హీరో గానూ, ప్రతినాయ కుడిగానూ 200కు పైగా సినిమాల్లో నటించి ఒక నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకొన్న నటుడు అజిత్. మొదట హీరోగా నటించి, తర్వాత ఆధునిక పాశ్చాత్య ఆహార్యంతో ఆయన విలన్ పాత్రలకు గొప్ప హుందాతనాన్ని తెచ్చాడు. ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్. 1922 జనవరి 27న గోలకొండలో జన్మించాడు. ఆయన తండ్రి బషీర్ అలీ ఖాన్ పఠాన్ నిజామ్ సైన్యంలోనూ, పరిపాలనా విభాగంలోనూ పని చేశాడు. అజిత్ వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో... అతడి ప్రతిభను గుర్తించిన తోటి విద్యార్థులు, టీచర్లు ఆయనను సినిమాల్లో చేరమని ప్రోత్సహించడంతో అటువైపు ఆలోచిం చాడు. కానీ తండ్రికి అజిత్ సినిమాల్లో చేరడం అంతగా ఇష్టం ఉండేది కాదు. అయినా అజిత్ ఒక రోజు తన పుస్తకాలు అమ్మేసి 1943లో బొంబాయి రైలెక్కేశాడు.
తన వెంట హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కవి షాహిద్ సిద్దికీ బోంబేలో ప్రముఖ దర్శకుడు రఫీక్ ఘజ్నవీకి రాసిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళాడు. బోంబే వెళ్ళగానే రఫీక్ ఘజ్నవీని కలిసి పరిచయం చేసు కున్నాడు అజిత్. కానీ అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రఫీక్ తాను సినిమాలు తీయడం లేదని చెప్పడంతో ఇక ఎక్‌స్ట్రా వేశాలు వేస్తూ మూడేళ్లు గడిపాడు. 1946లో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్మించే డాక్యుమెంటరీ సినిమాలల్లో పనిచేసే అవకాశం అతడికి వచ్చింది. ఒక్కో ఫిల్మ్‌కు అజిత్‌కు 125 రూపాయల పారితోషికం లభించేది. అలా అజిత్ వేస్తున్న పాత్రలు, అతనిలోని ప్రతిభ కొంతమంది సినీ నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడ్డాయి. క్రమంగా అవకాశాలు పెరిగిపోయాయి. 1946లో గీతా బాలి హీరోయిన్‌గా అజిత్ హీరోగా ‘షా–ఏ–మిశ్రా’ సినిమా రూపొందింది. అలా అజిత్ సినీ ప్రస్థానం హీరోగా మొదలయింది. తర్వాత హాతిమ్ తాయి (1947), పతంగా, జీవన్ సాథీ (1949), బేకసూర్ (1950) తదితర సినిమాలతో అజిత్ క్రమంగా నటుడిగా స్థిరపడ్డాడు.
1945లో వచ్చిన ‘నాస్తిక్’ సినిమా ఆర్థికంగా గొప్ప విజయం సాధించడంతో అజిత్ బొంబేలో నటుడిగానూ, అటు ఆర్థికంగానూ స్థిరపడ్డాడు. 1955లో విడుదల అయిన ‘మరైన్ డ్రైవ్’ సినిమా 50 వారాలు ఆడి సాధించిన విజయం అజిత్‌లో నూతనో త్సాహాన్ని నింపింది. అందులో బీనా రాయ్ హీరో యిన్. తర్వాత ‘26 జనవరి’ 1956లో విడుదల అయింది. అందులో నళినీ జయంత్ నాయకి. అజిత్ హీరోగా నళిని జహాంత్‌తోనే అధిక సినిమాల్లో నటించాడు.
హిందీ సినిమా రంగానికి సంబంధించి నటన, నిర్మాణ, దర్శకత్వ తదితర అన్నీ రంగాల్లో ప్రధాన భూమికను పోషించిన ‘కపూర్’ వంశంతో అజిత్‌కు మంచి సంబంధాలు ఉండేవి. 1966లో రాజేంద్ర కుమార్ హీరోగా వచ్చిన ‘సూరజ్’లో విలన్‌గా నటించి తన నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు అజిత్. అప్పటికే విలన్లుగా పలువురు నటులు స్థిరపడి ఉన్నప్పటికీ అజిత్ తనదైన ప్రత్యేకతతో ‘ప్రిన్స్’ లాంటి పలు సినిమాలతో విలన్‌గా నిలదొక్కుకో గలిగాడు. 1973లో వచ్చిన ‘జంజీర్’ ఆయన విలనీ పాత్రలకు స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. అలా అజిత్ 57కు పైగా సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించాడు. అలా విలన్‌గా కెరీర్ కొనసాగుతూ ఉండగానే అజిత్ 1985లో సినిమాల్ని మానుకుని కుటుంబంతో సహా హైదరాబాద్ చేరుకున్నాడు. 1998 అక్టోబర్ 21న తన 76వ ఏట తాను అమితంగా ఇష్టపడే హైదరబాద్ నగరంలోనే తుది శ్వాస విడిచాడు.
- వారాల ఆనంద్
సినీ విమర్శకుడు
(‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’ తరఫున అజిత్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా...)
Comments
Please login to add a commentAdd a comment