ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ దావాలు భ్రమే..! | Noah Feldman Guest Column On Trump Election Result Petition | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ దావాలు భ్రమే..!

Published Fri, Nov 6 2020 1:14 AM | Last Updated on Fri, Nov 6 2020 1:14 AM

Noah Feldman Guest Column On Trump Election Result Petition - Sakshi

చట్టపరిభాషలో వ్యాఖ్యానించాలంటే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేస్తానంటున్న ట్రంప్‌ గురించి ఇక చెప్పడానికి ఏమీలేదు. ఎలక్టోరల్‌ కాలేజి ఎన్నికల్లో విజయానికి చేరువగా నిలిచిన డెమాక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌తో పోరాడేందుకు వివిధ న్యాయపరమైన వ్యాజ్యాలను ట్రంప్‌ ప్రచార కమిటీ ప్రకటించింది. మిషిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపును నిలిపేందుకు కూడా ట్రంప్‌ శిబిరం ప్రయత్నిస్తోంది. అలాగే ఎన్నికల రోజు రాత్రి 8 గంటల తర్వాత కూడా పెన్సిల్వేనియాకు వచ్చిన, వస్తున్న బ్యాలెట్లను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కూడా జరగనుంది. అలాగే జార్జియాలో ఒక పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్లను అవసవ్యంగా కలిపేశాడనీ, ఆలస్యంగా వచ్చిన బ్యాలెట్లను కూడా వేరుచేయమని చెప్పాడని ఆరోపిస్తూ ట్రంప్‌ శిబిరం వ్యాజ్యం వేసింది. అలాగే విస్కాన్సిన్‌లో ఓట్ల రీకౌంటింగ్‌కి కూడా ప్రయత్నిస్తామని ట్రంప్‌ న్యాయవాదులు చెప్పారు కానీ బైడెన్‌ అక్కడ అప్పటికే సాధించిన 20 వేల ఓట్లను చెరిపివేయడం అంత సులభం కాదు.

పైగా కౌంటింగ్‌ను నిలిపివేసేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంబించారు. వాస్తవానికి ఇవి చట్టపరంగా చూస్తే అవివేకపు చర్యలే అని వాదనలో ఏమాత్రం నిలబడని ఇలాంటి చర్యలు నవ్వు తెప్పిస్తాయని చెప్పాల్సి ఉంటుంది. మిషిగాన్‌లో ఎన్నికల పర్యవేక్షకులు, ఇరుపార్టీల పరిశీలకులు లేకుండానే పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటర్లను ప్రారంభించేశారని ఆరోపిస్తూ ట్రంప్‌ శిబిరం వ్యాజ్యం వేసింది. అయితే వాస్తవానికి డెమాక్రాటిక్, రిపబ్లికన్‌ ఇన్‌స్పెక్టర్లు, పరిశీలకులను మిషిగాన్‌ ఎన్నికల యంత్రాంగం కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించినట్లు స్పష్టమైంది. పోస్టల్‌ బ్యాలెట్లను తీసుకుని వచ్చే డ్రాప్‌ ఆప్‌ బాక్సుల వీడియోను ట్రంప్‌ తరపున పనిచేసే చాలెంజర్స్‌కి చూపించలేదు కాబట్టి మిషిగాన్‌ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ట్రంప్‌ శిబిరం వాదిస్తోంది. అయితే వింతల్లో వింత ఏమిటంటే, తన ప్రతినిధులు డ్రాప్‌ ఆఫ్‌ బాక్సుల వీడియోను చూడనందున, లేక చూపించనందున కౌంటిం గ్‌నే నిలిపివేయాలని వాదించడమే. 

బ్యాలెట్‌ కంటైనర్లను వీడియో నిఘాకింద ఉంచాలని మిషిగాన్‌ చట్టం చెబుతోంది. డ్రాప్‌ ఆఫ్‌ బాక్సుల వీడియోను పోటీపడుతున్న పార్టీలు చూసేందుకు ఆ చట్టంలో ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నట్లు లేదు. పైగా రిపబ్లికన్‌ పార్టీ పరిశీలకుకు అవసరమైన వీడియోను చూపడంలో విఫలమైనందున కౌంటింగ్‌నే నిలిపివేయాలని కోర్టులు తీర్పు చెప్పాలని కోరడం అనేదే అసంగతమైన విషయం. దీంట్లో తర్కానికి అందే విషయం ఏదన్నా ఉంది అంటే కోర్టు ఆ వీడియోను చూపాలని ప్రభుత్వాన్ని ఆదేశించగలదంతే. మిషిగాన్‌ రాష్ట్రంలో ఓట్లను లెక్కించకుండా నిలిపివేయడానికి ట్రంప్‌ శిబిరం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోం దన్న వాస్తవం నుంచి తప్పించుకోవడం కష్టం. మిషిగన్‌ ఓట్ల లెక్కింపులో ట్రంప్‌ వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇప్పటికే లెక్కించిన ఓట్ల ప్రాతిపదికన తననే గెలిచినట్లు ప్రకటించాలని ట్రంప్‌ శిబిరం ప్రయత్నించలేదు. మిషిగాన్‌తోపాటు కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా బైడెన్‌ గెలిచినట్లయితే బైడెన్‌కు విజయం తథ్యం అనే వాస్తవం నుంచి తప్పించుకోవడానికే ట్రంప్‌ శిబిరం ఇలాంటి వాదనలకు దిగుతోంది. 

ఇక పెన్సిల్వేనియా వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ శిబిరం పలు న్యాయపరమైన సవాళ్లును విసిరింది. సోమవారం దాఖలు చేసిన ఒక వ్యాజ్యంలో, పోస్టల్‌ బ్యాలెట్లలో తప్పులు చేసిన ఓటర్లు తమ తప్పులను సరిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ పెన్సిల్వేనియా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడాన్ని సవాలు చేశారు. ఇలాంటి ఆదేశాలు చివరి క్షణంలో వచ్చాయి కాబట్టి ఈ దావాలో ట్రంప్‌ శిబిరం నెగ్గే అవకాశముంది. మిషిగాన్‌లో చేసిన విధంగానే పెన్సిల్వేనియాలోనూ కౌంటింగ్‌ను నిలిపివేసేందుకు ట్రంప్‌ శిబిరం ప్రయత్నిస్తోంది. ఇప్పటికి ఇంకా ఫిర్యాదు చేసినట్లు లేదు కానీ ఇక్కడ కూడా ట్రంప్‌ శిబిరం వాదన మిషగాన్‌ వ్యవహా రంలో చేసిన వాదనకంటే మించిన తార్కికతతో ఉంటుం దని చెప్పలేం. తర్వాత సుప్రీంకోర్టులో ఒక అర్జీ ఉండనే ఉంది. కోర్టు ఈ అర్జీని అనుమతించినట్లయితే పోలింగ్‌ ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్‌ ఇన్‌ బాక్సులను కౌంటింగ్‌ నుంచి మినహాయించాలని ట్రంప్‌ న్యాయమూర్తులను కోరే అవకాశముంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశం బహుశా ఉంటుంది కానీ ఈ విషయంలో ట్రంప్‌ వాదనను కోర్టు బలపరుస్తుందనే హామీ ఏదీ లేదు. పెన్సిల్వేనియా కోర్టులో నలుగురు జడ్జీలున్నారు. ముగ్గురు లిబరల్‌ జడ్జీలు ఉండగా, ట్రంప్‌ క్లెయిమ్‌ని తిరస్కరించే ఒక చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ కూడా ఉన్నారు. కన్సర్వేటివ్‌ న్యాయమూర్తులు ముగ్గురు ట్రంప్‌ అభ్యర్థనకు మద్దతు పలకవచ్చు.

కన్జర్వేటివ్‌ అనుకూల జడ్జీలు పెన్సిల్వేనియా ఎన్నికల్లో పోలైన ఓట్లను చెల్లవని ప్రకటిస్తే అది జనంలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది. ఎందుకంటే తమ ఓట్లను తప్పక లెక్కిస్తామంటూ న్యాయస్థానాలు గతంలోనే ప్రజలకు హమీ ఇచ్చాయి. అలా లెక్కించినప్పటికీ ట్రంప్‌ పెన్సిల్వేనియాలో విజయం సాధిస్తారని హామీ ఏదీ లేదు. ఒకవేళ న్యాయమూర్తులు ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి అవసరమైన సంఖ్యలో ఓట్లను పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆలస్యంగా వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లు అందిస్తే తప్ప వాటికి అంత విలువ ఉండదు. ఇలాంటి పరిస్థితే ఎదురైతే గతంలో బుష్‌  వర్సెస్‌ అల్‌ గోరె మధ్య పోటీలో తలెత్తిన పీడకల మళ్లీ పునరావృతం కావచ్చు. అలాంటి పరిస్థితి రాదని చెప్పలేం కానీ 2000 సంవత్సరం నాటి తీవ్ర పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం కాకపోవచ్చు. మొత్తంమీద పరిశీలించినట్లయితే, ట్రంప్‌ న్యాయపరమైన వ్యూహం బలహీనంగా కనిపిస్తోంది. పోలైన ఓట్లను లెక్కించకుండా ఆపివేయడం లేక మళ్లీ పోలింగ్‌కు ఆదేశించడంలో ట్రంప్‌ న్యాయస్థానాలను ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. న్యాయస్థానంలో ఓడిపోయినప్పటికీ ట్రంప్‌ తననుంచి ఎన్నికల ఫలితాను కొల్లగొట్టారంటూ ప్రకటించకుండా మానడం కష్టం. పాపులర్‌ ఓటులోనూ, ఎరక్టోరల్‌ కాలేజీ ఓట్లలోను మెజారిటీ సాధించని పక్షంలో ఎన్నికల ఫలితాలకు చట్టబద్ధత కల్పించకుండా ఉండే ఒక విచిత్ర వ్యూహాన్ని పెంపొందించడమే ఈ తరహా న్యాయ వ్యాజ్యాల ఉద్దేశం కావచ్చు కూడా. 
-నోహ్‌ ఫెల్డ్‌మన్‌
వ్యాసకర్త ప్రొఫెసర్, హార్వర్డ్‌ యూనివర్శిటీ
ప్రముఖ అమెరికన్‌ కాలమిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement