ఈ నిశ్శబ్దానికి పునాది పూనా ఒడంబడిక | Mallepally Laxmaiah Article On SC And ST Political Leaders | Sakshi
Sakshi News home page

ఈ నిశ్శబ్దానికి పునాది పూనా ఒడంబడిక

Published Thu, Sep 24 2020 1:25 AM | Last Updated on Thu, Sep 24 2020 1:25 AM

Mallepally Laxmaiah Article On SC And ST Political Leaders - Sakshi

‘‘మీకు రాజకీయ అధికారాలను అందించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ మీకు సీట్లు రిజర్వు చేయించడానికి ముప్పై సంవత్సరాలు రాత్రీ, పగలూ శ్రమించాను. ఎవరైనా మిమ్మల్ని తమ రాజభవనంలోకి ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళండి. కానీ, మీరు నివసించే చిన్న ఇల్లును తగులబెట్టుకొని మాత్రం అక్కడకు వెళ్ళకండి. కొన్ని రోజుల తర్వాత ఏదో రోజు మీకు మీమీద కోపం కలిగితే, మిమ్మల్ని గెంటివేస్తే ఎక్కడికి వెళతారు. మీరు అమ్ముడుపోవాలనుకుంటే అమ్ముడుపోండి. కానీ మీ సొంత బలాన్ని ధ్వంసం చేసుకొని మాత్రం వెళ్ళవద్దు’’ అంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1956 మార్చి 18న ఆగ్రాలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో చేసిన ఉపన్యాసంలోని కొంత భాగం ఇది. రిజర్వేషన్ల ద్వారా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధుల పనితీరును చూసి బాబాసాహెబ్‌ అన్న మాటలివి. మరోచోట, ‘‘మా ప్రజాప్రతి నిధులు ఆవులింత వస్తే తప్ప నోరు తెరవరు’’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని శాసనసభల్లో 578 మంది ఎస్సీ సభ్యులు, 526 మంది ఎస్టీ శాసనసభ్యులు ఉన్నారు. పార్లమెంటులోని లోక్‌సభలో ఎస్సీ ప్రతినిధులు 84 మంది, ఎస్టీలు 47 మంది ఉన్నారు. లోక్‌సభలో ఇది దాదాపు నాల్గోవంతు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కాంక్షించినట్లు వీరంతా ఐక్యంగా నిలబడి, ప్రజల పక్షం వహిస్తే, ప్రభుత్వాలు తల్లకిందులవుతాయి. 1956 నాడే కాదు, నేటికీ ఎస్సీ, ఎస్టీల ప్రజాప్రతినిధులు తమ స్వీయచిత్తంతో పనిచేస్తోన్న దాఖలాలు లేవు. 

అంబేడ్కర్‌ ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటి? ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు అసమర్థులా? వేరే ఏదైనా కారణాలున్నాయా? ఎన్నో తిరస్కారాల నడుమ, మరెన్నో కుయుక్తులను ఎదుర్కొంటూ బాబాసాహెబ్‌ చేసిన యుద్ధ ఫలితమే ఈ రాజకీయ రిజర్వేషన్లు. 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో ఓటింగ్‌ హక్కు కల్పించాలని, అప్పుడే వారికి పాలనలో భాగస్వామ్యం లభిస్తుందని, అందుకోసం సుదీర్ఘం పోరాటం చేశారు.

మొదటిసారిగా 1919లో సౌత్‌బరో కమిటీ ఎదుట తన వాదనలను వినిపించారు. ‘‘అంటరాని కులాలకు స్వయం నిర్ణయాధికారం కావాలి. మా సమస్యలపైన దళితేతరులు కాకుండా, దళితులే మాట్లాడాలి అనే ప్రజాస్వామ్య సూత్రం అమలు జరగాలి. అగ్రవర్ణాల దయాదాక్షిణ్యాలకు దళితులను వదిలేయొద్దు’’అంటూ ప్రజాస్వామ్య భావనలోని సారాంశాన్ని బయట పెట్టారు. 1927లో భారత దేశానికి వచ్చిన సైమన్‌ కమిషన్‌ ముందు, ప్రాతినిధ్యం లేని వర్గాలు ప్రజాస్వామ్య దేశంలో పౌరులుగా ఉండలేరని తేల్చి చెప్పారు. 1930–32ల మధ్య జరిగిన రెండు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

లండన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో అంటరాని కులాలు హిందూ సమాజంలో భాగం కాదని, ముస్లింలు, క్రైస్తవులు, ఆంగ్లోఇండియన్స్, సిక్కులు మతపరమైన మైనారిటీలైనట్టే, నిమ్న వర్గాలు సామాజికంగా మైనారిటీలని, వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రైస్తవులకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి.

మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కాంగ్రెస్‌ ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. రెండో సమావేశానికి మహాత్మాగాంధీ హాజరయ్యారు. అంబేడ్కర్‌ వాదనను గాంధీ వ్యతిరేకించారు. దళితులను హిందూ సమాజం నుంచి వేరు చేసి చూస్తే సహించలేనని అభ్యంతరం తెలిపారు. అయితే అంబేడ్కర్‌ వాదనను బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించి కమ్యూనల్‌ అవార్డు పేరుతో ప్రత్యేక ఎన్నికల విధానంతో కూడిన ప్రత్యేక నియోజక వర్గాలను అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. 

గాంధీ నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. దీనితో కాంగ్రెస్‌తోపాటు, హిందూ సంఘాలు, మహాత్మాగాంధీ ప్రాణాలు కాపాడమని అంబేడ్కర్‌ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఒక్క గాంధీ కోసం తన జాతి భవిష్యత్తును ఫణంగా పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ గాంధీకి ఏదైనా జరగరానిది జరిగితే, దీన్ని సాకుగా చూపెట్టి తన ప్రజలపై, హిందూ అగ్రకులాలు దాడులు చేసి, మారణహోమం సృష్టిస్తాయని ఆందోళన చెంది, గాంధీతో రాజీకి అంగీకరించారు. దానిపేరే పూనా ఒడంబడిక. సరిగ్గా ఇదే రోజున అంటే 1932 సెప్టెంబర్‌ 24న బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఛాటింగ్‌లో అంటే తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పి, సమాజంలోని అందరి ఓట్లతో జరిగే ఉమ్మడి ఎన్నిక విధానానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. 

అయితే 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనుభవంతో అంటే సమాజంలోని అన్ని కులాల ఓట్లతో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌కు బాసటగా ఉన్నారని, దీనివల్ల ప్రయోజనం లేదని, మళ్ళీ ప్రత్యేక ఓటింగ్‌ విధానం (సపరేట్‌ ఎలక్టోరల్‌) కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అనే పేరుతో రా>జ్యాంగ సభకు సమర్పించిన నివేదికలో ప్రధానమైన అంశం ఈ సపరేట్‌ ఎలక్టోరేట్‌ విధానమే. రాజ్యాంగ సభ అంబేడ్కర్‌ ప్రతిపాదనను అంగీకరించలేదు. రిజర్వేషన్ల విధానాన్నే రద్దు చేయాలని చూశారు. ఇందులో ప్రధాన సూత్రధారి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. అయితే అంబేడ్కర్‌ కూడా అదే స్థాయిలో సర్దార్‌ పటేల్‌ను ప్రతిఘటించారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అంగీకరించకపోతే, తాను రాజ్యాంగ రచనా సంఘానికి రాజీ నామా చేస్తానని, రాజ్యసభలో తాను కొనసాగలేనని కరాఖండీగా చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ దిగి వచ్చింది. 

అంటే 1919 నుంచి, 1949 నవంబర్‌ 25 వరకు అంబేడ్కర్‌ సాగించిన పోరాట ఫలితమే ఇప్పుడు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లు. అయితే అంబేడ్కర్‌ ఆశించిన రాజకీయ రిజర్వేషన్లు రాలేదు. పూనా ఒడంబడిక ప్రభావమే నేటికీ ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల మీద ఉందన్నది వాస్తవం. ఎస్సీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి నూటికి 60 నుంచి 80 శాతం వరకు దళితేతరుల ఓట్లు కావాల్సి ఉంటుంది.

ఒకవేళ 1932లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నియోజక వర్గాల పద్ధతి అమలు జరిగితే, ఈరోజు దళిత ప్రజల స్థితిగతులు వేరే విధంగా ఉండేవి. పూనా ఒడంబడిక కుట్రను, ఐఏఎస్‌ అధికారి, దళిత మేధావి డాక్టర్‌ రాజశేఖర్‌ ఉండ్రు తాను రాసిన ‘అంబేడ్కర్, గాంధీ, పటేల్‌’ పుస్తకంలో అద్భుతంగా అక్షరీకరించారు. సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి తెలుగులోకి అనువదించిన ఈ చారిత్రక నేపథ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇప్పుడున్నది రెండే మార్గాలు. కమ్యూనల్‌ అవార్డులో లాగా ప్రత్యేక నియోజకవర్గాల సాధనకు ఉద్యమించడం,  ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సిన మార్గాలను అన్వేషించడం. పూనా ఒడంబడిక వల్ల నష్టపోయిన నేటి దళిత జాతి తమ భవిష్యత్‌ కోసమే కాదు, దళిత జాతి జాగృతి కోసం పోరాడాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది.
వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement