తెగని ‘మహా’ పంచాయితీ.. ఇంతకూ అసలైన ‘సేన’ ఎవరిది? | Uddhav Thackeray vs Eknath Shinde Bottle Shivsena Abhay Nevagi Opinion | Sakshi
Sakshi News home page

Maharashtra Politics: తెగని ‘మహా’ పంచాయితీ.. ఇంతకూ అసలైన ‘సేన’ ఎవరిది?

Published Tue, Jul 12 2022 9:03 AM | Last Updated on Tue, Jul 12 2022 10:27 AM

Uddhav Thackeray vs Eknath Shinde Bottle Shivsena Abhay Nevagi Opinion - Sakshi

శివసేన ప్రధాన కార్యాలయం

కొన్ని వారాలుగా మహా రాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. శివ సేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే 34 మంది ఎమ్మెల్యే లతో తిరుగుబాటు చేసి, ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మద్దతుతో శిందే వర్గం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 288 కాగా 164 మంది సభ్యుల మద్దతు శిందే వర్గానికి లభించింది.

ఈ మొత్తం సంక్షోభంలో ఒక కీలక ప్రశ్నకు సమా ధానం లభించలేదు. తమదే నిజమైన శివసేన అని ఇరు పక్షాలూ ప్రకటించుకుంటున్న నేపథ్యంలో శిందే, అతడి రెబల్‌ ఎమ్మెల్యేలకు ఉన్న రాజ కీయ అనుబద్ధత ఏమిటి? శిందేకు స్పష్టంగానే శివసేన శాసన సభ్యుల మద్దతు ఉంది. కానీ ఆ ప్రాతిపదికన మొత్తం శివసేన తనదే అని హక్కును చాటు కోవడానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సరి పోతుందా?

 ఏది నిజమైన శివసేన అనేదాన్ని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిర్ణయిస్తుంది. పార్టీ అధినేతగా ఠాకరేని తొలగించి పార్టీ స్టేటస్‌ని మార్చాల్సిందిగా శిందే వర్గం ఇప్పటికే ఈసీని కలిసింది. కానీ ఈ అంశంపై చట్టం చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాం గంలోని పదవ షెడ్యూల్‌ ఆర్టికల్‌ 191 (2)లో దీనికి సమాధానం కనబడుతుంది. ఫిరాయింపు దారులను ‘అనర్హుల’ను చేసే నిబంధనలు పదో షెడ్యూ ల్‌లో ఉన్నాయి.

వీటిని రాజ్యాంగ (52వ సవరణ) చట్టం, 1985లో పొందుపరిచారు. పార్టీనుంచి ఫిరాయిం చిన ప్రజాప్రతినిధిని అనర్హుడిని చేయాలని ఇది స్పష్టంగా పేర్కొంది. ఏ పార్టీ అయినా మరొక పార్టీలో విలీనం కావాలంటే పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆ విలీనానికి అను కూలతను ప్రదర్శించాలని రాజ్యాంగ (91వ సవరణ) చట్టం–2003 పేర్కొంది.  

పదవులిస్తామనో, ఇతర ఆశలు చూపో రాజ కీయ ఫిరాయింపులకు పాల్పడే దుష్టకార్యాలను నిరోధించడమే పదో షెడ్యూల్‌ లక్ష్యం. ఎందుకంటే ఫిరాయింపులు మన ప్రజాస్వామ్య పునాదులను ప్రమాదంలోకి నెడతాయి. అందుకే పార్లమెంటు ఉభయ సభలకు లేదా శాసన సభలకు చెందిన సభ్యుడిని అనర్హుడిని చేయడమే ఫిరాయింపులకు తగిన చికిత్స అని పదో షెడ్యూల్‌ నిర్దేశించింది.

పదో షెడ్యూల్‌ శాసనసభా పార్టీలో చీలికను గుర్తించ లేదు. దానికి బదులుగా అది విలీనాన్ని గుర్తిస్తోంది. కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే ఉద్ధవ్‌ ఠాకరే వర్గం ఇప్పుడు మైనారిటీలో ఉంటోంది కాబట్టి తమదే నిజమైన శివసేన అని చెప్పుకునే స్వతంత్ర హక్కు శివసేన రెబల్స్‌కు లేదు. అనర్హత నుంచి తప్పించుకోవా లంటే ఒక పార్టీలోని మూడింట రెండొంతుల సభ్యులు మరో పార్టీలో విలీనం కావలసి ఉంటుంది.

శివసేన రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్న వాస్తవం రెండు వర్గాలకూ తెలుసు. సేన రాజ్యాంగంలో పార్టీ పతాక, పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు వంటివాటి కోసం విడి విడిగా ఆర్టికల్స్‌ ఉన్నాయి. ముంబై దాదర్‌ లోని సేన భవన్‌ పార్టీ రిజిస్టర్డ్‌ ఆఫీసుగా ఉంది. ఇది సంస్థాగత చట్రాన్ని అందిస్తుంది. ఈ చట్రంలో శివసేన అధ్య క్షుడికి పార్టీలో కీలక స్థానం ఉంటుంది. సేన అధ్యక్షు డికి సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్రీయ కార్యకా రిణి సభ్యుల నుంచి ప్రతినిధి సభకు ఎన్నికైన సభ్యులు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 
శివసేన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పార్టీలో అత్యున్నత అధికారం ఉంటుంది. పార్టీ పాలసీ, యంత్రాంగానికి సంబంధించిన అన్ని విష యాల్లో అతడి నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 8 పేర్కొన్న ఏ పదవినైనా, నియామకాన్నయినా పార్టీ అధ్యక్షుడు నిలిపి వుంచ గలడు లేదా తొలగించగలడు. శివసేన శాసన సభా పక్షనేతకైనా ఇదే వర్తిస్తుంది.

మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధ్యక్షుడికి తప్ప మరే ఇతర పార్టీ ఆఫీస్‌ బేరర్‌కి గానీ, సభ్యుడికి గానీ ఎవరినీ పార్టీ నుంచి బహిష్కరించే అధికారం లేదు. ఆఫీసు బేరర్లు, ప్రజా సంఘాల పనులకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్రీయ కార్యకారిణికి ఉండగా, దాని సమావేశా లను నిర్ణయించే అధికారం పార్టీ అధ్యక్షు డికి ఉంటుంది. అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్‌.

కాబట్టి పార్టీ సభ్యులను, ఆఫీస్‌ బేరర్లను తొలగించే అధికారం పార్టీ రాజ్యాంగం ప్రకారం శివసేన అధ్యక్షుడిగా ఠాకరేకి ఉంటుంది. శిందేకు గానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలకుగానీ అలాంటి అధికారాలు ఉన్నాయని ప్రకటించుకునే అధికారం లేదు. తిరుగుబాటుదారులకు మూడింట రెండొం తుల మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడి అధి కారాలను తమవిగా వీరు ప్రకటించుకోలేరు. మహా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గానీ, సుప్రీంకోర్టుగానీ ఇలాంటి అధికారాలను రెబెల్స్‌కి ఇవ్వలేరు. 

ఎన్నికల కమిషన్‌ వద్ద అయినా, శిందే వర్గం శివసేనపై తన చట్టబద్ధతనూ, హక్కులనూ నిరూ పించుకోవడం కష్టమే. పార్టీ చిహ్నం, పార్టీ గుర్తుపై ఎలాంటి హక్కు ప్రక టించుకోవాలన్నా శివసేనలోని రెండు వర్గాలూ పార్టీ రాజ్యాంగంపైనే ఆధారపడాలి. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఠాకరేని తొలగిస్తే తప్ప, రెబల్స్‌ పార్టీపై ఎలాంటి హక్కునూ ప్రకటించు కోలేరు. పార్టీ చిహ్నం, పార్టీ ఎన్నికల గుర్తు వంటి వాటిపై అసోసియేట్‌ హక్కులను కూడా వీరు పొందలేరు.
వ్యాసకర్త: అభయ్‌ నెవగీ, సీనియర్‌ న్యాయవాది


(‘ది వైర్‌’ సౌజన్యంతో...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement