సందర్భం
అదృష్ట దేవత ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. భారత ప్రభుత్వం ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారుగా, ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న ‘మిస్సైల్ మ్యాన్’ ఆవుల్ ఫకీర్ జైనులుబ్దీన్ (ఏపీజే) అబ్దుల్ కలాం, 71వ ఏట, విశ్రాంత జీవితం కోసం డిసెంబర్ 2001లో చెన్నై చేరుకున్నారు. హాబీ కోసం అన్నా యూనివర్సిటీలో పార్ట్ టైం ప్రొఫెసర్ వర్కు ఎంచుకున్నారు ఆయన.
ఆ రోజు (జూన్ 10, 2002) సాయంత్రం 5 గం.లు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌లో ల్యాండ్ ఫోన్ ఆగకుండా మ్రోగటంతో, స్టాఫ్ విసుగుతో ఫోన్ ఎత్తి తమిళంలో, ‘హలో, యారదు’(ఎవరది) అని ప్రశ్నించటంతో, ‘దిస్ ఈజ్ ఫ్రమ్ పీఎంఓ ఆఫీస్, ఢిల్లీ. ప్రధాని కలాం సర్‌తో మాట్లాడాలి, పిలవండి’ అని అవతలి గొంతు వినిపించింది. పీఎంఓ మాట విని భయంతో, ‘సార్, క్లాసులో పాఠం బెబుతున్నారు. అది అవగానే కబురు చేస్తాను సార్’ అన్నాడు ఆఫీసు క్లర్కు. ఆరు గంటలకు, లెక్చర్ ముగించిన కలాం వరండాలో నడుస్తున్నది చూసి, వైస్ ఛాన్సలర్ ఏ. కళానిధి ఆయనకు ఎదురెళ్లి ఆతృతగా, ‘సార్ ఢిల్లీ నుండి మెసేజ్, ప్రధాని మీతో అర్జంటుగా మాట్లాడాలట’ అని అన్నాడు.
ఆశ్చర్యంతో కలాం కనుబొమ్మలు ముడివడ్డాయి. ‘ఏమై ఉంటుందబ్బా?’ అనుకుంటూ వీసీ ఆఫీసు రూం కెళ్ళి, పీఎంఓకు ఫోన్ చేశారు. లైన్లో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి! ‘హలో కలాం సర్, హౌ ఈజ్ యువర్ అకాడమిక్ లైఫ్?’ అన్న ఆయన ప్రశ్నకు, ‘ఇట్ ఈజ్ వెరీ వండర్‌ఫుల్ సార్’ కలాం జవాబు. ‘ఇక అది వదలి, మీరు నా కోసం ఢిల్లీ రావలసి ఉంటుంది’ అంటూ గట్టిగా నవ్వారు ప్రధాని.
సడన్‌గా జోకులు పేల్చి ఎదుటి వారిని తికమక పెట్టడం అటల్‌జీకి వెన్నతో పెట్టిన విద్య. ‘వింటున్నారా కలాంజీ’ మళ్ళీ ప్రశ్న. ‘యస్ సార్.’ ‘ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగులో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మీ పేరును ప్రస్తావించారు. మీ సమ్మతి కోసమే ఎదురుచూస్తున్నాము.’ ఊహించని పీఎం ప్రతిపాదనకు ఎటూ తోచలేదు కలాంజీకి. ‘ఆలోచించుకోవటానికి కొంత వ్యవధి ఇవ్వండి సార్‘ అని మాత్రం అనగలిగారు. ‘మీరు జస్ట్ ఓకే అనండి, రాష్ట్రపతి భవనంలోకి తీసుకెళ్ళే బాధ్యత నాది; ఫర్లేదు, రాత్రి 8.30 గంటల వరకూ మీకు సమయం ఉంది. ఆలోచించుకోండి; నో మాత్రం అనొద్దు ప్లీజ్’ అంటూ ఫోన్ పెట్టేశారు ప్రధాని.
విషయం విని వైస్ ఛాన్సలర్ కళానిధి సంతోషం పట్టలేక కలాం చేయి అందు కుని, ‘అభినందనలు సార్’, అని అన్నారు. కలాం గారి మిత్ర బృందంలో ఈ వార్త అదే రాత్రి సుడిగాలిలా వెళ్ళింది. అందరిదీ ఓకే మాట... ‘వెతుక్కుంటూ వచ్చిన ఈ అవకాశాన్ని వదలుకోవద్దు’ అని. ఇక రాత్రి 8.45 గంటలకు ప్రధాని కార్యాలయం నుండి మళ్ళీ కాల్. ప్రధాని ప్రపోజల్‌కు ‘యస్’ అన్నారు కలాం.
13వ త్రిశంకు లోక్ సభలో బీజేపీకి దక్కిన సీట్లు కేవలం 182. బహుళ పార్టీల మద్దతుతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వాజ్‌పేయి నేతృత్వంలో కత్తి మీది సాములా కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ అభ్యర్థికి ఎలెక్టోరల్ కాలేజీలో సరిపోను సంఖ్యా బలం కూడా లేదు అప్పటికి. ఐదు పదుల అలుపెరుగని పార్లమెంటరీ అనుభవం ఆయనది. అదే ఆత్మ విశ్వాసంతో, రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రఖ్యాత సైంటిస్టు, ఏపీజే కలాం పేరును రాష్ట్రపతి పదవికి అధికారికంగా ప్రకటించారు.
తనదైన శైలిలో చక చక పావులు కదిపి, ప్రతిపక్షంలోని సీనియర్ నాయకులు శరద్ పవార్, ములాయం సింగ్, లాలూ యాదవ్ లను సంప్రదించి, కలాం అభ్యర్థిత్వాన్ని సుగమం చేశారు వాజ్‌పేయి. ఎన్డీఏ నాయకుల సమక్షంలో జూన్ 18న అబ్దుల్ కలాంతో నామినేషన్ వేయించారు. రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి, కలాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా సంపాదించి, జూలై 25న 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం జరిపించి తీరారు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.
చివరిగా, దేశ ప్రథమ పౌరునిగా అబ్దుల్ కలాం పేరును ఎన్డీఏ తెరపైకి తెచ్చిన ఘనత మన తెలుగు ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్‌దే అన్న విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
అప్పట్లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమ్రంతికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రసాద్... కలాం పేరు రాష్ట్రపతి పదవి కోసం సూచించారు. ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్న నాటి ఏపీ సీఎం... వాజ్‌పేయికి ఈ ప్రతిపాదన చేశారు.
జిల్లా గోవర్ధన్
వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949
(‘టర్నింగ్ పాయింట్స్, ఎ జర్నీ త్రూ ఛాలెంజెస్’ అనే
అబ్దుల్ కలాం గ్రంథం ఆధారంగా...)
Comments
Please login to add a commentAdd a comment