ఇందిరా గాంధీ పొలిటికల్ టూల్ కిట్ నుండి నరేంద్ర మోదీ చాలావరకు అరువు తెచ్చుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత రాజకీయ సమస్యలకు విదేశీ హస్తాన్ని నిందించడం అటువంటి అరువు ఆలోచనే. ప్రభుత్వాధినేతలు తెరవెనుక శక్తులతో కొట్టుమిట్టాడేయుగంలో ఇందిర పనిచేయవలసి వచ్చిందనేది మనం గమనించాలి.
భారతదేశం బలహీనంగా, వెనుకబడి, అభివృద్ధి చెందకుండా ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. అభివృద్ధి చెందిన, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశం తమ ప్రయోజనాలకు సరిపోతుందని పాశ్చాత్య శక్తులు కూడా గుర్తించాయి. కాబట్టి, దేశీయ వైఫల్యాలను సమర్థించుకోవడానికి ఒక సాకు వెతకడం కన్నా, పారదర్శక పాలనపై దృష్టి పెట్టడం మేలు.
హిండెన్ బర్గ్, జార్జ్ సోరోస్ నుండి, అంత ర్జాతీయ మానవ హక్కుల సంస్థల నుండి వేగులు, గూఢచారుల వరకు, వివిధ రూపాల్లో విదేశీ హస్తం భారత దేశంలోకి తిరిగి జొరబడిందని ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనాను దేశం వీడేలా చేయడానికి యువకులు పెద్దఎత్తున నిరసనలు జరిపినప్పటికీ, ఆమె బహిష్కరణ వెనుక విదేశీ హస్తం ఉందని ఆరోపణలు వినబడుతున్నాయి.
కచ్చితంగా చెప్పాలంటే, మునుపటి ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో జరిగినట్లుగానే, కొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో దక్షిణాసియా ఒక ఆట స్థలం కావచ్చు. పెద్ద, చిన్న అనేక దేశాలు ఈ ప్రాంతంలో వాటాను పొందివున్నాయి. కాబట్టి, పాలనలో మార్పు వంటి విపత్తు సంఘటనలు సంభవించినప్పుడు, తెరవెనుక శక్తులు పనిచేస్తున్నా యని అనుకోవాల్సి వస్తుంది. అయితే, చాలా తరచుగా, దక్షిణాసియా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలకు స్వదేశంలోని పరిస్థి తులే కారణమవుతున్నాయి.
అప్పటినుంచే మొదలు...
అప్పుడప్పుడూ, భారతీయ రాజకీయ చర్చల్లో విదేశీ హస్తం ప్రత్యక్షమవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, సాక్షాత్తూ ప్రధానమంత్రే భారతదేశ అంతర్గత స్థిరత్వం, పురోగతి అంశాలపై ఉన్న ప్రపంచ ముప్పు గురించి మాట్లాడారు. అదేసమయంలో అఖండమైన పార్లమెంటరీ మెజారిటీతో ‘బలమైన, స్థిరమైన’ ప్రభుత్వ ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భంలో, ఓటర్లు ఆ ముప్పును సీరియస్‌గా తీసుకోలేదు. మోదీకి అంతంత అనుకూల ఫలితాన్ని మాత్రమే అందించారు.
ఇందిరా గాంధీ పొలిటికల్ టూల్ కిట్ నుండి నరేంద్ర మోదీ చాలావరకు అరువు తెచ్చుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. తన రాజకీయ సమస్యలకు విదేశీ హస్తాన్ని నిందించడం అటువంటి అరువు తెచ్చుకున్న ఆలోచనే. ప్రభు త్వాధినేతలు తెరవెనుక శక్తులతో కొట్టుమిట్టాడే యుగంలో ఇందిర పనిచేయవలసి వచ్చిందనేది మనం గమనించాలి. చిలీకి చెందిన సాల్వడార్ అలెండే 1973లో హత్యకు గురైన తర్వాత, విదేశీ హస్తం తదుపరి లక్ష్యం తానేనన్న భయంతో ఆమె 1974లో ఎమర్జెన్సీ పాలన విధించి ఉండవచ్చని ఆమె మీడియా సలహాదారు, దివంగత హెచ్‌వై శారదా ప్రసాద్ రాశారు. ఫిడెల్ క్యాస్ట్రో(క్యూబా), లియోనిడ్ బ్రెజ్నెవ్ (రష్యా) ఇద్దరూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారని ఆయన తన నోట్స్‌లో పేర్కొన్నారు.
1960లు, 1970లు ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా కొనసాగినకాలం. నిజానికి అది విదేశీ హస్త యుగం. అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ తమ సొంత శక్తిని పెంపొందించుకోవడానికి మిత్రులను, తోలుబొమ్మలను వెతుకుతూ ఉండేవి. భారతదేశం అప్పట్లో పాశ్చాత్య శక్తులకు అభిముఖంగా ఉండేది. నేడు భారతదేశం తనను తాను అమెరికాకు ‘వ్యూహాత్మక భాగస్వామి’గానూ ‘నాటోయే తర మిత్రదేశం’ గానూ భావిస్తోంది. అయినప్పటికీ, విదేశీ హస్తం చుట్టూ ఉన్న రాజకీయాల్లో అమెరికాను కూడా అనుమానించవలసి రావడాన్ని తోసిపుచ్చలేం.
ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో, విదేశీ హస్తం గురించి చర్చ తగ్గుముఖం పట్టింది కానీ, అది పూర్తిగా అదృశ్యం కాలేదు. సోవియట్ యూనియన్ రద్దు కావడంతో అమెరికాకు భారతదేశం చేరువకావడం; పశ్చిమం వైపు వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడం; ఆంగ్లం మాట్లాడే దేశాల పౌరసత్వాన్ని కోరుకోవడం పెరగడంతో, బహిరంగ చర్చల నుండి విదేశీ హస్తం ప్రస్తావన వెనక్కి తగ్గింది. కానీ, తమిళ నాడులోని కుడంకుళం వద్ద రష్యా సహాయంతో ఏర్పాటుచేస్తున్న అణు కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని నిరసనలు జరగడం వెనుక విదేశీ హస్తం ఉందని 2012లో అప్పటి ప్రధాని మన్మోహ¯Œ సింగ్‌వంటి వివేకం కలిగిన నాయకుడు కూడా భావించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అన్నింటికీ అదేనా?
ఈ నేపథ్యంలో మోదీ లాంటి నాయకుడి హయాంలో బీజేపీలాంటి రాజకీయ పార్టీకి ప్రతి సమస్య, సవాలు వెనుక విదేశీ హస్తం కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒక దశాబ్ద కాలంగా దేశంలోని వివిధ ఏజెన్సీలు, ఫోర్డ్ ఫౌండేషన్ నుండి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వరకు అన్ని రకాల సంస్థలను విదేశీ హస్తాలు పన్నిన కుట్రదారులుగా బీజేపీ ఆరోపిస్తోంది. కాబట్టి, భారతదేశంలోని అధికార యంత్రాంగంలోని చాలామంది షేఖ్ హసీనాను తొలగించడం వెనుక మాత్రమేకాకుండా, హిండెన్ బర్గ్ చేసిన స్టాక్ మార్కెట్ విశ్లేషణ పరిశోధన వెనుక కూడా విదేశీ హస్తం ఉందని భావించడంలో ఆశ్చర్యం లేదు.
విదేశాలలో ‘భారతీయ హస్తం’ పని చేస్తున్నట్లే, భారతదేశంలో చాలా విదేశీ హస్తాలు పనిచేస్తూ ఉండవచ్చు. భారతీయ ఏజెంట్లు విదేశాల్లో హత్యాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా పరిగణిస్తున్నారు. భారతీయ హస్తం పదును దేరుతోందని ఇది సూచిస్తోంది. ఒక దేశం వెలుపల ఉన్న శక్తులు ఒకరిపై కుట్ర పన్నుతుంటే గనక, అటువంటి దేశంలోని ఏ ప్రభు త్వమైనా సరే విస్తృతంగా పరిశీలించి, విదేశీ హస్తాలు ఆటాడేందుకు సహాయపడే స్థానిక శక్తులపై ఎలాంటి చర్యలనైనా తీసుకోవచ్చు అనేది ఇక్కడ గ్రహించాల్సిన ప్రాథమికాంశం.
ఇంటిని దిద్దుకోవాలి!
అనిశ్చితమైన, వేగంగా మారుతున్న ప్రపంచంలో, భారతదేశం వంటి ప్రధాన శక్తి అంతర్గత భద్రత, పాలనపై దృష్టి పెట్టాలి. తద్వారా ‘విదేశీ హస్తం’ ఆడుకోవడానికి స్థలాన్ని తెరిచే పరిస్థితులను సృష్టించకూడదు. జరిగే ప్రతి తప్పిదానికీ ‘విదేశీ హస్తం’ బాధ్యత వహించాలని ఆరోపించడం ద్వారా దేశీయంగా ఉన్న అసమర్థ పాలననుండి జనాల దృష్టిని మళ్లించడం సులభం. నిజానికి హసీనా తన బహిష్కరణకు తానే పునాది వేసుకున్నారు. వాస్తవం ఏమిటంటే, భారతదేశంలోని దర్యాప్తు సంస్థల నుండి నియంత్రణ సంస్థల వరకు వివిధ సంస్థల ఏకపక్ష చర్యలు... సందేహాస్పద నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ప్రచ్ఛన్న యుద్ధ యుగం దేశాన్ని అస్థిరపరిచే శత్రుపూర్వక విదేశీ హస్తం జ్ఞాపకాన్ని మిగిల్చిందనడాన్ని తోసిపుచ్చలేము. వలసవాద అనంతర సమాజంలో ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ రాజ్యంగా మారిన జ్ఞాపకాన్నీ విస్మరించలేము. కాబట్టి ‘విదేశీ హస్తం’ అనేది కేవలం వేగులు, పంచమాంగదళం లాంటి అనుమానిత చర్యలలో మాత్రమే కాకుండా కార్పొరేట్, ఆర్థిక ప్రపంచంలోని వారి చర్యలలో కూడా కనిపిస్తుంది.
అయితే, భారతదేశం మునుముందుకే నడిచింది. చాలా తక్కువ దేశాలు మినహాయిస్తే, భారతదేశం బలహీనంగా, వెనుకబడి, అభివృద్ధి చెందకుండా ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. అభివృద్ధి చెందిన, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశం తమ ప్రయోజనాలకు సరిపోతుందని పాశ్చాత్య శక్తులు గుర్తించాయి. ఆఖరికి మన విదేశాంగ విధానం కూడా దేశ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన బాహ్య వాతావరణాన్ని కోరుకుంటోంది. కాబట్టి, దేశీయవైఫల్యాలు, దుష్పరి పాలనను సమర్థించుకోవడానికి ఒక సాకు కోసం వెతకడం కన్నా, స్వదేశంలో మంచి, పారదర్శక పాలనపై దృష్టి పెట్టడం మేలు.
- వ్యాసకర్త మాజీ పత్రికా సంపాదకుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- సంజయ బారు
Comments
Please login to add a commentAdd a comment