ఇటీవల హైదరాబాద్ నగరంలో ‘నిర్భయ’ ఘటన తరహాలో కారులో నడిరోడ్డు మీద సామూహిక అత్యాచార పర్వం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఇందులో ప్రముఖుల పుత్ర రత్నాలు ఉండటంతో అనేకమంది రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు.
మే 8న చౌటుప్పల్ ప్రాంతంలో ఓ ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగింది. ఆ మధ్య... వికారాబాద్ సమీపంలో మరో మహిళా అత్యాచారానికి గురైంది. ఇలా... ప్రతిరోజూ దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఇటువంటి దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ‘నిర్భయ’ దుర్ఘటన తరువాత ప్రత్యేకంగా ‘నిర్భయ’ చట్టాన్ని తీసుకొచ్చారు. 2012–2013 సంవత్సరాల మధ్య హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇటువంటి మరో ఉదంతం వెలుగు చూడటంతో ఆ ఘటనకు ‘అభయ’ ఘటన అని పేరు పెట్టారు.
ఇలాగే... 2019లో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్– షాద్‌నగర్‌ల మధ్య జరిగిన అత్యాచార ఘటనకు ‘దిశ’ అని పేరు పెట్టారు. ఈ ‘దిశ’ పేరుతో ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని అమలుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు... ఈ మధ్య ఓ యాప్‌ను కూడా రూపొందించారు. తెలంగాణలో సైతం ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ను, స్పెషల్ మొబైల్ వెహికిల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు ఇలా... అత్యాచారాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ... కొందరి పురుషుల మనస్తత్వాల్లో ఏమాత్రం మార్పు రాకపోవడమే విడ్డూరం. మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారు ముక్కుపచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారాలు చేస్తూ... చట్టాలపట్ల ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. (క్లిక్: హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?)
ముఖ్యంగా యువకులు ఇటువంటి పెడ ధోరణి వైపు పయనించడానికి నేటి సామాజిక మాధ్యమాలు, అందుబాటులో ఉన్న డ్రగ్స్, మద్యం వంటివే ప్రధాన కారణాలని చెప్పవచ్చు.
– కె. ధనలక్ష్మి, సెక్రటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment