స్థావర ప్రాంతాలే అమెరికా ధ్యేయం | Shalini Chawla Article On Pakistan United States Relations | Sakshi
Sakshi News home page

స్థావర ప్రాంతాలే అమెరికా ధ్యేయం

Published Mon, Jun 14 2021 12:18 AM | Last Updated on Mon, Jun 14 2021 8:15 AM

Shalini Chawla Article On Pakistan United States Relations - Sakshi

పాకిస్తాన్‌ను అమెరికా దువ్వడం వెనక ఆ దేశంలో తన సైనిక స్థావరాలను నెలకొల్పే లక్ష్యముందని నిపుణుల అంచనా. ఇకపోతే పాకిస్తాన్‌కి 6 బిలియన్‌ డాలర్ల ఐఎమ్‌ఎఫ్‌ రుణ పంపిణీకి అమెరికా మద్దతు తెలపడం.. ఆ దేశ రాజకీయ వ్యూహంలో కొత్తమలుపునకు సంకేతమేననిపిస్తోంది. 2018 జూన్‌ నుంచి పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ గ్రే లిస్ట్‌లో ఉంచడం తెలిసిందే. ఉగ్రవాద నిరోధక చర్యలను సమర్థంగా నిర్వహించకపోవడమే దీనికి కారణం. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి విధించిన గడువును కోవిడ్‌ సంక్షోభంతో అనేకసార్లు పొడిగిస్తూ వచ్చారు. అయితే మారుతున్న పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్‌ ఈసారి గ్రే లిస్టు నుంచి బయటపడవచ్చని తెలుస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవచ్చని పాక్‌ ఆశాభావంతో ఉంటోంది.

అమెరికా వ్యతిరేక ఉగ్రవాదానికి సైనిక స్థావరంగా అఫ్గానిస్తాన్‌ను ఉపయోగించుకోవడం, అమెరికా సేనలు సెప్టెంబర్‌ 11, 2021వ తేదీన తన భూభాగం నుంచి నిష్క్రమించాక అఫ్గానిస్తాన్‌ అంతర్యుద్ధంలో చిక్కుకోవడాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్‌లో తన సైనిక స్థావరాలను ఏర్పర్చుకునే అవకాశాల గురించి పెంటగాన్‌ ప్రయత్నిస్తోందంటూ పలు ఊహలు చెలరేగుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యలు జరపడం కోసం పాకిస్తాన్‌లో అమెరికా సైనిక స్థావరాలను అనుమతించబోవడం సాధ్యపడదని పాకిస్తాన్‌ విదేశీ మంత్రి షా అహ్మద్‌ ఖురేషి తాజాగా ప్రకటించారు. మరోవైపున అమెరికా సైనిక స్థావరాలను తమతమ భూభాగాల్లో అనుమతించరాదని అఫ్గాన్‌ తాలిబన్‌లు పొరుగు దేశాలను హెచ్చరించారు. ’మా పొరుగు దేశాలు తమ భూభాగాలపై పరదేశ సైనిక స్థావరాలను అనుమతించే చర్యలకు పూనుకోవద్దని కోరుతున్నాం. ఒకవేళ అలాంటి పనికి ఎవరైనా పాల్పడితే పెద్ద చారిత్రక తప్పిదమే అవుతుంది. అలాంటి తీవ్రమైన, రెచ్చగొట్టే చర్యల పట్ల తాలిబన్‌ మౌనంగా చూస్తూ ఉండదు’ అని తాలి బన్లు హెచ్చరించారు. తన భూభాగంలో అమెరికా వైమానిక స్థావరాలను అనుమతించబోతున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్తాన్‌ ఇప్పటికైతే తిరస్కరించింది. అయితే మరోవైపున ఎయిర్‌ లైన్స్‌ కమ్యూనికేషన్, గ్రౌండ్‌ లైన్స్‌ కమ్యూనికేషన్‌కి సంబంధించిన అత్యవసర సహకారంపై 2001లోనే అమెరికాతో తాము ఒడంబడిక చేసుకున్నందున గగనతలం నుంచి, భూతలం నుంచి అమెరికాకు తామందిస్తున్న సహకారం కొనసాగుతుందని పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం నిర్ధారించడం గమనార్హం.


నిస్సందేహంగానే, అమెరికా ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి పాకిస్తాన్‌ వ్యూహాత్మకంగా ముందుకు కదలాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.  అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనాకాలంలో ఇది సాధ్యపడుతుందని పాక్‌ ఆశాభావంతో ఉంది. అమెరికన్‌ రక్షణ రంగ నిపుణులతో, భద్రతా విధాన నిపుణులతో గణనీయంగా సంబంధాలు నెరపిన ప్రస్తుత పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు మోయిద్‌ యూసఫ్‌ గత కొద్ది నెలల్లోనే పాక్‌ ప్రభుత్వ వ్యవస్థ విశ్వసాన్ని సంపాదించుకున్నారు. తన ఎజెండాలో పాక్‌–అమెరికన్‌ సంబంధాల పునరుద్ధరణ కీలకంగా ఉంది. ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాతో కలిసి ముందుపీఠిన ఉండి పోరాడాలని పాకిస్తాన్‌ గతంలో తీసుకున్న నిర్ణయం పట్ల 2018లో అధికారంలోకి వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదేపదే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక దేశీయంగా చూస్తే అమెరికా ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో పాక్‌ పాత్ర పట్ల తీవ్ర ఆగ్రహం రగుల్కొంటోంది. 


మరోవైపున, గత రెండు దశాబ్దాలుగా చైనాతో పాకిస్తాన్‌ సంబంధబాంధవ్యాలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. సైనిక నిర్మాణం, 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక పెట్టుబడులు వంటి కీలకమైన రంగాల్లో బీజింగ్‌ నాయకత్వం చేస్తున్న సహాయం పట్ల పాకిస్తాన్‌ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అన్నిటికంటే మించి భారత్‌ వ్యతిరేక కశ్మీర్‌ ఎజెండాను సమర్థించడంలో దౌత్యపరంగా చైనా అందిస్తున్న సహకారానికి పాక్‌ ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చూస్తోంది. ఒకవైపు దేశీయంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ చైనాతో వ్యూహాత్మక పొత్తు బలంగా ఏర్పర్చుకున్న పాకిస్తాన్‌.. తాజాగా అమెరికాకు సైనిక స్థావరాలను కల్పించడంపై అఫ్గాన్‌ తాలిబన్లు మృదువుగా హెచ్చరిస్తున్నప్పటికీ, పలు కారణాల వల్ల అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణకు మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది.


పాక్‌ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మద్దతు ఎంతైనా అవసరముంది. స్వల్ప అభివృద్ధి రేటు, పెరిగిన అప్పులు, అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2019లో ఐఎమ్‌ఎఫ్‌తో 6 బిలియన్‌ డాలర్ల రుణ ఒప్పందాన్ని అత్యంత కఠినమైన షరతులతో పాకిస్తాన్‌ ప్రభుత్వం కుదుర్చుకుంది. కఠినమైన రుణ నిర్వహణ పథకాన్ని అమలు చేయాలని, పన్నులను పెంచాలని, ఇంధనరంగంలో సంస్కరణలకు తలుపులు తెరవాలని ఐఎమ్‌ఎఫ్‌ పాక్‌ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు అమెరికా ఇవ్వనున్న 6 బిలియన్‌ డాలర్ల రుణ పంపిణీ చాలా కీలకంగా మారింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్‌ ఈసారి గ్రే లిస్టునుంచి బయటపడవచ్చని తెలుస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా మొత్తం పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవచ్చని పాకిస్తాన్‌ ఆశాభావంతో ఉండటం విశేషం. 


పాకిస్తాన్‌ అవలంబిస్తున్న అఫ్గాన్‌ విధానంలో మార్పులు చోటుచేసుకోవచ్చనిపిస్తోంది. పాకిస్తాన్‌ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపట్ల అప్గానిస్తాన్‌ నాయకత్వం తన ఆగ్రహాన్ని ప్రకటిస్తూనే వస్తోంది. ఏదేమైనప్పటికీ అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ద్వారా ఏర్పడనున్న అస్థిరత పాక్‌ సమస్యలను రెట్టింపు చేయనుంది. అఫ్గానిస్తాన్‌లో అస్థిరత్వం పాకిస్తాన్‌కి చెందిన తెహ్రీక్‌ ఇ తాలిబాన్‌ పాకిస్తాన్‌ గ్రూప్‌ ప్రభావాన్ని రెట్టింపు చేయనుంది.  సైనిక నిఘా, పరిమితమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అఫ్గాన్‌ భద్రతా దళాలకు దన్నుగా ఉండటం వంటి లక్ష్యాల సాధనకు సైనిక స్థావరాలను నెలకొల్పుకునే అవకాశాలను అమెరికా ఎంచుకుంటోంది. ఈ క్రమంలో అమెరికా నాలుగు సమర్థ అవకాశాలను కలిగి ఉంది. 1. అమెరికా ప్రయోజనాలకు సంబంధించి పాకిస్తాన్లో సైనిక స్థావరాల స్థాపన అత్యంత అనుకూలమైన అంశం. పైగా ఇరుదేశాల మధ్య సహకారం ఇప్పటికే ఉంది. 2. తమ వైమానిక స్థావరాల ఏర్పాటుపై మధ్య ఆసియా రిపబ్లిక్‌ దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది కానీ దీనిపై పెద్ద స్పష్టత కానరావడం లేదు. 3. ఖతార్‌లోని వైమానిక స్థావరంతో సహా గల్ఫ్‌ ప్రాంతంలో ఉంటున్న అమెరికా సైనిక స్థావరాలు అంత అనుకూలత కలిగిలేవు. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికా తన డ్రోన్‌లను ప్రయోగించాలంటే దాని సైనిక విమానాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ప్రయాణించాల్సి ఉంటుంది. 4. కాగా అమెరికా సైనిక విమానాలకు గగనంలోనే ఇంధనం నింపుకునే సౌకర్యం అరేబియా సముద్రంలోని ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్లలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఉగ్రవాద నిరోధక చర్యలకు పాకిస్తాన్‌ ఎంత అనుకూలంగా ఉంటోందో నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఏకకాలంలోనే అటు అమెరికాతో, ఇటు చైనాతో సంబంధాలను నైపుణ్యంగా కొనసాగించే కళలో పాక్‌ రాటుదేలిపోయింది కూడా.


అయితే ఈ మొత్తం ప్రక్రియలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాతో పాక్‌ నేరుగా కలిసి పనిచేస్తుందా లేదా అమెరికన్‌ డ్రోన్‌ ఆపరేషన్ల కోసం పరోక్ష మద్దతు యంత్రాంగాన్ని మాత్రాన్నే కల్పిస్తుందా? పైగా చైనాతో సంబంధాలకు విఘాతం కలగకుండానే అమెరికాతో పాత సంబంధాలను పాక్‌ ఏర్పర్చుకోగలుగుతుందా? అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికన్‌ సేనల ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోకి రావచ్చు. అందుకే ఈ ప్రాంతంలో తన భవిష్యత్‌ వ్యూహాన్ని రూపొందించుకోవడానికి గాను ప్రస్తుత పరిణామాలను భారత్‌  నిశితంగా పరిశీలించాల్సి ఉంది.
– వ్యాసకర్త విశిష్ట పరిశోధకురాలు, 


షాలిని చావ్లా 
సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌
(ట్రిబ్యూన్‌ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement