స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి | Bhima Koregaon Shaurya Din History in Telugu | Sakshi
Sakshi News home page

Bhima Koregaon Shaurya Din: స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి

Published Sat, Jan 1 2022 1:14 PM | Last Updated on Sat, Jan 1 2022 1:18 PM

Bhima Koregaon Shaurya Din History in Telugu - Sakshi

పీష్వా బ్రాహ్మణులపై మహార్‌ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్‌. 500 మంది మహర్‌ వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్‌ వాళ్లు తమతో కలిసి పోరాడాలని మహర్‌లను కోరారు. అప్పటి మహార్‌ నాయకుడు సిద్‌నాక్‌ పీష్వా సైన్యాధికారి బాపు గోఖలే వద్దకు వెళ్లి పశువులకన్నా హీనంగా చూడబడుతున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖలే కరాఖండీగా చెప్పారు.

వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచు కోవాలని ప్రతిన బూనిన ఐదు వందల మంది మహర్‌ సైన్యం, రెండు వందల మంది బ్రిటిష్‌ సైన్యంతో కలిసి 200  కిలోమీటర్లు నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కని పిస్తున్న పీష్వా సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ బతికితే పోరాట వీరులుగా బత కాలనీ, లేదంటే హీనమైన బతుకులతో చావాలనీ నిర్ణయించుకున్న మహర్‌ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి తలపడింది. తిండి లేకుండా కాలినడకన వచ్చి కూడా మహర్‌ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఎదుర్కోవడాన్ని చూసిన బ్రిటిష్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఆశ్చర్యపోయారు. భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడింది. పీష్వా సైన్యం వెనక్కి తగ్గింది. అమరులైన 12 మంది మహార్‌ సైనికులకు బ్రిటిష్‌ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్‌ సైనికులతో మహర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు చేశారు. (చదవండి: డెస్మండ్‌ టూటూ.. వివక్షపై ధిక్కార స్వరం)

1927 జనవరి 1న ఈ స్మారక స్థూపాన్ని మొదటిసారి సందర్శించిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ దీన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఎందరో దళితులు జనవరి ఒకటిన దీని దర్శనానికి వెళ్లడం మొదలైంది. దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజు అయినందున దేశవ్యాప్తంగా శౌర్య దివస్‌గా  జరుపుకొంటున్నారు. (చదవండి: జీవించే హక్కు అందరి సొంతం కాదా?)

అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పుణె ప్రాంతంలో ఉండేది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాలపై పడకూడదనీ, దళితులు పొద్దున, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇళ్లకు గానీ వారి దగ్గరకు గానీ పోగూడదనీ, తమ నీడ తమ పైన పడే పట్టగలు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉండేది. శివాజీ పాలనలో ఇలా ఉండేది కాదు. శివాజీ పాలనలో సైన్యంలో ఉన్న మహార్‌లను అనంతర పాలకులు తొలగించి మనుధర్మాన్ని పకడ్బందీగా అమలుపరిచారు. 200 సంవత్సరాల క్రితం జరిగిన భీమా కోరేగావ్‌ యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. యుద్ధం జరిగి 200 సంవత్సరాలు జరిగిన సంద ర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్రవర్ణాలవారు దాడి చేశారు. ఇప్పటికి దళితులూ, అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు భేదభావం లేదంటూ దళిత వాడల్లో భోజనాలు చేస్తూనే, మరోపక్క కోరేగావ్‌ లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. (చదవండి: కీలవేణ్మని పోరాటం.. స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటన)

శౌర్య దివస్‌ స్ఫూర్తిగా బ్యాలట్‌ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన బహుజనులు నేడు ప్రజాస్వామ్య దేశంలో బహుజన రాజ్యం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. జ్యోతిరావు ఫూలే, పెరియార్, సాహూ మహారాజ్, నారాయణ గురు లాంటి మహానుభావుల మార్గంలో– బహుజనుల్లో ఎదిగిన వాళ్లు విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం చేయాలి.  

- సాయిని నరేందర్‌ 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
(జనవరి 1న భీమా కోరేగావ్‌ శౌర్య దినోత్సవం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement