల పరిధిలో జరుగుతోంది. సంస్కరణల పర్వంలో ఇది అత్యంత కీలకమైందిగానూ, పరిస్థితిని గణనీయంగా మార్చేసిందిగానూ భావిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రానున్న కొన్ని వారాలు, నెలల సమయంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తమ్మీద 2020–21 ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే పరిస్థితి చాలా ఆశాజనకంగానే కనిపిస్తోంది. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి వేగంగా కోలుకునే కొన్ని దేశాల్లో భారత్ ఒకటని ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అంచనా వేస్తూండటం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. ఈఐయూ లెక్కల ప్రకారం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్ స్థూల ఉత్పత్తి ఏడాది క్రితం నాటికి సమానంగా ఉంటుంది. 2019 నాటి జీడీపీ స్థాయిని 2021 ఆర్థిక సంవత్సరంలోనే సాధించనుంది. ఏతావాతా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడేందుకు కీలకం కానున్న భారత అర్థిక వ్యవస్థ పరిణామాలు రానున్న కాలంలో మరింత ఆసక్తికరంగా మారనున్నాయి!
అఖిలేశ్ మిశ్రా
గల్ఫ్ న్యూస్ సౌజన్యంతో
(వ్యాసకర్త సీఈఓ, బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ మీడియా)
మున్ముందు అన్నీ మంచి రోజులే!
Published Wed, Sep 2 2020 12:34 AM | Last Updated on Wed, Sep 2 2020 5:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment