
ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధి పతులు, మంత్రుల సమీక్షా సమావేశం 12 గంటల పాటు జరిగింది. గత అనుభవంతో సీబీఎన్ త్వరితంగా పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవలసి ఉండగా, ఇప్పటికీ మూడుసార్లు కలెక్టర్ల సమా వేశాలు నిర్వహించి, ఎనిమిది నెలలుగా నిత్యం ఏదో ఒక శాఖ సమీక్ష చేస్తున్నా... మళ్ళీ మరో సమన్వయ సమావేశం ఎందుకు నిర్వహించినట్లు? నిజానికి ఐదేళ్ళ వైసీపీ పాలన తర్వాత ‘బ్యురోక్రసీ’ వైఖరితో ‘కూటమి’ ప్రభుత్వం సమన్వయ సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నదా? అనేది ఇక్కడ కీలకం.
కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన 2022 ఉగాది నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మోహన్ రెడ్డి– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సాధించే దిశలో ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్‌ఓపీ) పాటించి తీరాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘సరళీకరణ’ కాలంలో పొలిటికల్ ఎగ్జిక్యుటివ్ అధికా రులను ‘మార్గదర్శక నిబంధనలు దాట డానికి వీలులేదు’ అనే మాట పైకి అనడం చిన్న విషయం కాదు. ఈ మార్పుకు కారణం, గతంలో పాలన ‘పిరమిడ్’ తరహాలో పైన ఒక్కరిదే నిర్ణయమైతే, దిగువ పలు అంచెల్లో దాన్ని అమలుచేసే యంత్రాంగం ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో పైన ఉండే నిర్ణయ శిఖరం ‘చతురస్రం’గా మారింది. విధాన నిర్ణయంలో సమష్టి బాధ్యత వచ్చింది. మండల గ్రామ సచివాలయ సిబ్బంది నిర్ణయాల అమలుకు దఖలు పడ్డారు. సీబీఎన్ శైలి దీనికి పూర్తిగా భిన్నమైంది.
రాజకీయ నాయకుల నిర్ణయాల అమలుకు మాత్రమే ఐఏఎస్‌లను పరిమితం చేస్తే, తదుపరి పరిణామాలకు జడిసి కొందరు అధికారులు పోస్టులు మారుతున్నారు. సీఎం తనది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అంటే, అది ‘నీతి ఆయోగ్’ అయినా, ప్రపంచ బ్యాంకు షరతులు అయినా మాకు వర్తించవు’ అని చెప్పడమే అవుతుంది. సీఎం కలెక్టర్లకు చెప్పిందే సెక్రటరీలకు వర్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో బహుశా వేగంగా కదలని ‘ఫైళ్ళు’ ఈ సమావేశ నిర్ణయానికి కారణం కావొచ్చు.
అయితే, అధికారులు ఉన్నదే వారు తమ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి కనుక... ఇక్కడ 2019 ఎన్నికల ముందు జరిగింది ఒకటి చెప్పాలి. ‘సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (‘సెర్ప్’) సంస్థ 2019 ఫిబ్రవరి 16 నాటికి ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు, సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేం వర్క్’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఈ పనిలో ప్రపంచ బ్యాంక్‌ది ప్రధాన భూమిక.
రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నర ఏళ్ల తర్వాత, ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన కొరకు రూపొందించిన అధికారిక ‘డాక్యుమెంట్’ ఇది. ఇది జరిగిన నాలుగు నెలలకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
మనకు ‘నెట్’లో అందుబాటులో ఉన్న ఈ పత్రం– ‘వైరుధ్య –ఆంధ్రప్రదేశ్’ అనే ముందుమాటతో మొదలవుతుంది. అందులో – ‘ఇక్కడ ఒకపక్క వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, ఐటీ వృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పెట్టుబడులు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పేదరికం కూడా తగ్గుతున్నది. కానీ ఇక్కడి వ్యవసాయ రంగంలో రైతుల వెతలు అలాగే ఉన్నాయి. సామాజిక మానవీయ విలువల సూచీ అట్టడుగున ఉంది. ఇక్కడి మహిళా స్వయం సహాయ సంఘాల చొరవ గొప్ప మార్పుకు నాంది పలికినా అది ఎస్సీ, ఎస్టీల విషయంలో సామాజిక పెట్టుబడిగా రూపాంతరం చెందలేదు. దాంతో వారి ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్య వసతుల మెరుగు దలను అది ఏ మాత్రం ప్రభావితం చేయలేక మినిమమ్ డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ) వద్దకు వారిని చేర్చలేక పోయింది.’
ఇది చదివాక, మన కామన్ సెన్స్‌కు వచ్చే ప్రశ్నలు రెండు.ఈ పత్రంలోని అంశాలు తన ప్రభుత్వ కృషి ఫలితం అని సీబీఎన్...పైకి అనకపోవడానికి కారణం ఏమిటి? ఈ నివేదికలో గుర్తించిన వ్యత్యాసాలను అధిగమించేలా తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పథకాలను అమలు చేసింది. అయితే వాటిలో లోపాలు ఉంటే వాటిని చూపడం కాకుండా, ‘సంక్షేమమేనా... అభివృద్ధి ఏదీ?’ అంటూ ముప్పేట దాడి చేయడం ఏమిటి? ఈ ‘పత్రం’ సీబీఎన్ ప్రాధాన్యాలలోని అంశం కాకపోవచ్చు. అలాగే పేదలకు మేలు చేసేది కనుక వైసీపీ దాన్ని తన మేనిఫెస్టోలో చేర్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ‘కూటమి’ దాని ఊసు ఎత్తడం లేదంటే దాన్ని అమలుచేసే ఆలోచన లేక కావొచ్చు.
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment