వ్యక్తిగత ప్రయోజనాల పాదయాత్ర | Kommineni Srinivasa Rao Article On Tdp Leaders Padayatra About Amaravati Lands | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత ప్రయోజనాల పాదయాత్ర

Published Wed, Nov 10 2021 12:28 AM | Last Updated on Wed, Nov 10 2021 12:31 AM

Kommineni Srinivasa Rao Article On Tdp Leaders Padayatra About Amaravati Lands - Sakshi

చరిత్రలో ఎక్కడైనా సామాన్యుల సమస్యలపై పాదయాత్రలు జరుగుతుంటాయి. లేదా తమ సమస్యలు తీర్చాలని కోరుతూ పాదయాత్రలు చేయవచ్చు. దేశంలో ఈ తరహా పాదయాత్ర ఇదొక్కటే కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజ ధాని రైతుల పేరుతో కొంతమంది చేస్తున్న పాదయాత్ర చిత్రమైనదే. అందులోనూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ పేరు పెట్టడం కూడా విడ్డూరమే.

రాజధానికి వీరు భూములు ఇచ్చిన మాట నిజమే కావచ్చు. అందుకు తగిన ప్యాకేజీ  పొందుతున్నారు. ప్రతి ఏటా తప్పకుండా కౌలు తీసుకుంటున్నారు. మరో వైపు రాజధాని అనడంతో తెల్లవారేసరికల్లా ఎకరా పది, పదిహేను లక్షలున్న భూముల విలువ కోట్లకు ఎగబాకింది.  4 వేల ఎకరాలకు పైగా తెలుగుదేశం నేతలు లేదా వారికి సంబంధించినవారు ముందస్తు సమాచారం ఆధారంగా  భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 

మరోవైపు రాజధానిలో నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడ తామనీ, నవ నగరాలు నిర్మిస్తామనీ ప్రచారం చేసుకున్న ఆనాటి సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి అర్జెంట్‌గా లక్షా పదివేల కోట్ల రూపాయలు పంపించాలని వినతిపత్రం ఇచ్చారు. ఆ డబ్బు ఇవ్వలేదని అప్పట్లో మోదీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి రాజధానిలో లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయడాన్ని వ్యతిరేకించారు. దాని ఫలితమే టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అవడం. అయినా చంద్ర బాబు తన రాజకీయం మానుకోలేదు. కొందరితో దీక్షలు అంటూ కొత్త అంకానికి తెరదీశారు. అంతా కలిపి వంద మంది కూడా లేకపోయినా దీక్షలు అదరహో అంటూ టీడీపీ మీడియా ప్రచారం సాగింది. 

విశాఖపట్నం నగరం అయితే రెడీమేడ్‌గా ఉంటుందనీ, ఒకే చోట లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం ఉండదనీ జగన్‌ భావించారు. హైదరాబాద్‌కు అది దీటుగా అవుతుందని తలపోశారు. తెలుగుదేశం పార్టీ గానీ, కొందరు ధనవంతులైన రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కోరుతున్నట్లుగా 29 గ్రామాల పరిధిలోనే లక్ష కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమా, కాదా అని వైసీపీ ప్రభుత్వం ఆలోచించింది. ఆ డబ్బుతో కోట్ల మందిని కరోనా సమయంలో ఆదుకున్న సంగతి తెలిసిందే. కానీ అమరావతిలో రకరకాల రూపాలలో ఆందో ళనలు సాగిస్తున్న కొంతమంది మాత్రం చంద్రబాబునే ఇంకా సీఎంగా భావిస్తూ, ముఖ్యమంత్రి జగన్‌పై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకే రాజధాని ఉండాలన్న డిమాండ్‌తో ఇప్పుడు వీరితో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారన్న భావన ఉంది. వీరు రాయలసీమలో కూడా పాదయాత్ర చేస్తారు. అక్కడ ప్రజలంతా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండుతో గతంలో ఆందోళనలు నిర్వహించారు. అది వారికి సెంటిమెంట్‌ కూడా. ఆ ప్రకారం జగన్‌ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. అటు ఉత్త రాంధ్రలోని విశాఖ, రాయలసీమలోని కర్నూలు అభి వృద్ధికి కూడా మూడు రాజధానుల నిర్ణయం ఉపయోగపడు తుందని ప్రభుత్వం భావించింది. అదే సమయంలో ప్రస్తుత అమరావతి గ్రామాలలో శాసన రాజధాని ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలుగుదేశం, మరికొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. 

తమ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకునే అవకాశం యధాతథంగా ఉండాలని డిమాండ్‌ చేస్తూ సాగుతున్న ఆందోళన దేశంలో ఇదొక్కటే. ఈ మొత్తం క్రమంలో టీడీపీ గానీ, ఒక సామాజిక వర్గం గానీ మిగి లిన వర్గాలకు దూరం అవుతున్న సంగతిని గుర్తించలేక పోతున్నాయి. టీడీపీ కేవలం 29 గ్రామాల ప్రయోజనాలకే పరిమితం అయిందన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. నిజానికి ఢిల్లీలో రైతుల ఆందోళన, ఎర్రకోటపై దాడి నేప థ్యంలో ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వరాదని ఏపీ పోలీస్‌ శాఖ భావించినా, హైకోర్టు వారు అనుమతి ఇవ్వా లని ఆదేశించారు. దీనివల్ల వచ్చే పరిణామాలతో కాకుండా, పౌరుల హక్కుల ఆధారంగా న్యాయస్థానం కొన్ని షరతు లతో ఈ ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. మూడు రాజధానులు కోరుకునే వర్గాలకూ, పాదయాత్ర చేస్తున్నవారికీ మధ్య ఎక్క డైనా వివాదం వస్తే అది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఏమైనా కుట్ర వ్యూహం అమలు చేస్తున్నదా అన్న సందేహాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ పాదయాత్ర జరిగే నలభై ఐదు రోజుల కాలం ఏపీ పోలీసులకు ఒక పరీక్షే. ఏ చిన్న ఘటన జరిగినా  దాన్ని భూతద్దంలో చూపించడానికి టీడీపీ మద్దతు మీడియా రెడీగా ఉంది. 

ప్రభుత్వాలు తమకు అనుగుణమైన నిర్ణయాలు చేస్తాయి. వాటిపై ఎన్నికలలో ప్రజాతీర్పు వస్తుంది. ఉదాహ రణకు 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్‌.టి. రామారావు మద్య నిషేధం అమలు చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని పునరుద్ధరించారు. ఆయనను పడదోసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మద్య నిషేధం ఎత్తి వేశారు. పేదలకు పంపిణీ చేసే బియ్యం రేట్లు పెంచారు. కోట్ల మందికి సంబంధించిన నిర్ణయాలనే మార్చేసిన చంద్ర బాబు ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ మూడు రాజధానులతో సహా అన్ని నిర్ణయాలకు వీలైనంతమేర అడ్డంకులు కలిగి స్తున్నారు. చంద్రబాబు ఉచిత విద్యుత్‌ సాధ్యపడదని వాదించేవారు. కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. 2014లో లక్ష కోట్ల రూపాయల మేర రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు చెప్పినట్లు చేయకపోగా రైతులకు అంత ఆశ పనికిరాదని అన్నారు. కానీ ఇప్పుడు రాజధానిని మూడుగా విభజించడం వల్ల ఏదో పెద్ద ప్రమాదం జరిగి పోతుందని కృత్రిమ ఉద్యమం సాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడు తదితరులతో విశాఖలో కార్య నిర్వాహక రాజధాని వద్దనీ, రాయలసీమలో కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి తదితరులతో కర్నూలలో న్యాయ రాజధాని వద్దనీ చెప్పి పాదయాత్రలు చేయించి ఉంటే ఆయనకు ఎంతో కొంత చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చు. ఇదే ప్రాంతా నికి చెందిన ఎన్‌.జి. రంగా వంటి గొప్పనేత రైతాంగ సమ స్యలపై సుదీర్ఘ పాదయాత్ర చేస్తే, ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం ఇదే ప్రాంతం నుంచి పాదయాత్ర జర గడం మారిన కాలమాన పరిస్థితులకు అద్దం పడుతుందా!

వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు 
సీనియర్‌ పాత్రికేయులు     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement