
కాశీ విశ్వనాథ్ మందిరం – జ్ఞానవాపి మసీదు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇస్లాం నిజంగానే శాంతి కాముక మతమని నిరూపించుకునేందుకు కాశీ, మథురలను హిందువులకు అప్పగించాలి. అయితే కొత్తగా మరి ఏ ఇతర ప్రార్థనా స్థలాలపై హక్కులు కోరబోమన్న భరోసాను ముస్లింలకు హిందువులు కూడా కల్పించాలి.
బాబ్రీ మసీదు విధ్వంసా నికి దాదాపు ఏడాదిన్నర ముందే వివాద పరిష్కారం కోసం ఓ ప్రత్యామ్నా యాన్ని ప్రతిపాదించారు ఇద్దరు ముస్లిం ఆలోచనాపరులు. ఈ ఇద్దరిలో ఒకరైన ప్రముఖ పరిశో ధకులు సంఘ సంస్కర్త యాసిన్ దలాల్ 1991లో ‘బిజినెస్ అండ్ పొలిటికల్ అబ్జర్వర్’లో ‘ముస్లిమ్స్ షుడ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్’ పేరుతో రాసిన ఓ కథనంలో ‘‘తగిన సమయంలో బాబ్రీ మసీదును ఇంకో చోటికి తరలించడం ద్వారా బాబ్రీ కమిటీ వీహెచ్‌పీ–బీజేపీ ప్రాబల్యాన్ని ఆశ్చర్యకరంగా తగ్గించి ఉండ వచ్చు. ఈ చర్య రామ జన్మభూమి మద్దతుదారులకు అశనిపాతంలా మారి ఉండేది. కానీ దీనికి బదులుగా అటు ప్రభుత్వమూ, ఇటు ముస్లిం నేతలిద్దరూ మొండి పట్టుదలకు పోయారు. తద్వారా తమకు తెలియకుండానే బీజేపీ గెలుపునకు దోహదపడ్డార’’ని రాశారు.
యాసిన్ దలాల్ మాత్రమే కాదు... సీనియర్ జర్నలిస్ట్ ఎల్.హెచ్. నఖ్వీ కూడా బీజేపీకి మద్దతివ్వడం ద్వారా ముస్లింలు దిక్కుమాలిన రాజకీయం తీరుతెన్నులను మార్చేయాలని అప్పట్లో పిలుపునిచ్చారు. ‘మంథన్’ 1991 జూన్ సంచికలో ఆయన ఒక కథనం రాస్తూ... ‘‘కాంగ్రెస్ మైనార్టీ వర్గాల్లో ఒక అభద్రతా భావాన్ని పెంచి పోషించిందని ఆరో పించారు. అందుకే ఇప్పుడు ముస్లింలు బీజేపీకి మద్దతిస్తే తప్పేంటి?’’ అని వ్యాఖ్యా నించారు.
ముందుగా చెప్పినట్లు ఈ రెండు వ్యాసాలూ రాసింది బీజేపీకి బద్ధ వ్యతిరేకులైన ఇద్దరు ముస్లిం ఆలోచనాపరులు. ఇద్దరి ఉద్దేశాలూ శాంతిస్థాపనే. తర్కయుతమైన ఆలోచనలే. ముస్లిం నేతలు ఇలాంటి వారి మాటలు విని ఉంటే అపార ప్రాణ నష్టం నివారించేందుకు అవకాశం ఉండేది. ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ కె.కె. ముహమ్మద్ వాంగ్మూలం ద్వారా ఇప్పుడు మనకు ఇంకో విషయం కూడా తెలుసు. మార్క్సిస్ట్ చరిత్ర కారులు అస్తవ్యస్తతకు పాల్పడి ఉండకపోతే ముస్లింలు రామజన్మభూమి స్థలాన్ని ఎప్పుడో అప్పగించి ఉండేవారని ఆయన అన్నారు.
కాశీ విశ్వనాథ్ మందిరం, జ్ఞానవాపి మసీదు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో సహజంగానే కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది.
–ఇస్లాం నిజంగానే శాంతి కాముక మతమని నిరూపించుకునేందుకు కాశీ, జ్ఞానవాపీ దేవాలయాల సముదాయాన్ని తిరిగి తమకి ఇచ్చేయాలన్న హిందువుల డిమాండ్‌ను నేరవేర్చడం అనేది ప్రస్తుత ముస్లిం నేతలకు మంచి అవకాశం. మరి వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా?
– జ్ఞానవాపి మాదిరిగానే దేశంలో అనేక ఇతర డిమాండ్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పడేది ఎలా?
ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.
ముస్లిమేతరుల దేవాలయాలను ధ్వంసం చేయడం... ఇస్లామిక్ ప్రార్థన స్థలాలను నిర్మించడం ఇతర మతస్థులందరిపై జరిపిన దాడి, దుందుడుకు చర్య. వారిని దాస్యులుగా చేసుకునేందుకు చేసిన ప్రయత్నం. అప్పటివరకూ ఉన్న ‘‘తప్పులతో కూడిన విశ్వాసాలు, అజ్ఞాన యుగాన్ని అంతరింపజేసి’’ ప్రత్యామ్నాయంగా ఇస్లాంను స్థాపించడం ప్రాథమికమైన లక్ష్యం. ఇప్పటికీ ఇదే రకమైన భావజాలాన్ని అనుసరించే శక్తిమంతమైన ఇస్లామిక్ రాజకీయం నడుస్తూనే ఉంది. వేదాంతంలో వైవిధ్యాన్ని వీరు సహించ లేరు. అదే సమయంలో వీటిని తమ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నమూ చేస్తారు.
హిందువులు నివసించే భూభాగంలో కాశీ, మథుర, అయోధ్యలు మూడు పుణ్యక్షేత్రాలు. ప్రపంచంలో ఉండే హిందువులందరూ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని కోరుకుంటారు. మరి.. అటువంటి వాళ్లు ఇక్కడికొస్తే కనిపించేదేమిటి? అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో మసీదులు కనిపిస్తాయి. ఇది వారిని బాధిస్తుంది. హేళన చేసినట్టుగానూ ఉంటుంది. వారి మనసులకయ్యే గాయాలు ఎంతో కాలంగా అలా పచ్చిగానే ఉన్నాయి. ఈ దేశ సామరస్యాన్ని దెబ్బతీయగల టైమ్ బాంబులు ఈ మానని గాయాలు! భారీయుద్ధం, జన నష్టం తరువాత అయోధ్య సమస్య కొంత సమసిపోయింది. మరి కాశీ, మథురల పరిస్థితి ఏమిటి? కార్యాచరణ ఏమైనప్పటికీ శివుడి దర్శనం కోసం ఓ నంది, తన జన్మస్థానాన్ని పొందేందుకు కృష్ణుడు మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే.
ఒకవేళ న్యాయ, రాజకీయ యుద్ధాల్లో హిందువులు బలవంతంగా పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే... హిందువులను కించపరిచే బుద్ధి ఇంకా కొనసాగుతూనే ఉందని అనుకోవాలి. అదే జరిగితే ఇస్లాం చొరబాటుదారులు ధ్వంసం చేసిన, బలవంతంగా ఆక్రమించిన ప్రతి దేవాలయంపై హక్కులు కోరడంలో తప్పేమీ ఉండదు. దీనికి బదులుగా ముస్లిం నేతలు కాశీ, మథురలను తమంతట తాముగా అప్పగిస్తే హిందువులు దాన్ని అంగీకరించాలి. ఆ తరువాత హిందూ ధర్మాచార్యులు కొత్తగా ఎలాంటి ప్రార్థనా స్థలాలపై హక్కులు కోరబోమన్న భరోసాను ముస్లింలకు కల్పించాలి. (👉🏾చదవండి: ఈ సర్వేల ‘న్యాయం’ ఎన్నాళ్లు?)
- అరవిందన్ నీలకంఠన్
కంట్రిబ్యూటింగ్ ఎడిటర్, ‘స్వరాజ్య’
Comments
Please login to add a commentAdd a comment