నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా పునరావాస లంబాడ, గిరిజన రైతులు ఆరు దశాబ్దాల నుండి నానా ఇబ్బందులకు గురవు తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు నకు గురైన లంబాడ గిరిజ నుల కష్టాలు నేటికీ తీరలేదు. 1962లో దేవరకొండ ప్రాంతంలోని గువ్వలగుట్ట, కాంచనపల్లికి చెందిన లంబాడ గిరిజనులు సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్నారని సుమారు వంద కుటుంబాలకు మఠంపల్లి మండలంలోని గుర్రం బోడు ఏరియాలో ఎలాంటి బాట సౌకర్యం లేని అటవీ ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేశారు. పక్కా గృహాలు మంజూరు చేయలేదు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదు. దాని కారణంగా వాళ్లే నానా కష్టాలు పడి గుర్రంబోడులో కాలనీ ఏర్పాటు చేసుకు న్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సర్వే నం.540లోని సుమారు 1870 ఎకరాల బంజరు భూమిని నిర్వాసితు లకు కేటాయించి హక్కు పత్రాలు జారీ చేశారు. సాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల మెట్ట పంటలు వేసుకుంటూ గొర్రెలు, మేకలు, పశువులను సాదు కుంటూ జీవిస్తున్నారు. ఆనాటి పాలకులు సాగు నీరు, తాగునీరు అందిస్తామని ఎప్పటికప్పుడు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు విస్మరించారు.
ఆ ప్రాంతం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నందున నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఈ పునరావాస రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆనాటి అసెంబ్లీలో ప్రస్తావనకు తెచ్చి, కృష్ణా నదికి దగ్గరలో ఉన్న వేములూరు వాగు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయించి, దాన్ని కొద్ది కాలంలోనే పూర్తి చేయించి రైతుల భూములకు నీరు అందించే ఏర్పాటు చేయించడం జరిగింది. అట్టి లిఫ్ట్ ద్వారా కొన్ని భూముల్లో వరి పంట, కొన్ని భూముల్లో మెట్ట పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారు.
540 సర్వే నంబర్ భూమిలో మరి కొంతమంది బయటి ప్రాంతాల వారికి, భూమి ఎక్కడుందో తెలి యని వారికి అక్రమ పద్ధతుల్లో అధికారులు లాలూచీ పడి పట్టాలు ఇచ్చారు. వారు ఏనాడూ వ్యవసాయం చేయటంగానీ, భూముల దగ్గరికీ రావడంగానీ జరగ కుండానే పరిశ్రమలు పెట్టుకునే వారికి అమ్ము కున్నారు. ఆ భూములు ఎక్కడున్నాయో అమ్మినవారు గానీ కొన్నవారు గానీ పోడి చేయించుకోలేదు. నాగార్జున సాగర్ ముంపునకు గురైన గిరిజనులకు కేటాయించిన భూములపైకి కార్పొరేట్ కంపెనీలు అక్రమ పద్ధతుల్లో దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించు కోవటానికి పూనుకుంటున్నాయి. గిరిజనులు వేసిన పంట పొలాలు చెడగొట్టడం, వారిపై కిరాయి మను షులతో దాడి చేయించడం, తప్పుడు కేసులు పెట్టడం లాంటివి నిరంతరం చేస్తున్నాయి. దీనితో సమస్య తీవ్రంగా మారి అగ్గి రాజుకుంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు, ఇండ్లు వదిలేసి కట్టుబట్టలతో వచ్చిన ఈ నిర్వాసితులు దశాబ్దాలుగా అన్యాయానికి గురౌతూనే ఉన్నారు. వీరికి కేటాయించిన భూములపైకి ఎవ్వరూ వెళ్ళకుండా రక్షణ కల్పించాలని, వారు వ్యవసాయం చేసుకోవటా నికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించాలని, ఇండ్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. ఆ ప్రాంతంలో కొత్తగా మట్టపల్లి కృష్ణానదిపైన వంతెన నిర్మాణం పూర్తి కావడం, పులిచింతల ప్రాజెక్టు నీళ్ళు ఉండటం వలన కొంతమంది పెట్టుబడిదారుల కన్ను పడి కంపెనీల పేరుతో కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ దస్తావేజులు సృష్టించి భూములను అనుభవించటానికి పూనుకుంటున్నారు.
540 సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాల భూమి ఉందో సమగ్రంగా సర్వే చేయించి గిరిజనులకు కేటాయించిన భూముల పైకి ఎవ్వరూ వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వాధికారులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఇది ఘర్షణలకు దారి తీస్తోంది. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల భూములను ధరణి వెబ్‌సైట్‌లో చేర్చి వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. భూములన్నింటికీ సాగునీటి సౌకర్యం కల్పిం చాలి. ఈ సమస్య శాంతి భద్రతల సమస్యగా మార కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
- జూలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు,
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment