భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి ఒక వర్గం... ప్రభుత్వ రంగ సంస్థ బాగు కోసం ఇది అవసరం అంటుండగా, మరో వర్గం పన్నులు కట్టే ప్రజల డబ్బులు ఇలా వృథా చేస్తారా? అని విమర్శిస్తోంది. ఇందులో నిజానిజాలేమిటో పరిశీలిద్దాం.
2019 అక్టోబర్ 23న మొదటి రివైవల్ ప్యాకేజీ బీఎస్‌ఎన్‌ఎల్‌కి కేంద్రం ప్రకటించింది. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ సర్వీసుల కోసం స్పెక్ట్రమ్ ఇస్తామనీ, 4జీ సాంకేతిక అభివృద్ధి కోసం ఖర్చు కూడా భరిస్తామనీ చెప్పారు. సంస్థ ఉద్యోగులకు వాలంటరీ పథకం కూడా ఇందులోనే ప్రకటించి దాదాపు 80,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకం కింద భారతీయ సాంకేతిక పరిజ్ఞానం వాడి... 4జీ సౌకర్యం బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. ప్రయివేటు టెలికాం కంపెనీలు మాత్రం విదేశీ సాంకేతిక పరిజ్ఞా నాన్ని వాడుకునే వెసులుబాటు కల్పించారు.
గత మూడేళ్ళుగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సర్వీసులు ప్రారంభిం చడానికి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కనుక 4జీ స్పెక్ట్రమ్ కోసం సర్దుబాటు చేస్తానన్న 44,993 కోట్లు కానీ, 4జీ సాంకేతిక అభివృద్ధి కోసం ఇస్తామన్న 22,471 కోట్లు కానీ గతంలో ప్రకటించిన 70,000 కోట్ల రివైవల్ ప్యాకేజీలో చెప్పినవే! వాటినే ఇప్పుడు మరో సారి కేంద్రం 1.64 లక్షల కోట్ల ప్యాకేజీలో కలిపి గొప్పగా పెద్ద అంకె కనపడేలా చేసింది. కనుక ఈ మొత్తంలో 67,464 కోట్లు మినహాయిం చాల్సి ఉంటుంది. ఏమీ ఆదాయం రాని భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్‌ఎల్)ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయడం అదనపు భారమే.
కేంద్రం ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్ ప్యాకేజీలో 4జీ కోసం రూ. 44,993 కోట్లు ఈక్విటీని ఇన్ఫ్యూజన్ చేస్తామనీ, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై బీఎస్‌ఎన్‌ఎల్ చెల్లించాల్సిన రూ. 33,404 కోట్లు ఈక్విటీగా మారుస్తామనీ చెప్పారు. ప్రయివేటు టెలికాం కంపెనీలకు పన్నులు చెల్లించకుండా నాలుగేళ్ళ మారటోరియం విధించి, బకాయిలు కట్టడానికి పదేళ్ల వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం... బీఎస్‌ఎన్‌ఎల్‌కు అలాంటి రాయితీ కల్పించలేదు. పైగా ఈక్విటీ ఇన్ఫ్యూజన్, ఈక్విటీగా మార్పు చేయాలంటే షేర్లు అమ్మాల్సి ఉంటుంది. ఇదే బీఎస్‌ఎన్‌ఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంటుకు నాంది పలుకుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి.
ప్యాకేజీలోని మంచి అంశాలు
గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం రంగం అభివృద్ధి కోసం బీఎస్‌ఎన్‌ఎల్ చేస్తున్న సేవలకు ప్రతి ఫలం ఇస్తామని ప్రభుత్వం రాత పూర్వకంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటు సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈక్వల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పేరుతో ఈ సహా యాన్ని 2011 నుండే ఆపి వేశారు. కానీ యూనియన్లు, అసోసియేషన్‌లు అడగకపోయినా 2014–2019 కాలానికి గ్రామీణ ప్రాంతాల్లో సేవలకుగాను రూ. 13,789 కోట్లు ప్రకటించారు.
అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న అప్పు రూ. 33,000 కోట్లకు సావర్న్ గ్యారెంటీ కల్పించేందుకు ప్రభుత్వం ఎవరూ అడగకుండానే ముందుకువచ్చింది. సర్వీసుల నాణ్యత పెంచు తామనీ, ఒక యూనిట్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చే ఆదాయాన్ని 170 /180 రూపాయలకు పెంచుతామనీ ప్రకటిం చడం మంచిదే. అయితే, ఈ ప్యాకేజీ ద్వారా ఒక లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొనడం హాస్యాస్పదం. ఇదే నిజమైతే బీఎస్‌ఎన్‌ఎల్‌లోని యాభై శాతం మందిని వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా ఇప్పటికే ఇంటికి పంపడం ఎందుకు?
ఒడాఫోన్ ఐడియా సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడగానే, ఆ సంస్థను బీఎస్‌ఎన్‌ఎల్‌లో కలపాలని ఊదరగొట్టిన కొంత మంది... బీఎస్‌ఎన్‌ఎల్‌కు లక్షల కోట్లు దోచి పెడుతున్నట్లూ... తద్వారా ప్రజాధనాన్ని దోచి పెడుతున్నట్లూ గగ్గోలు పెడుతు న్నారు. నిజానికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీలో రూ. 13,789 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సర్వీసుల పరిహారం తప్ప, ఏదీ కొత్తది కాదు. అప్పుకు హామీ ఇవ్వడం భారం కాదు. మిగతా మొత్తాలను ఈక్విటీగా మార్చడంవల్ల అదనపు భారం లేదు.
ఏమైనా, బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటం వల్లనే టెలికాం రంగం సమతూకంగా ఉంటుందనీ, కనుక బీఎస్‌ఎన్‌ఎల్ మనుగడ కోసం కృషి చేస్తామనీ, దానికి 5జీ కూడా ఇస్తామనీ ప్రభుత్వం ప్రకటించడం మాత్రం ముదావహం. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా, ఈ ప్యాకేజీని ఎంత త్వరగా అమలు చేస్తారు, దాని ఫలితాలు ఏమిటన్నది వేచి చూడాలి.
తారానాథ్ మురాల
వ్యాసకర్త టెలికాం రంగ విశ్లేషకులు
ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి?
Published Sun, Jul 31 2022 2:29 AM | Last Updated on Sun, Jul 31 2022 2:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment