తమిళనాడుకు ఐదు విడతలు ముఖ్యమంత్రిగా ఉన్నా, జీవితాంతం మనసంతా సాహిత్యం చుట్టూ తిరుగుతూ ఉండటం ముత్తువేల్ కరుణానిధికే చెల్లింది. ద్రావిడ ఉద్యమంలో తొలి విద్యార్థి సంఘం నాయకుడై ఉద్యమంతో బాటే రచనకూ శ్రీకారం చుట్టారాయన. 13 ఏళ్ల వయసులోనే ‘సెల్వచంద్ర’ చారిత్రక నవల రాశారు. చదువు హైస్కూల్ స్థాయి దాటక పోయినా చారిత్రక నవలలు, జీవిత చరిత్రలు, కవితలు, కథలు, వ్యాసాలు, నాటకాలతో బాటు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడం ఆయన అద్భుతమైన రచనాశక్తికి నిదర్శనం.
ఆలయాలలో, గ్రామ వేడుకల సమయంలో మేళం వాయించే ‘ఇసై వేళాళర్’ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవటానికి వెళ్ళిన ప్పుడు అక్కడి కుల వివక్ష ఆయన మీద బలమైన ముద్ర వేసింది. సంగీతం నేర్పేవారు చులకన భావం చూపటం సహించలేకపోయారు. తన అభ్యుదయ భావాలను వెల్లడించటానికి రచనల బాట పట్టారు.
చారిత్రక చిత్రాలలో కట్టిపడేసే సంభాషణలు రాయటంలో, ప్రేక్షకులలో ఉద్వేగం నింపి ఆసక్తి పెంచే స్క్రీన్ ప్లే సిద్ధం చేయటంలో కరుణానిధి దిట్ట. తరువాతి కాలంలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిన ఎంజీ రామచంద్రన్ కథా నాయకుడిగా నటించిన మొదటి సినిమా ‘రాజకుమారి’ (1950)కి కథ, మాటలు సమకూర్చినవారు కరుణానిధి. శివాజీ గణేశన్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టి, సినిమా పరిశ్రమలో నెలబెట్టిన ఆయన మొదటి చిత్రం ‘పరాశక్తి’ (1952)లో శక్తిమంతమైన మాటలు రాసింది కూడా కరుణానిధి. దాదాపు 40 సినిమాలకు రాయటమే కాదు, ఆయన నవలలు కూడా సినిమాలుగా మారాయి.
పెరియార్ నాయకత్వంలో హిందీ వ్యతిరేక ఆందోళన జరుగుతున్న రోజుల్లో కరుణానిధిలోని అసలైన నాయకుడు బైట పడ్డాడు. దాల్మియాపురం స్టేషన్ దగ్గర రైలుపట్టాల మీద పడుకొని ఆయన ఇచ్చిన నినాదం ‘ఉడల్ మన్నుక్కు... ఉయిర్ తమి ళుక్కు’ (దేహం మట్టికి, ప్రాణం తమిళా నికి) ఇప్పటికీ తమిళనాట ప్రతిధ్వనిస్తూనే ఉంది. 1965లో హిందీ ఉద్యమంలోనే శివలింగం అనే యువకుడు ఆత్మాహుతి చేసుకుంటూ రాసిన లేఖలోని ఇవే మాటలను... మణిరత్నం ‘ఇరువర్’ (1997– తెలుగులో ‘ఇద్దరు’గా రిలీజ్) సినిమాలో వైరముత్తు వాడటం, ఆ తరువాత అదే పేరుగా సాయి కుమార్, రంజిత జంటగా ఒక సినిమా రావటం... అలా అదే ఉద్విగ్నత తమిళ ప్రజల్లో కొనసాగుస్తూ వస్తోంది. 70 ఏళ్ళు గడిచినా, తమిళ ప్రసంగాలలో వినిపించే శక్తిమంతమైన నినాదమిది.
అధికారంలో ఉన్నా, లేకపోయినా సాహితీ వ్యాసంగానికి ఆయన విరామం ఇవ్వలేదు. డీఎంకే ప్రచార పత్రిక ‘మురసొలి’ (తెలుగు అర్థం: శంఖారావం)లో ఆయన రాయని రోజంటూ లేదు. కథో, కవితో, వ్యాసమో లేదా కార్యకర్తలకు ఒక లేఖ అయినా రాయాల్సిందే. నాగపట్టణం జిల్లాలోని ఆయన సొంత ఊరు తిరుక్కువలైలో ఉన్న పూర్వీకుల ఇంటిని గ్రంథాలయం కోసం ఇచ్చారు. చెన్నైలోని పార్టీ కార్యాలయ భవనం అన్నా అరివాలయంలో మ్యూజియం, లైబ్రరీ ఆయన అభిరుచికి అద్దం పడతాయి.
కరుణానిధి ప్రసంగాలు ఎంతో ఆకట్టుకుంటాయి. అడుగడుగునా మెరుపులు, విరుపులు ఆయన ప్రత్యేకం. ఒకసారి తమిళనాడు తెలుగు సంఘాలు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా సత్కరించి వాటి సమ స్యలు ఏకరవు పెట్టాయి. అందులో కొన్ని ప్రభుత్వం మీద ఆర్థిక భారం వేసేవి, ఇంకొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సినవి. తెలుగు సంఘాలు ఆయనను పొగడ్తలలో ముంచెత్తి ఆయన వరాల కోసం ఎదురుచూశాయి. కరుణా నిధి తన సత్కారానికి ధన్యవాదాలు చెబుతూ, ‘‘కరుణ ఎంత కావాలన్నా తీసుకోండి, నిధి మాత్రం అడక్కండి’’ అని తన మనసులో మాట చమత్కారంగా చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి ఆయన సెక్యూరిటీని వదిలేసి అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయారు.ఇంటలిజెన్స్ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. రాత్రి 10 గంటలకు అదృశ్యమైన ముఖ్యమంత్రి తెల్లవారు జామున నాలుగు గంటలకు ఇంటికి చేరారు. ఎక్కడికి వెళ్ళారన్నది రహస్యం. రెండు రోజుల తరువాత ఆయన ‘మురసొలి’లో రాసిన సుదీర్ఘ సాహిత్య వ్యాసం చదివిన తరువాతగానీ అసలు విషయం తెలియలేదు. ఆ ముందురోజు రాత్రి ఆయన వైరముత్తును వెంటబెట్టుకొని మహాబలిపురం రోడ్డులో సమద్రతీరానికి వెళ్ళి సాహిత్య చర్చలు జరిపారు. ఆ సంభాషణ సారాంశాన్ని ఆ వ్యాసంలో రాశారు.
తమిళ భాష మీద కరుణానిధికి ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. తిరువళ్ళువర్ మీద అభిమానంతో ఆయన స్మారక చిహ్నంగా చెన్నై నగరం నడిబొడ్డున ‘వళ్ళువర్ కొట్టం’ నిర్మించారు. ప్రారంభానికి కొద్ది వారాల ముందు అకస్మాత్తుగా ప్రభుత్వం రద్దవటంతో 13 సంవత్సరాల తరువాత ప్రారంభించటమే కాదు, అక్కడే ప్రమాణ స్వీకారోత్సవం జరిపారు. కన్యాకుమారిలో 133 అడుగుల తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళానికి శాస్త్రీయ భాష హోదా కల్పించటంలో విజయం సాధించారు. పారిస్, కౌలాలంపూర్ మొదలు కోయంబత్తూరు, మదురై దాకా జరిగిన ప్రపంచ తమిళ సదస్సులలో పాల్గొనటంతో బాటు స్వయంగా థీమ్ సాంగ్ రాశారు.
1924 జూన్ 3న పుట్టిన కరుణానిధికి ఇది శతజయంతి సంవత్సరం. ఈ జూన్ 3 నుంచి వచ్చే జూన్ 3 వరకు అనేక కార్యక్రమాలు జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సాహిత్యాభిలాషకు చిహ్నంగా చెన్నై మెరీనా తీరంలో 42 మీటర్ల ఎత్తుండే ఒక కలాన్ని పంచలోహ విగ్రహంగా నెలకొల్పుతున్నారు. తీరానికి 360 మీటర్ల దూరంలో సముద్రంలో ఏర్పాటు చేస్తున్న ఈ కలం విగ్రహం, ఇప్పటికే ఉన్న కరుణానిధి సమాధికి చేరువ లోనే ఉంది. గ్లాస్ ఫ్లోరింగ్‌తో నిర్మించే ల్యాటిస్ బ్రిడ్జ్ మీదుగా సందర్శకులు వెళ్ళే విధంగా మొత్తం 80 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి.
స్వీయ ప్రసంగాలలోనూ, లేఖలలోనూ ‘ఎన్ ఉయిరి నుమ్ మేలాన అన్బు ఉడన్ పిరప్పుగళే’ (నా ప్రాణం కంటే మిన్నయైన ప్రియమైన తోబుట్టువులారా) అని సంబోధించే కరుణానిధిని కార్యకర్తలు స్మరించుకోవటానికి ఇది తగిన ప్రదేశంగా మారుతుంది. వందకు పైగా రచనలు చేసిన కరుణానిధికి ఇది సరైన నివాళి.
తోట భావనారాయణ, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు
(జూన్ 3 నుంచి కరుణానిధి శతజయంతి వేడుకలు ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment