సీఎం జగన్‌పై హత్యాయత్నం! | Assassination attempt on CM YS Jagan At Vijayawada | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై హత్యాయత్నం!

Published Sun, Apr 14 2024 4:57 AM | Last Updated on Sun, Apr 14 2024 7:32 AM

Assassination attempt on CM YS Jagan At Vijayawada - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ , ఆగంతకుడి హత్యాయత్నంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కనుబొమపై అయిన తీవ్ర గాయం

సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర 

వారధి దాటిన దగ్గర్నుంచీ అడుగడుగునా జనం నీరాజనాలు 

రాత్రి 8.10 సమయంలో సింగ్‌నగర్లో జగన్‌ టార్గెట్‌గా దుశ్చర్య 

పథకం ప్రకారం ఒక స్కూల్‌ రెండో అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు 

అక్కడి నుంచి జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి 

ప్రజలకు అభివాదం చేస్తూ జగన్‌ పక్కకు తిరగటంతో.. తప్పిన గురి 

కనుబొమపై తీవ్ర గాయం.. పక్కకు తూలి.. గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్‌ 

జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి.. ఆ వెంటనే ప్రథమ చికిత్స 

అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి 

జగన్‌ కనుబొమ పైన తగిలాక.. పక్కనున్న వెలంపల్లికీ గాయం 

ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి... పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు 

రాయి, గ్రానైట్‌ పలక, పెల్లెట్, ఎయిర్‌ బుల్లెట్‌... ఏదైనా కావచ్చని వ్యాఖ్యలు 

ఆ వేగాన్ని బట్టి చూస్తే.. అది కచ్చితంగా హత్యాయత్నమేనన్న వెలంపల్లి 

ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడేనంటూ విమర్శలు 

‘టప్‌’మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని 

షెడ్యూలు ప్రకారం రాత్రి 10.38 వరకూ సాగి... ముగిసిన యాత్ర 

అనంతరం నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

లోకల్‌ అనస్తీషియా ఇచ్చి... కుట్లు వేసిన వైద్యులు 

విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు సూచన.. నేడు యాత్రకు విరామం 

దాడిని.. బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు 

రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనలు

ప్లాన్‌ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు 

దాడిని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ 

జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, బెంగాల్‌ సీఎం మమత ఆకాంక్ష 

‘సిద్ధం’ అంటూ నగారా మోగించి.. జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోయారు. విజయవాడ నగరంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచీ కనీవినీ ఎరుగని అశేష జన స్పందనతో సాగిన యాత్రలో... సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏ దారిలో వెళతారు? ఎక్కడెక్కడ ఆగుతారు? యాత్ర వెళ్లేటపుడు కరెంటు వైర్లు తగలకుండా కరెంటు తీసేస్తారు కనుక చీకటిగా ఉన్నపుడు ఎక్కడైతే బాగుంటుంది? అనే అంశాలన్నిటినీ అధ్యయనం చేసి... విజయవాడ సింగ్‌నగర్లో ఓ పాఠశాల కేంద్రంగా పక్కా ప్లాన్‌తో ఆయన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేశారు.

స్కూల్లో నక్కి ఉండి.. ఆయన బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నపుడు... కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని... బస్సుపై ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో ఉన్న జగన్‌ను గురిచూసి పదునైన వస్తువుతో కొట్టారు. జగన్‌ కణతకు గురిపెట్టి సంధించిన ఆ వస్తువు గనుక ఆయనకు అదే ప్రాంతంలో తగిలి ఉంటే ఏమయ్యేదో అనేది ఊహించడానికే భయంవేసే పరిణామం. అదృష్టవశాత్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన పక్కకు తిరగటంతో... ఆ వస్తువు ఆయన కణతకు బదులు ఆయన ఎడమ కనుబొమపై తగిలింది. లోపలికంటా చర్మం చీలిపోయి బలమైన గాయం అయ్యింది. అంతేకాక... ఆయనకు గాయం చేశాక... అదే వస్తువు ఆయన పక్కనే నిల్చున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఎడమ కంటికి కూడా తగిలింది. ఆయన కన్ను వాచింది.

వైఎస్‌ జగన్‌కు వస్తువు బలంగా తగలటంతో... ఆయన ఒక్కసారిగా విలవిలలాడుతూ పక్కకు ఒరిగారు. తరవాత తమాయించుకుని నిలబడి గాయాన్ని గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నారు. అలాగే చుట్టూ ఉన్న జనానికి అభివాదం చేస్తూ... సెక్యూరిటీ సిబ్బంది తోడురాగా బస్సులోపలికి వెళ్లారు. కనుబొమ వాచిపోవటంతో... గాయాన్ని శుభ్రం చేసి, రక్తాన్ని తుడిచి బస్సులో ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. కాసేపు ఆగిన తరవాత వైఎస్‌ జగన్‌ యథా ప్రకారం యాత్ర కొనసాగించారు. దాదాపుగా రాత్రి 8.10 సమయంలో ఈ దుర్ఘటన జరగ్గా... కాసేపు ఆగాక యాత్రను రాత్రి 10.39 వరకూ షెడ్యూలు ప్రకారం కొనసాగించాక... నైట్‌ హాల్టు ప్రాంతమైన కేసరపల్లికి చేరుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.  

సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది.

బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్‌ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్‌ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్‌ పలక, పెల్లెట్, ఎయిర్‌ బుల్లెట్‌ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్‌ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది.     



ముందస్తు కుట్ర, పక్కా ప్రణాళికతోనే.. 
సీఎం వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్‌ను హత్య చేయాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే సింగ్‌నగర్‌ డాబా కొట్ల సెంటర్‌లోని వివేకానంద స్కూల్‌ రెండో అంతస్తులో ఓ గదిలో నక్కాడు.

తాము ఉన్న గది కిటీకి తలుపులను తెరిచే ఉంచాడు. రోడ్‌ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగన్‌ లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన పదునైన వస్తువు సీఎం జగన్‌ ఎడమ కంటి కనుబొమ పైభాగాన తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఎడమ కన్ను వాచిపోయింది. ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా చలించక సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకు దిగి లోపలకి వెళ్లారు.   

ఎయిర్‌ గన్‌ వినియోగించారా.. 
సీఎం జగన్‌పై ఎయిర్‌ గన్‌ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్‌ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్‌ గన్‌నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాటర్‌ బాల్‌ను వినియోగించారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సిద్ధం సభలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగాయి. ఈ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి సైతం రాష్ట్ర ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నా పెద్ద, యువత, మహిళలు అనే తేడా లేకుండా వెల్లువలా సీఎం జగన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఆదరణను తట్టుకోలేక.. ముందస్తు కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపైన హత్యాయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలంతోనే.. 
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ప్రోద్బలంతోనే సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్‌సీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వీరిద్దరూ తమ మాటల ద్వారా, సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారని గుర్తు చేస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ నవరత్న పథకాలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. కులమతాలు, పార్టీలు, ప్రాంతాలకతీతంగా అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందించారు.

దీంతో మరోమారు సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటరిగా సీఎం వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేమని టీడీపీ.. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఆశాజనకమైన పరిస్థితులు కనిపించకపోవడం, కూటమి నేతలతో కలిసి నిర్వహించిన సభలు విఫలం కావడం, మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ సభలకు ప్రజలు లక్షల సంఖ్యలో పోటెత్తడం తట్టుకోలేకే ఇలా హత్యాయత్నాలకు చంద్రబాబు, లోకేశ్‌ పురమాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.   

భయోత్పాతంతో బస్సు యాత్ర ఆపాలనే.. 
సీఎం జగన్‌ బస్సు యాత్రకు ప్రజలు హారతులు పడుతున్నారు. లక్షల్లో ప్రజలు ఆయన సభలకు హాజరవుతున్నారు. ఇదే చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జైత్రయాత్రలా సాగుతున్న బస్సు యాత్రను ఆపడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవడానికే చంద్రబాబు, లోకే‹Ùలు ఆపార్టీ శ్రేణులను సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసేందుకు పురిగొలిపారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భయోత్పాతం సృష్టించడం ద్వారా సీఎం జగన్‌ బస్సు యాత్రను ఆపేయడానికే ఈ దారుణం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

చలించని సీఎం... యథాతథంగా యాత్ర కొనసాగింపు 
తనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ సీఎం జగన్‌ ఏమాత్రం వెరవలేదు. వాహనంలోకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్న వెంటనే ఆయన మళ్లీ వాహనం పైభాగానికి చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కొట్ల జంక్షన్‌ నుంచి కృష్ణా హోటల్‌ సెంటర్, పైపుల రోడ్, ప్రకాశ్‌ నగర్, పాయకాపురం, కండ్రిగ, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లి వరకు అంటే 20 కి.మీ. వరకు యాత్రను కొనసాగించారు. శనివారం రాత్రి కేసరపల్లిలో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రాత్రి బస చేశారు.  

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స..  
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్‌ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్‌ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్‌ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్రై్కబ్‌ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్‌ ఆప్యాయంగా పలకరించారు.

ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్‌ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్‌ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్‌ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు.   

నేడు యాత్రకు విరామం 
యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్‌ జగన్‌కు లోకల్‌ అనస్తీషియా ఇచ్చి... కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్‌ తిరిగి తన నైట్‌ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది.  

అది హత్యాయత్నమే: వెలంపల్లి 
వైఎస్‌ జగన్‌కు తగిలిన వస్తువు తనకూ తగలటంతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కంటికి గాయమైంది. సంఘటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇది ఖచ్చితంగా హత్యాయత్నమేనని, ఆ వస్తువు తాలూకు పదును, వేగం చూస్తే ఇదే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు తగిలాక... పక్కనున్న తనకు అదే వస్తువు తగిలిందని, తనకూ గాయమైందంటేనే దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి జగన్‌కు అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఈ దారుణానికి పురమాయించి ఉంటాడని వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదంటూ వంగవీటి రంగా హత్యను ఉదహరించారు.

ఎన్ని కూటములు కట్టినా, ఎందరితో కలిసి వచ్చినా జగన్‌ ముందు తాను నిలవలేకపోతున్నానన్న అక్కసుతోనే బాబు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారాయన. కాగా వైఎస్‌ జగన్‌కు తగిలిన వస్తువు చాలా పదునైనదని, అదేమిటనేది తేలాల్సి ఉందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. ఈ దిశగా తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు. అది పదునైన రాయి, చెక్కిన గ్రానైట్‌ పలక, పెల్లెట్, ఎయిర్‌ బుల్లెట్‌.. ఏదైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. అయితే ఆ వస్తువు వైఎస్‌ జగన్‌కు తగిలే సమయంలో ‘టప్‌’ మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానని, అది రాయి కాకపోవచ్చునని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆయన ఆ సమయంలో వైఎస్‌ జగన్‌కు వెనకనే అడుగు దూరంలో ఉన్నారు. స్కూలు భవనానికి చేరుకున్న పోలీసు బృందాలు పూర్తిస్థాయి దర్యాప్తు మొదలుపెట్టాయి. ఆదివారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

అన్ని కోణాల్లో దర్యాప్తు 
సీఎం వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్‌ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించాం. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్‌ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్‌ చేస్తాం. 
     –కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement