దాడికి గురైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. ఒకవైపు ఎండవేడిమి మంట పుట్టిస్తుంటే, మరోవైపు ప్రచారాల్లో భాగంగా రాజకీయ పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ఒక అడుగు ముందుకేసి దాడులకు తెగబడే పరిస్థితులకు చేరింది. 13వ తేదీన విజయవాడ వేదికగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గత నెల 27న ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో తాను ఏం చేశానో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ప్రచారానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల నుండి అనేకమంది వైసీపీలో చేరుతున్నారు.
ఈ క్రమంలోనే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే రాయి వేసి ఆయన్ని అంతమొందించే ప్రయత్నం జరిగింది. దీనిని ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో ఖండించారు. చంద్రబాబు కూడా ఈ దాడిని ఖండించారు. అయితే, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడగకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్, వెంటనే ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. తానేమీ తక్కువ తినలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ప్రజా ముఖ్యమంత్రి, జనం గుండెల్లో గూడు కట్టుకున్న నేతపై దాడి జరిగితే దీనిని రాజకీయం చేయడం ఏంటని అసహ్యించు కుంటున్నారు. దాడి సమయంలో తమ ప్రియతమ నేత అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో పెను ప్రాణాపాయం నుండి రక్షించుకున్నారని చెబుతున్న ప్రజలు ఆయన ఎప్పుడూ చెప్పే ఒక్క మాటను గుర్తు చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఉన్నంతకాలం తనకేమీ కాదన్నది ఇప్పుడు నిరూపి తమైంది.
గతంలో 2019 ఎన్నికల సమయంలో విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కత్తితో దాడికి ప్రయత్నించిన ఘటనను ప్రజలు ఉటంకిస్తూ, ఘటన జరిగిన 24 గంటల్లో నిందితుణ్ణి పట్టుకోలేకపోయారని గుర్తుచేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి సమయంలో అక్కడ డీజీపీ హడావిడిగా ఇదంతా కేవలం సానుభూతి కోసం అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పిన గంటకే అమరావతిలో చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట చెప్పారు. అంటే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడం కాదా అన్నది ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న.
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్న చందంగా మారి ఆ కంగారులో తలో మాట మాట్లాడుతున్నారనుకుంటే, పవన్ కల్యాణ్ దాడి ఘటనను డ్రామాగా చిత్రీకరిస్తూ సినిమా తరహాలో డైలాగులు చెబుతున్నారు. ప్రజలు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదంతా డ్రామాగా మీరే తేల్చేసినప్పుడు ఇక దీనిపై విచారణ ఎందుకు?
చంద్రబాబు రాజకీయ నైజం గురించి కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. 1987 ప్రాంతంలో పేదల పక్షపాతి, నిస్వార్థ రాజకీయ నేత వంగవీటి మోహన రంగాను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఘటనను ఇప్పుడు ప్రజలు ఉటంకిస్తుండటం నిజంగా ప్రజల్లోని రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం.
అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బషీర్‌బాగ్ కాల్పుల ఘటన, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘటన, గోదావరి పుష్కరాల్లో ప్రచార ఆర్భాటం కోసం 26 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై, ఆయన కుటుంబంపై పరుష పదజాలం వాడుతూ కొట్టుకుంటూ ఇంటి నుండి బయటకు తీసుకొచ్చిన వైనం, గుంటూరులో చీరలు పంపిణీ చేస్తామని పిలిచి తొక్కిసలాటలో అమాయక మహిళల ప్రాణాలను బలిగొన్న అంశాలను చర్చించటం చూస్తుంటే, ఒక నేతపై ప్రజల్లో ఉండే అభిప్రాయానికి దీన్ని సూచికగా చెప్పుకోవచ్చు.
ఇదంతా చూస్తుంటే కేవలం జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనే ఆయనంటే గిట్టనివారి కడుపు మంటకు కారణంగా కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో కూడా విశేష ఆదరణ లభించడం ఈ కడుపు మంటను రెట్టింపు చేసింది. అందుకే జనాల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్‌ను అంతమొందించేందుకు కుట్రకు తెరలేపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment