సరసమైన ధర, సబ్సిడీ... అంత ఈజీ కాదు | Bibek Debroy Article On Covid Vaccine | Sakshi
Sakshi News home page

సరసమైన ధర, సబ్సిడీ... అంత ఈజీ కాదు

Published Sun, Apr 25 2021 1:20 AM | Last Updated on Sun, Apr 25 2021 3:40 AM

Bibek Debroy Article On Covid Vaccine - Sakshi

కోవిడ్‌ రెండోదశ చాలా ఉధృతంగా వచ్చింది. అయినా పౌరుల్లో మాత్రం స్పృహ ఇంకా కొరవడుతూనే ఉంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు, మొత్తం కోటిన్నర మందికిపైగా బాధి తులు, 1.86 లక్షల మరణాలు.. ఈ అంకెలు చూస్తేనే భయం అనిపిస్తున్నా.. రాబోయే కాలంలో ఇవి మరింతగా ఎక్కు వయ్యే ప్రమాదం కళ్లెదుటే కనిపిస్తోంది. కోవిడ్‌ పరీక్షలు, బాధితుల మరణాల విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తున్న లెక్కలు ఎంతవరకు నిజమన్న అనుమానాలూ తలెత్తుతు న్నాయి. కానీ వీటన్నింటి కంటే ప్రజల నిర్లక్ష్యమే చాలా ప్రమా దకరం. వైరస్‌ ప్రస్తుతం విజృంభిస్తున్న తీరు చూస్తే దాన్ని నిరో ధించడం మన చేతుల్లోనే ఉందని అర్థమవుతుంది. జూలై లోపు రెండోదశ ఉధృతి తగ్గుతుందన్న ఆశలు ఏమాత్రం లేవు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి?

టీకా వేసుకోవడం ఒక్కటే ప్రస్తుత తరుణంలో వైరస్‌ను అడ్డుకోవడానికి కొంతలో కొంత ఉత్తమ మార్గం. అయినా టీకా వేయించుకున్నంత మాత్రాన భౌతికదూరం నిబం ధనలను మాత్రం వదలకూడదు. టీకా వేయించుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా.. వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. ఈ కథనం రాసే సమయానికి దేశంలో 13.5 కోట్ల టీకాలు వేశారు. వారిలో 11.5 కోట్ల మంది తొలిడోసు తీసుకున్నారు.

రోజుకు సుమారు 50 లక్షలమందికి వేయొచ్చని ఓ అంచనా. ఈ లెక్కన మొత్తం జనాభాకు టీకాలు వేయడానికి ఎంత సమయం పడుతుందో లెక్క వేసుకోవచ్చు. భారతదేశ జనాభా, వైశాల్యం.. వీటన్నింటి దృష్ట్యా చూస్తే అందరికీ టీకాలు అంత త్వరగా వేయడం కష్టమే. ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ టీకాలే అందుబాటులో ఉన్నాయి. త్వరలో స్పుత్నిక్‌ కూడా వస్తుంది. 
డిమాండు- సరఫరా పరిస్థితిని బట్టే టీకా ధర ఎంతన్నది నిర్ణయిస్తారు. ప్రభుత్వం టీకాను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తే.. మార్కెట్‌ అస్తవ్యస్తం అవుతుంది. క్లియరెన్స్‌ సేల్‌ పద్ధతిలో టీకాలను ఎవరూ ఇవ్వలేరు. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించే ధర కూడా అలాంటి ధర కంటే ఎక్కువగానే ఉండాలి. మూడోదశ టీకా వ్యూహం ప్రకారం.. కంపెనీలు ముందుగానే టీకా ధర వెల్ల డిస్తాయి. ఈ ధర ఒక్కో డోసు రూ. వెయ్యి కంటే తక్కువగానే ఉండే అవకాశం లేదు. రూ. 150, రూ. 200 అనేది సాధారణ ధర కంటే చాలా తక్కువ. దురదృష్టవశాత్తు ప్రజలు చెల్లించలేరన్న భావనతో ముందుగా తక్కువ ధరలు నిర్ణయిస్తారు. కానీ భరించ లేనివారికి మాత్రమే సబ్సిడీ ధరలకు ఇవ్వడం వేరు.. అందరికీ అలా ఇవ్వడం వేరు. టీకా డిమాండు ఎప్పుడూ సరఫరా కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ ధరకు టీకా ఉత్పత్తి చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రోత్సాహం అందదు. 

మొత్తం జనాభా అందరికీ ప్రభుత్వమే టీకాలు వేయించాలా అన్నది కూడా ఒక ప్రశ్నే. తొలుత 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటినవారిలో వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే టీకాలు ఇచ్చారు. వీరిలో చాలామంది ఉత్పాదకతకు దూరంగా ఉన్నవారే. ఉత్పాదక రంగంలో యువత ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలు, జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలంటే.. ఉత్పాదక రంగం లోని వారికి తొలుత టీకాలు ఇవ్వాలి. కానీ రాజకీయ పరంగా చూస్తే ఇది అంత సులభం కాదు. మూడోదశలో 50% టీకాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, మిగిలినది మార్కెట్‌ ధరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామన్నారు. దానివల్ల 18 ఏళ్లు దాటిన వారం దరికీ టీకాలు ఇవ్వచ్చు. ఈ పద్ధతి వల్ల సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ఉత్పత్తి పెంచగలవు. ఈ రెండు కంపెనీలూ విదేశాలకూ టీకాను సరఫరా చేయడానికి ముందే ఒప్పందాలు చేసుకున్నాయి.

ఈ లెక్కన టీకా ఉత్పత్తి పెరిగి, అది అందరికీ అందుబాటు లోకి రావాలంటే కనీసం 2021 సెప్టెంబర్‌ వరకు వేచిచూడాలి. అప్పటికీ కొంత కొరత ఉంటుంది. టీకా ముడిపదార్థాల ఎగుమ తిని నియంత్రించడానికి అమెరికాలో డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ అమలుచేశారు. దీనికితోడు ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేప థ్యంలో టీకా ఉత్పత్తికి లైసెన్సు తప్పనిసరి. ఇంతటి సంక్లిష్ట పరి స్థితుల్లో టీకా ఉత్పత్తి చేయడం, దాన్ని సరసమైన ధరలకే అందించడం అంటే కంపెనీలకు అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం తమకు అందే 50% కోటాలో ఎంత మొత్తాన్ని ఏయే రాష్ట్రాలకు ఎలా సరఫరా చేస్తుందన్నది చూడాలి. ఆ టీకాలు చాలకపోతే.. రాష్ట్రాలు తమంతట తాముగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులూ టీకా ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుక్కోవాలి. తప్పనిసరిగా మార్కెట్‌ ధరలకు అను గుణంగానే వారు వెచ్చించాల్సి ఉంటుంది.


బిబేక్‌ దేబ్‌ రాయ్‌ 
ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్‌
(ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement