జాతీయ రహదారికి ముప్పై కిలోమీటర్ల దూరాన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మించి ప్రజలెవరికీ వాటిని అందుబాటులో లేకుండా చేశారు చంద్రబాబు. అక్కడ అనూహ్యమైన ధరలు పెరగడానికి మాత్రం ఉపయోగపడ్డారు. దానివల్ల సామాన్యులు ఎవరూ రాజధాని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. లక్ష కోట్లు ఒకే చోట వ్యయం చేయడం సబబుకాదని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. అమరావతిలో డెబ్బై ఐదు శాతం పనులు జరిగిన నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతుందో అదంతా చేయడం ద్వారా ఆ గ్రామాల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం ఇప్పుడు అవసరం.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మూడువేల కోట్ల రూపాయలతో పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి విషయంగా చెప్పాలి. దీనివల్ల ఆ ప్రాంత గ్రామాలవారిలో ఏర్పడిన అనుమానాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం అక్కడ ఒక్కచోటే లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని ప్రతిపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయానికి అది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలు కొన్నిటివల్ల అక్కడి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులతో పాటు వివిధ వర్గాలవారు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఏకంగా 33 వేల ఎకరాల భూమిని సమీకరించడమే పెద్ద తప్పు అని చెప్పాలి. రాజధాని నిర్మాణానికి అంటే సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వాటి నిర్మాణానికి ఇంత భారీ ఎత్తున భూమి అవసరం లేదు. అయినా తానేదో ఆధునిక నగర నిర్మాతను అనిపించుకోవాలనో, తన వాళ్లకు రియల్ ఎస్టేట్ రూపంలో బాగా లాభాలు ఆర్జింప చేయాలనో, ఏ కారణం వల్ల అయితేనేం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు వ్యవహరించారు. అన్ని నిర్మాణాలూ జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించారు. ఎవరైనా మీరు చేస్తున్నది తప్పు.. ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం, వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించడానికే వేల కోట్ల వ్యయం చేయడం.. ఇదంతా భారం అవుతుందని చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. పోనీ కీలకమైన వాటినైనా పూర్తి చేశారా అంటే అదీ లేదు. ప్రతిదీ నాటకీయంగా మలిచి ప్రజలలో సెంటిమెంట్ రేకెత్తించడానికి యత్నించారు. రాష్ట్రంలోని అన్నిగ్రామాల నుంచి మట్టి తెప్పించడం, ఆయా నదుల నుంచి నీరు తెప్పించడం ఇలా రకరకాల జిమ్మిక్కులకు ఆయన పాల్పడ్డారు.
జాతీయ రహదారికి ముప్పై కిలోమీటర్ల దూరాన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మించి ప్రజలెవరికీ వాటిని అందుబాటులో లేకుండా చేశారు. తదుపరి శాశ్వత భవనాల నిర్మాణాల పేరుతో పెద్ద తంతు నిర్వహించే యత్నం చేశారు. శంకుస్థాపనలకే కోట్ల రూపాయల వ్యయం చేశారు. అక్కడ అనూహ్యమైన ధరలు పెరగడానికి మాత్రం ఉపయోగపడ్డారు. దానివల్ల సామాన్యులు ఎవరూ రాజధాని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు విజయవాడ, ఇటు గుంటూరు నగరాలతో పాటు ఆ రెండు జిల్లాల్లోని ఇతర ప్రాంతాలలో భూముల విలువలు బాగా పడిపోయాయి. చంద్రబాబు దృష్టి అంతా కేవలం ఆ 29 గ్రామాల భూములు, వాటి పరిసరాలలో విలువలు పెంచడంపైనే ఉండేది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ గజం 1,200 గానే ఉంచి, మొత్తం కోట్ల నల్లధనం లావాదేవీలకు ఆస్కారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు అక్కడ కూడా టీడీపీకి దూరం అయి ఆ పార్టీని ఓడిం చారు.
ఈ పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పలు సమస్యలు ఎదురయ్యాయి. లక్ష కోట్లు ఒకే చోట వ్యయం చేయడమా? లేక అన్ని ప్రాంతాల అభివృద్ధికి వీలుగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడమా అన్న మీమాంసపై తర్జనభర్జన పడింది. ఒక నగరాన్ని లక్షల కోట్ల వ్యయంతో నిర్మించడం కన్నా, ఉన్న పెద్ద నగరాన్ని వాడుకోవడం బెటర్ అని భావించి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. కర్నూలును న్యాయపరమైన రాజధాని అని, అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధాని అని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఆ ప్రాంత రైతుల పేరుతో కానీ, ఇతరత్రా కానీ పలువురితో హైకోర్టులో కేసులు వేయించింది. ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. దానికితోడు ఇన్‌సైడ్ ట్రేడింగ్, భూ కుంభకోణాల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, హైకోర్టు స్టే ఇచ్చింది. మొత్తం వ్యవహారం అంతా కోర్టు పరిధిలోకి వెళ్లడం, కొంతమందితో టీడీపీ నాయకత్వం నిరసనలు చెప్పించడం, ఆందోళనలు కొనసాగించడం వంటివి చేయసాగింది. అదంతా ఇంకా కొలిక్కి రాలేదు.
బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా తమ భూములకు రియల్ ఎస్టేట్ విలువలు అధికంగా ఉండడం కోసం ఆందోళనలు చేస్తున్నారు. అన్ని ఆఫీస్‌లు ఒకే చోట ఉండాలన్న డిమాండ్‌తో వారు దీక్షలు చేస్తున్నారు. దీనికి కొన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తుండడంతో ప్రభుత్వం అక్కడ ఏ కార్యక్రమం చేపట్టడానికీ ముందుకు వెళ్లలేకపోయింది. అక్కడి రైతులు అనండి, భూ యజమానులు అనండి.. వారంతా తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో పడకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి కోరికలేమిటో వెల్లడించి ఉంటే ఈ సమస్య ఇంత క్లిష్టమయ్యేది కాదనిపిస్తోంది. తాజాగా కృష్ణా కరకట్టను 150 కోట్లతో విస్తరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జాతీయ రహదారికి ఆయా రోడ్లను అనుసంధానం చేయాలని తలపెట్టారు. డెబ్బై ఐదు శాతం పనులు జరిగిన నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడడానికి ఆస్కారం కలుగుతుంది. గతంలో ఇక్కడ అగ్రికల్చరల్ హబ్ లేదా, ఐటీ హబ్ వంటివాటిని ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. అలాంటివాటి ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే గత ప్రభుత్వం కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయించింది. వాటిలో ఆ కార్యాలయాలు కొన్ని అయినా వచ్చేలా చర్యలు తీసుకుంటే ఆ ప్రాంతంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న భావన ఏర్పడుతుంది.
ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలను ఏ రకంగా ఉపయోగించాలన్న దానిపై ఒక స్పష్టత తెచ్చుకోవాలి. కృష్ణానదిపై గొల్లపూడి ప్రాంతంలో వంతెన నిర్మించడం, కాజ నుంచి ఇటు కృష్ణా జిల్లాలోని అవుటపల్లి వరకు బైపాస్ రోడ్డును వేగంగా నిర్మించడం వంటి పనులు చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు శాసన రాజధాని అని ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రాంతంలో మళ్లీ విలువలు బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విశాఖతో పాటు అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందన్న విషయం ప్రజలకు అర్థం అవుతుంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నగరాలు అంటూ ఏవేవో ప్రచారం చేశారు కానీ అవేవీ ఒక రూపానికే రాలేదు. పైగా అవసరం లేని భారీ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆర్థిక భారం మోపే యత్నం చేశారు. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధానులను పోలిన విధంగా నగరాన్ని నిర్మిస్తున్నామని చెబుతూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు. అన్నిటిపై ప్రజలను ఊహలలో ఉంచాలని చూశారు. కాని ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యాచరణకు దిగితే బాగుంటుంది. భూములు ఇచ్చిన రైతులకు కౌలు ఇస్తున్న మాట నిజమే కావచ్చు. కానీ వారికి ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. గత ప్రభుత్వం వాటిని కాగితాలకే పరిమితం చేసింది. ఈ ప్రభుత్వం ఆచరణలో ఎంతవరకు చేయగలుగుతుందో అదంతా చేయడం ద్వారా ఆ గ్రామాల వారిలో విశ్వాసం పెంపొందించాలి. ఇదంతా కష్టమైన విషయమే కావచ్చు. గత ప్రభుత్వం దీనినంతటినీ ఒక పెద్ద ఊబిలా మార్చిన మాట నిజమే. కానీ ఆ ఊబిలో చిక్కుకోకుండా జగన్ ప్రభుత్వం జాగ్రత్తపడింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఊబి ఉంది కదా అని వదలివేయడం కాకుండా, అక్కడి ప్రజలు ఎంతో కొంత సంతోషపడేలా ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్లడం ఉభయత్రా ప్రయోజనకరం అని చెప్పాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
గ్రాఫిక్స్ భ్రమలు తొలగడం మంచిదే
Published Wed, Mar 10 2021 12:39 AM | Last Updated on Wed, Mar 10 2021 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment