
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధంలో సామాజిక మాధ్యమాలు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్‌టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. యుద్ధం అనివార్యమని స్పష్టమవుతుండటంతో సైనిక దళాల కదలికలను పసిగట్టడానికి వారు తక్షణం రంగంలోకి దిగారు. తమ జీవితాలు ఎలా ధ్వంసమవుతున్నాయో ప్రపంచానికి చూపడానికి స్మార్ట్ ఫోన్లను ఉపయోగించసాగారు. అదే సమయంలో రష్యన్ ప్రభుత్వం సెన్సార్‌షిప్ పేరుతో మీడియాపై యుద్ధం ప్రకటించింది. అసలు యుద్ధం ఎలా పరిణమిస్తుందో గానీ, ఈరోజు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. అఫ్గానిస్తాన్, సిరియా ఉదంతంలో కంటే, టిక్‌టాక్ వీడియోలు ఉక్రెయిన్‌పై యుద్ధంతో మరింత త్వరగా, సన్నిహితంగా పెనవేసుకుపోయాయి. హృదయాలను అద్భుతమైన ఊహాత్మకతతో గెల్చుకోవడం ఎలాగో టిక్‌టాక్ ఉక్రెయినియన్లకు నేర్పింది. ఉక్రెయినియన్లు ఈ మాధ్యమాన్ని అధికంగా వినియోగిస్తారు కనుక ఇది వారి ఏకైక వేదికగా మారింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని జర్నలిస్టులకు ఈ యూజర్లే ప్రధాన వనరులు అయిపోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉంటున్న ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ ఫిబ్రవరి 23న పరుపుమీద కూర్చుని తనకు తాను రికార్డింగ్ చేశారు.
తనకు సమీపంలో పేలుళ్ల గురించి ఆమె వర్ణిస్తూ ఏదో సీరియస్ ఘటన ప్రారంభమవుతున్నట్లుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈలోగా రష్యాలో యువతీయువకులు రష్యన్ మాల్స్‌లో షాపులను మూసి వేస్తున్న వీడియోలను పోస్ట్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఒక ఉక్రెయిన్ మహిళ, పోలండ్‌వైపు తాను ప్రయాణిస్తున్న ప్రతి అడుగునూ గ్రాఫిక్స్‌తో చూపిస్తూ తాను తప్పించుకున్న విధానాన్ని సుదీర్ఘంగా చూపించారు. ఆమె పది గంటలపాటు రైలులో నిల్చుని ప్రయాణించింది. తర్వాత సరిహద్దు వద్ద అయిదుగంటల పాటు నిలబడి పాస్‌పోర్టు కూడా లేకుండా పోలండ్‌లోకి అడుగుపెట్టింది. అలాగా తన చుట్టూ ఉన్న ఇతర శరణార్థులు రుచికరమైన కుడుములను తింటూండటం గురించి కూడా ఆమె చిత్రీకరించింది. యుద్ధ నేపథ్యంలో టిక్‌టాక్ వ్యూయర్లు ఉక్రెయిన్ గురించి చేసిన శోధన ఒక్కరోజులో 1.4 బిలియన్లకు పెరిగిందని వార్‌టాక్ అనే టిక్‌టాక్ అకౌంట్ పేర్కొంది.
ఇలా యుద్ధంలో నాలుగు వారాలు గడిచిన తర్వాత అమెరికా, రష్యా రెండు దేశాలూ ఉక్రెయిన్‌పై దాడి గురించిన వార్తలను ఈ టిక్‌టాక్ యూజర్ల పోస్టుల నుంచే తమ ప్రజలు చూస్తున్నారని గుర్తిం చాయి. ముప్పైమంది ఉక్రెయిన్ సోషల్ మీడియా ప్రభావశీలురికి కనీవినీ ఎరుగని విధంగా జో బైడెన్ పాలనాయంత్రాంగం బ్రీఫింగ్ చేయడం అసాధారణమనే చెప్పాలి. అలాగే మాస్కో ప్రభుత్వ అను కూల వార్తలు పోస్ట్ చేయడం కోసం రష్యన్ ప్రభుత్వం రష్యన్ సోషల్ మీడియా ప్రభావశీలురకు డబ్బులిస్తోందని వైస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే అనుకూల ప్రచారంతో యుద్ధాన్ని గెలవడానికి రష్యాకు సోషల్ మీడియా ప్రభావశీలురు సరిపోరు. ఎందుకంటే యుద్ధాన్ని మొదలు పెట్టిందే రష్యా కదా! రష్యన్ అనుకూల ప్రచారా నికి పెద్దగా విలువ ఏముంటుంది?
ఉక్రెయిన్‌కి ఉన్న ఇంటర్నెట్ పునాదిని ఎవరూ అంతతేలిగ్గా లోబర్చుకోలేరు. ఉక్రెయిన్‌లో 5 వేల మంది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. రష్యా దాడి ప్రారంభం కాగానే శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీస్ కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్‌ని యాక్టివేట్ చేశారు. ఈలోపు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తోపాటు, ప్రభుత్వ వ్యతిరేక యుద్ధ వార్తలు పంపితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించడంతో టిక్‌టాక్ వంటి ఇతర అంతర్జాతీయ మీడియాపై ఆధారపడటం మరింతగా పెరిగింది. సైనిక కార్యకలాపాలపై తప్పుడు వార్తలు పంపితే 15 సంవత్సరాల జైలు శిక్షకు అనుమతిస్తూ రష్యా పార్లమెంట్ మార్చి నెల ప్రారంభంలో చట్ట సవరణ చేసింది. కొద్ది రోజుల లోపే ప్రముఖ పాశ్చాత్య వార్తల నెట్ వర్క్‌లన్నీ రష్యా నుంచి బయటకు వెళ్లిపోయాయి. తమ జర్నలి స్టులను ప్రమాదంలో పడేయడం ఇష్టంలేక బీబీసీ, బ్లూమ్‌బెర్గ్ తదితర పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్లు కూడా రష్యాలోని తమ ఆఫీసులను ఖాళీ చేశాయి. దేశం లోపల ప్రముఖ అమెరికన్ టెలివిజన్ నెట్‌వర్క్స్ వార్తల ప్రసారాన్ని నిలిపివేయడంతో సోషల్ మీడియా వీడియోలు విస్తృ తంగా ప్రసారమవుతున్నాయి.
ఇకపోతే ఉక్రెయిన్ సోషల్ మీడియా రష్యన్ ప్రాపగాండాని ఎదుర్కోవడంలో మీకు తోడ్పడుతుంది. తన సొంత సోషల్ మీడియా బలగాన్ని ఏర్పర్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేతృత్వంలోనే సెన్సార్ షిప్ ఉంటుంది కాబట్టి వార్తలపై ఆంక్షలు విధించే పరిస్థితి కూడా ఉత్పన్నం కాదు. పైగా ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా చాలా స్థిరమైంది. దాన్ని విస్తృతంగా అనుసరిస్తుంటారు. ఇక ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రెండో యుద్ధం ఏమిటి అంటే, తప్పుడు సమాచారం, దుష్ప్రచారంపై సాగిస్తున్న యుద్ధమే! సాంకేతిక అవకా శాలు విస్తృతమవుతున్నందున యుద్ధ కాలంలో వాస్తవాల తనిఖీ కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రిటన్‌లో సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిసైలెన్స్ సంస్థ తనిఖీ చేసిన టిక్‌టాక్ వీడియోలలో 80 నుంచి 90 శాతం వరకు పౌరులు పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోలు అని తెలిసింది. ఈ యుధ్ధం మనకు తెలిపింది ఏమిటంటే, ఔత్సాహికులు, ఓపెన్ సోర్స్ పరిశోధకులు రష్యా దాడి సమయంలో కీలకమైన సైనిక కదలికలను విశ్లేషించడానికి టెక్నాలజీని ఉపయోగించడం. సైన్యం కదలికలను జియోలొకేట్ ద్వారా వీడియోలు తీసి యుద్ధం జరుగుతుండగానే ఘటనలను పునర్నిర్మించడం ప్రపంచానికి కొత్తే అని చెప్పాలి.
చివరగా, రష్యన్ ప్రభుత్వం సెన్సార్షిప్‌కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం గురించి చెప్పాలి. బ్లాక్ చేసిన సేవలను పొందడానికి రష్యా లోనే వీపీఎన్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయడం విపరీతంగా పెరిగి పోయింది. మరొక మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఇప్పటికీ ప్రభుత్వ అనుకూల, స్వతంత్ర కంటెంట్ రెండింటినీ పొందడానికి అనుమతి స్తోంది. బీబీసీ, రష్యన్ సర్వీస్ వంటి కొన్ని విదేశీ మీడియాల కంటెంట్‌ని కూడా టెలిగ్రామ్ అందిస్తోంది. అటు ఉక్రెయిన్‌లో, ఇటు రష్యాలో కూడా స్వతంత్ర మీడియాని సజీవంగా ఉంచడానికి పాశ్చాత్య దేశాల నుంచి దాతలు క్రౌడ్ ఫండింగ్ అందించడానికి పరుగు తీస్తున్నారు. రష్యన్ ప్రముఖ స్వతంత్ర వార్తా వెబ్‌సైట్ మెదుజా, లాత్వియాకు వెలుపల ఉన్న రష్యా శ్రోతలకు సమాచారం పంపుతూంటుంది. ఇది ఇప్పుడు మీడియా ఫండింగ్ సోదర కంపెనీ లకు పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది.
గూగుల్, ఫేస్‌బుక్ వంటి బడా మీడియా కంపెనీలతో పెట్టుకున్న రష్యా నష్టపోయింది. ఈ రెండు కంపెనీలు రష్యాను బ్లాక్ చేశాయి. రష్యా ఆన్‌లైన్ ఆర్థికవ్యవస్థకు ఊపిరాడకుండా చేసిన రెండు ప్రభావాల గురించి ఒక ప్రముఖ పత్రిక జర్నలిస్టు పేర్కొన్నారు. అవి ఏమిటంటే, సాంకేతిక నిపుణులు చాలామంది రష్యాను వదిలి వెళ్లిపోయారు. దీంతో రష్యన్ సెర్చ్ ఇంజిన్లు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీల నుంచి వచ్చిన ప్రకటనలపైనే ఇవి ఆధారపడి ఉండేవి.
‘పుతిన్స్ పీపుల్: హౌ ద కేజీబీ టుక్ బాక్ రష్యా అండ్ దెన్ టుక్ ఆన్ ద వెస్ట్’ పుస్తకం రాసిన జర్నలిస్ట్ కేథరిన్ బెల్టన్, పుతిన్ 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్ష పదవిని చేపట్టాక వేసిన తొలి అడుగు గురించి చెప్పారు. అధికారం చేపట్టిన నాలుగు రోజులలోపే రష్యాలో ప్రైవేట్ యాజమాన్యంలోని మీడియాకు వ్యతిరేకంగా పుతిన్ చర్యలు చేపట్టారు. ‘మీడియా మోస్ట్’ సంస్థ యజమాని, పాపులర్ టీవీ చానల్ ఎన్టీవీ ఓనర్ అయిన వ్లాదిమిర్ గుసిన్‌స్కీ ఆఫీసులపై పుతిన్ దాడి చేయించారు.
మీడియా పవర్‌పై రష్యా అధ్యక్షుడి బద్ధ వ్యతిరేకత, ప్రభుత్వ టీవీపై ప్రయోగాలు చేయడం, ప్రైవేట్ మీడియా సంస్థలను ప్రభుత్వం స్వాధీనపర్చుకోవడం, ప్రభుత్వ కంపెనీ గాజ్‌ప్రోమ్ స్వాధీనం చేసుకున్న మీడియా ఆస్తులను తాను నమ్మిన కీలక వ్యక్తు లకు పుతిన్ అప్పగించడం వంటి ప్రతి అంశాన్నీ ఈ పుస్తక రచయిత్రి పూసగుచ్చినట్లు వివరించారు. కానీ తన మతిస్థిమితం లేనితనం, మూర్తీభవించిన అహంభావం అలా పక్కనబెట్టి చూస్తే, ఈ రోజు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ తన ప్రధాన శత్రువైన టెక్నాలజీ విషయంలో ఏ రకంగానూ సరిపోలనని నిరూపించుకుంటున్నారు.
వ్యాసకర్త జర్నలిస్ట్, మీడియా వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment