కుల రక్కసి సృష్టించిన అసమానతల వ్యవస్థపై దేశంలో తిరుగుబాట్లెన్నో జరిగాయి. స్వతంత్ర∙భారత తొలి దళిత ప్రతిఘటనగా నిలిచిన ‘కీలవేణ్మని పోరాటం’ అందులో ఒక మహోజ్వల ఘట్టం. ‘త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి. ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు. నా జన్మస్థలం కీలవేణ్మని...’ అంటూ ఆ తమిళ పల్లె ధిక్కార స్వరాన్ని అక్షరీకరించాడు కలేకూరి ప్రసాద్. 1960 దశకంలో తమిళనాడులోని కావేరీ డెల్టాలో భాగమైన పూర్వపు తంజావూరు జిల్లా సస్య శ్యామలంగా విలసిల్లేది. అయితే భూమి గల ఆసాములందరూ అగ్ర వర్ణాల వారు కాగా, రైతుకూలీలలో తొంభై శాతం నిమ్న వర్గాలకు చెందినవారే. మగవాళ్లు ఒంటి పైభాగంలో వస్త్రం వేసుకోవడం, వీధుల్లో చెప్పులేసుకుని నడవడం, దళిత స్త్రీలు వక్షస్థలాన్ని దాచుకోవడం నిషిద్ధం.
ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతు కూలీలు సంఘటితమై సీపీఎం నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1968లో కూలీ రేట్లు పెంచాలనే ఉద్యమం ఊపందుకున్నది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు పొలాలలో పనులు సాగవంటూ రైతు కూలీలు సమ్మెకు దిగారు. భూస్వాములు పోటీగా వ్యవసాయదారుల సంఘాన్ని స్థాపించారు. స్థానిక కూలీలను తొలగించి, వేరే ప్రాంతాల నుండి కూలీలను తెచ్చి పనులు చేయించడం మొదలు పెట్టారు.
డిసెంబర్ 25, 1968న భూస్వాముల గూండాలు... గణ పతి, ముత్తుస్వామి అనే కార్మిక సంఘం కార్యకర్తలను కిడ్నాపు చేసి చిత్రహింసలకు గురిచేశారు. రైతు కూలీలందరూ కర్రలు, బరిసెలు పట్టుకుని ఊరేగింపుగా బయల్దేరి, భూస్వాముల ఇండ్లపై దాడి చేసి తమవారిని విడిపించుకున్నారు. ఆ దాడిలో ఒక భూస్వాముల గూండా రైతుకూలీల చేతుల్లో చనిపోవడం జరిగింది. రైతు కూలీల ప్రతిఘటన భూస్వాముల ఉక్రోషాన్ని రెచ్చగొట్టింది. పోలీసుల అండతో అదేరోజు రాత్రి దళితవాడపై దండెత్తారు. భూస్వాముల పక్షం వహించిన పోలీసులు అకార ణంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు మరణిం చారు.
మిగతా వారందరూ పోలీసుల దాడినుండి తప్పించు కునే క్రమంలో రైతుకూలీ రామయ్యకు చెందిన గుడిసెలో తలదాచుకున్నారు. గోపాలకృష్ణన్ నాయుడు, ఇతర భూస్వా ములూ గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించమని గుండాలను ఆదేశించారు. క్షణాల్లో రామయ్య గుడిసె అగ్నిగుండంగా మారింది. లోపల తలదాచుకున్న వారు ఆర్తనాదాలు చేస్తూ అగ్నికి ఆహుతయ్యారు. పసి పిల్లల్నైనా రక్షించుకుందామనే ఆశతో తగలబడుతున్న తల్లులు తమ పిల్లల్ని బయటకి గిర వాటు వేస్తే... బయటనున్న భూస్వాములు వాళ్లని మళ్లీ గుడిసె మంటల్లోకి తోశారు. తెల్లారి తీరిగ్గా వచ్చిన పోలీసులు... కాలి బూడిదైన గుడిసె పరిసరాలను పరిశీలిస్తే... 44 మంది దళిత బిడ్డల కాలిన శవాలు దర్శనమిచ్చాయి. 23 మంది పిల్లలు, 16 మంది మహిళలు, ఐదుగురు పురుషులు.
కీలవేణ్మని మారణకాండ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై తన మంత్రివర్గంలోని పీడబ్ల్యూడీ శాఖ మంత్రి కరుణానిధిని తక్షణం కీలవేణ్మని వెళ్లి పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించాడు. కేరళలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఉన్న సీపీఎం నాయకులు జ్యోతిబసు, రణదివే, రామ్మూర్తి హుటాహుటిన కీలవేణ్మని చేరుకున్నారు. తంజావూరు జిల్లాలోని రైతు కూలీ సంఘాల కార్యకర్తలందరూ బహిరంగ సభ నిర్వహించి ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయారు. పార్టీ నాయకులు వారిని శాంతింప జేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుందామని నచ్చజెప్పారు.
నాగపట్టిణం జిల్లా కోర్టు గోపాలకృష్ణన్ నాయుడుతో సహా పది మందిని దోషులుగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధిస్తే.. మద్రాస్ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే నెపంతో రద్దు చేసింది. డబ్బున్న ఆసాములు ఇళ్లలోనే ఉండి తమ మనుషు లకు ఆదేశాలు ఇస్తారు తప్ప స్వయంగా మారణకాండలో పాల్గొన్నారంటే నమ్మలేము... అనే కారణాలను న్యాయమూర్తి పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం సైతం బాధితులకు న్యాయం అందించడంలో ప్రేక్షక పాత్ర వహించింది. రామయ్య గుడిసె స్థానంలో ఒక స్మారక స్థూపాన్ని ఏర్పరచి 44 మంది అమర వీరుల పేర్లు చెక్కారు. మాయంది భారతి అనే స్వాతంత్య్ర సమర యోధుడు మారణకాండ జరిగిన మరుసటి రోజు మృత వీరుల అవశేషాలను గాజు గిన్నెలో సేకరించాడు. ఆ గిన్నెను స్మృతి చిహ్నంలో నిక్షిప్తం చేశారు.
ఐద్వా జాతీయ నాయకురాలు మైథిలి శివరామన్ విస్తృ తంగా వ్యాసాలు రాసి... బాధితులకు బాసటగా రాష్ట్ర ప్రజ లను సమీకరించారు. ఆ ప్రతిఘటనపై ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుదిప్పునల్’కు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 1983లో ఆ నవల ఆధారంగా ‘కన్న్ శివంతల్ మన్న్ శివక్కం’ తమిళ చిత్రం వచ్చింది. 2019లో వచ్చిన అసురన్ (తెలుగులో నారప్ప) సైతం దీన్ని ఇతివృత్తంగా తీసుకున్నదే.
– ఆర్. రాజేశమ్
కన్వీనర్, సామాజిక న్యాయవేదిక ‘ 94404 43183
(నేడు కీలవేణ్మని మృతవీరుల సంస్మరణ దినం)
Comments
Please login to add a commentAdd a comment