యూఎన్ ఛార్టర్ ప్రకారం సార్వభౌమత్వం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవు. అందుకే ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి పరిధి లోనిది. జీ20 అజెండాలో లేదు. కానీ పశ్చిమ దేశాలు దీన్ని చాలా దురుసుగా అజెండాలోకి చేర్చాయి. యూరప్ సమస్యలను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ సమస్యలుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రతిపాదించిన అజెండా అమలు చేయడం ద్వారా మాత్రమే భిన్నధ్రువ దౌత్యం విషయంలో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలు కాకుండా ఉంటుంది.
అంతర్జాతీయ అధికార పీఠాలిప్పుడు కదు లుతున్నాయి. నిన్నమొన్నటివరకూ కొందరికి అనుకూలంగా ఉన్న ప్రపంచం కాస్తా భిన్న ధ్రువమవుతోంది. అధికార మిప్పుడు అన్ని దిక్కులా విస్తరిస్తోంది. మునుపటితో పోలిస్తే ప్రపంచ వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల మాటలిప్పుడు ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నాయి. అయితే ఈ మార్పులను జీర్ణించుకునే పరి స్థితుల్లో పశ్చిమ దేశాల్లేవు. దేశాల సర్వసమానత్వం ఆధారంగా ప్రస్తు తమున్న అధికార వ్యవస్థ వీరికిప్పుడు అకస్మాత్తుగా చేదవుతోంది.
యూఎన్ ఛార్టర్ ప్రకారం సార్వభౌమత్వం అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు అవి సిద్ధంగా లేవు. అందుకే ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లో ప్రత్యక్షంగా కలుగచేసుకోవడం, పరోక్ష పద్ధతుల్లో యుద్ధం చేయడం... తమను ధిక్కరించే వారిపై పశ్చిమ దేశాలు చేసే ప్రయత్నాలన్నది తెలిసిన విషయమే. నిర్మాణాత్మక సహకారం కంటే పోటీతత్వానికి ఎక్కువ ఆదరణ ఉన్న సమయమిది. ఇంధన, ఆహార రంగాలు అస్థిరంగా ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. వాతావరణ మార్పులు, అధిక ద్రవ్యోల్బణం లాంటి మానవీయ సంక్షోభాలిప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలన్నీ అందరికీ ప్రయోజనకరమైన అంశాలపై, ఒప్పందాల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
ఎనభై శాతం జీడీపీ జీ20 దేశాల్లోనే..
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాల్లో సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. ఈ ఇరవై దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపుగా 80 శాతం వరకూ ఉండటం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్యం, కర్బన ఉద్గారాలూ ఎక్కువే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభా ఈ జీ20 దేశాల్లోనే ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాల పరిష్కారానికి తగిన సామర్థ్యమూ కలిగి ఉందీ వేదిక. ప్రపంచం మాంద్యం ముంగిట్లో నిలిచిన ఈ తరుణంలో జీ20 మరింత ఆలస్యం చేయడం ఏమాత్రం తగదు. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రతిపాదించిన అజెండా అమలు చేయడం ద్వారా మాత్రమే భిన్నధ్రువ దౌత్యం విషయంలో నమ్మకం పెరుగుతుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలు కాకుండా ఉంటుంది. పారిశ్రామిక వృద్ధి మళ్లీ పట్టాలు ఎక్కుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఎదుగుతున్న మార్కెట్లతోనూ భారత్‌కు సత్సంబంధాలున్నాయి. కాబట్టి భారత్ ప్రతిపాదించిన అజెండాతో లక్ష్యాల సాధన కష్టమేమీ కాబోదు. భారత్ ప్రాథమ్యాలతో రష్యా పూర్తిగా ఏకీభవిస్తోంది. ఎంచుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల అనూహ్యమైన సాంఘిక, ఆర్థిక సమస్యలు, ప్రపంచస్థాయి సవాళ్లను సమర్థంగా ఎదుర్కో వచ్చునని రష్యా కూడా భావిస్తోంది. మార్చి 1, 2 తేదీల్లో జరిగిన జీ20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సమావేశాలు ఐక్యరాజ్యసమితి పాత్రతోపాటు బహుముఖ ప్రపంచ ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేశాయి. అజెండాలో కీలకమైన అంశాలను జొప్పించేందుకు భారత్ అనుసరించిన నిర్మాణాత్మక విధానం, సమతౌల్యతలను ప్రశంసించి తీరాలి.
ఐక్యరాజ్యసమితి అంశం జీ20లోనా?
నిజానికి ఉక్రెయిన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి పరిధి లోనిది. జీ20 అజెండాలో లేదు. కానీ పశ్చిమ దేశాలు దీన్ని చాలా దురుసుగా అజెండాలోకి చేర్చాయి. రష్యాని తెగనాడటంపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడిందేమో అన్నంత హడావుడి చేశాయి. వ్యూహాత్మకంగా రష్యా ఓటమిని చూడాలని పాశ్చాత్య దేశాలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యూరప్ సమస్యలను ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ సమస్యలుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
రష్యాతో సహా యూరప్ దేశాలు ఇప్పటికే విదేశీ బాణీలకు నృత్యం చేస్తూ వస్తున్నాయి. అయితే ఇది భద్రతకు సంబంధించిన అంశం. ‘నాటు నాటు’ డ్యాన్స్ కాదు. ఈ విషయంలో ప్రధాన ముద్దాయి కచ్చితంగా అమెరికా. దీని లక్ష్యం ఒక్కటే. తనను ఎవరూ ప్రశ్నించరాదు! రష్యాను అణచివేసేందుకు ఉక్రెయిన్‌ను ఒక పనిముట్టుగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రపంచం మొత్తం పరోక్షంగా తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్నది అమెరికా లక్ష్యం. 2009 సెప్టెంబరులో జీ20 వేదిక లక్ష్యాల్లో అంతర్జాతీయ ఆర్థిక సహకారం ఒకటని తీర్మానించారు. ఇందుకు తగ్గట్టుగా జీ20 తన దృష్టిని ప్రపంచ ఆర్థిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించాలి. ఉక్రెయి¯Œ వంటి అంశాలను చేర్చడం వల్ల జీ20 లక్ష్యం విఫలమ వుతుంది. రష్యా దీన్ని కోరుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో ఈ అంశాలన్నింటిపై చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగానే ఉంది. జీ20 అజెండా మాత్రం హైజాక్ కారాదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత్ లేవనెత్తిన ఉగ్రవాదం, మత్తుమందులు, ప్రకృతి వైపరీత్యాల విషయం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఉగ్రవాదం పెరుగుదలకు సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కారణమని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధికులు అంగీకరిస్తారు. ఇందుకు ఒకప్పటి యుగోస్లేవియాతోపాటు లిబియా, ఇరాక్, సిరియా, అఫ్గాని స్తాన్‌లే ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దేశాల్లో ‘నాటో’ వ్యవహారాలు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అది అటు పసఫిక్‌లో, ఇటు ఆసియాలో తూర్పుదిక్కుగా మరింతగా విస్తరించాలని అనుకుంటోంది. ఈ పరిణామం మరిన్ని ఘర్షణలకు దారితీస్తుంది. యూరప్ దేశాల్లో మాదిరిగా విభజనకు దారితీస్తుంది. నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్‌ను అనూహ్యంగా ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి అసలు దోషులెవరన్నది ఎప్పటికైనా కచ్చితంగా తేలుతుంది. ఇరాక్‌లో నాటో చేసిన ఇతర ‘మంచి పనుల’ విషయం కూడా!
అన్యాయమైన ఆంక్షలు, దేశాల మధ్య సరుకుల రవాణాను కృత్రిమంగా పాడు చేయడం వంటివి ఉక్రెయి¯Œ సమస్యకు మూల కారణాలు... తనను తాను రక్షించుకోవాలనుకుంటున్న రష్యా కాదు. ఈ విషయంపై ప్రజల్లో అపోహలు ఉన్న నేపథ్యంలో ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి. ఉక్రెయి¯Œ పై సైనిక దాడి చేయాలన్నది రష్యా ముందున్న అవకాశాల్లో ఒకటి కానేకాదు. రష్యా సార్వభౌమత్వానికి నేరుగా ముప్పు ఏర్పడటం, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి చర్యలకు ప్రతిగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఆర్థిక సంబంధాలు ఆయుధాలుగా మారిపోయాయి.
ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ ఆహార రంగం గతి తప్పి ధరలు పెరిగాయి. రష్యాతోపాటు ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. నెపం మొత్తం రష్యాపై నెట్టాలన్నది నిలబడేది కాదు. జీ20 అజెండా అమలు కావాలనుకుంటే దాన్ని తిరస్కరించాలి కూడా. జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు రష్యా కట్టుబడి ఉంది. మంత్రుల స్థాయి సమావేశాలన్నింటిలో చురుకుగా పాల్గొంటోంది. లక్ష్యాల సాధనలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు, తగిన ఫలితాలు రాబట్టేందుకు తగినంత వెసులుబాటుతో వ్యహరించేందుకు సిద్ధంగా ఉన్నాం. దక్షిణాది దేశాలు ఎదుర్కోగల సమస్యల పరిష్కారం కంటే తమ వ్యూహాత్మక అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వారు నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం కూడా ఇదే!
డెన్నిస్ అలిపోవ్
వ్యాసకర్త భారత్‌లో రష్యా రాయబారి
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment