
‘కళలు ఉన్నంతకాలం
నా గుండెను వేదిక చేస్తా
కళాకారుణ్ణి బతికిస్తా...’
ఇది ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కళాకారులకు ఇచ్చిన భరోసా. డిసెంబర్ 23 నుంచి 29 వరకు గుంటూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ 2022 వ సంవత్సర ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండీ వందల సంఖ్యలో కళాకారులు ఏడురోజులూ ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ’ ఆధ్వర్యంలో స్వర్గీయ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణం (శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం – ఎ.సి.) ఇందుకు వేదికైంది.
ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పర్యవేక్షణలో విజయ కుమార్ రెడ్డి, శేషశాయి ఇత్యాది ఉన్నతాధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్ల పట్ల కళాకారులు సంతుష్టి వ్యక్తం చేశారు. కళాకారులకు, అతిథులకు, ప్రదర్శన లకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాల్లో ఈ ఉత్సవాలకూ గతంలో జరిగిన ఉత్సవాలకూ హస్తిమశకాంతరం ఉందనీ, ఇంత ఘనంగా, ఎంతో పారదర్శకంగా... మరీ ముఖ్యంగా టైమ్ ప్రకారం – గతంలో ఎన్నడూ జరగ లేదని పలువురు కళాకారులు అన్నారు. ఆర్టిస్టులకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. అల్పాహార, భోజన సదుపాయం పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం విశేషం.
రెండు మూడు తరగతులు చదువుతున్న బుడతల నుండి... జీవితాన్ని కాచి వడపోసిన... డెబ్భైలు దాటిన సీనియర్ మోస్ట్ కళాకారుల వరకూ పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ‘2022 నంది నాటక ఉత్సవా’లను ఇప్పుడు నిర్వహించారు.
వివిధ విభాగాలకు సంబంధించి 115 ఎంట్రీలు రాగా ప్రాథమిక పరిశీలన అనంతరం– పద్య నాటకాలు 10 (ప్రదర్శన పారితోషికం రూ. 50 వేలు), సాంఘిక నాటకాలు 6 (రూ. 40 వేలు); సాంఘిక నాటికలు 12 (రూ. 25 వేలు); బాలల విభాగంలో 5 (రూ. 25 వేలు); కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థుల విభాగంలో 5 (రూ. 25 వేలు) మొత్తం 38 నాటక, నాటికలను ప్రద ర్శించారు. మొత్తం 72 బహుమతుల కోసం దాదాపు పన్నెండొందల మంది కళాకారులు హోరాహోరీ తల పడ్డారు.
పద్య నాటక విభాగంలో మాధవవర్మ – విజయవాడ (ప్రథమ రూ. 80 వేలు, బంగారు నంది), శ్రీకాంత కృష్ణమాచార్య – విశాఖ (ద్వితీయ రూ. 60 వేలు, రజిత నంది); వసంతరాజీయం – హైదరాబాద్ (తృతీయ రూ. 40 వేలు, కాంస్య నంది) విజేతలుగా నిలిచాయి.
అలాగే.. సాంఘిక నాటకాల విభాగంలో ఇంద్ర ప్రస్థం – గుంటూరు (రూ 70 వేల నగదు, బంగారు నంది), ఇంపోస్టర్స్ – హైదరాబాద్ (రూ. 50 వేల నగదు, రజత నంది); కలనేత – హైదరాబాద్ (రూ. 30 వేల నగదు, కాంస్య నంది); సాంఘిక నాటికల విభా గంలో అస్తికలు – పెదకాకాని (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కమనీయం – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), చీకటిపువ్వు – కరీంనగర్ (రూ. 20 వేల నగదు, కాంస్య నంది); బాలల విభాగంలో ప్రపంచతంత్రం – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), బాధ్యత – రాప్తాడు (రూ. 30 వేల నగదు, రజత నంది), మూడు ప్రశ్నలు – విజయవాడ (రూ. 20 వేల నగదు, రజత నంది); యువజన విభాగంలో ఇంకానా..? – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కపిరాజు – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), ఉద్ధంసింగ్ – తిరుపతి (రూ. 20 వేల నగదు, కాంస్య నంది) బహుమతులను గెలుచుకున్నాయి.
నాటకరంగంపై రచనల్లో ‘రాయలసీమ నాటక రంగ వికాసం’ (రచయిత డా. మూల మల్లికార్జునరెడ్డి) ఉత్తమ రచనగా ఎంపికైంది. ‘ఎన్టీఆర్ స్మారక రంగస్థల పురస్కారా’న్ని డా. మీగడ రామలింగస్వామి – విశాఖకు (రూ. 1.5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక), ‘వైఎస్సార్ స్మారక రంగస్థల అవార్డ్’ను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్–కాకినాడ (రూ. 5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక)ను అందించారు. దర్శకత్వం, రచన సహా పలు అంశాల్లో వ్యక్తిగత అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు.
వ్యక్తిగత బహుమతుల నగదు మొత్తాన్ని ఐదురెట్లు పెంచుతున్నట్లు చైర్మన్ పోసాని ప్రకటించడంతో కళా కారుల ఆనందానికి అవధుల్లేవు. మైక్, లైటింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడం ఉత్సవాల విజయానికి దోహదపడింది.
పక్కా ప్రణాళికతో... ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ సమీక్షలతో మొత్తం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారంటూ పోసాని టీమును ఆర్టిస్టులు, అతిథులు మనఃపూర్వకంగా అభినందించడం ఈసారి ’నంది’ పండగ హైలైట్.
– జి.వి. రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment