సమాజానికి ఏదో చేయాలనే ఆకాంక్ష, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడాలనే కృత నిశ్చయం, సమస్యలపై ధైర్యంగా పోరాడే తత్వం, అన్నింటినీ మించి మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం... ఇవన్నీ కలగలిసిన జన నాయకుడు ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు మిషనరీ ఆసుపత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి, పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టి, రూపాయి ఫీజుకే వైద్యం అందించారు. 28 ఏళ్ల పిన్న వయసులోనే శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లుగా ఎంపీగా గెలిచారు.
ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలిసిన సంస్కారవంతుడు వైఎస్. ఆయన దగ్గరకు వెళ్లిన ఏ ఒక్కరూ ఎన్నడూ అసంతృప్తికి లోను కాలేదు. 2009 ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అని బహిరంగంగా, బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రకటించిన నిఖార్సయిన నాయకుడు. ఓటమి లేకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. తన హయాంలో సుమారు 10 వేల మంది పేద పిల్లలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారు. ‘‘మీ పిల్లలకు పునర్జన్మనిచ్చే అవకాశం నాకు, నా ప్రభుత్వానికి కల్పించారు. నా జీవితం ధన్యమైంది’’ అని వినయంగా ప్రకటించారు.
2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి కుటుంబాన్ని కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తున్నట్లుగానే, అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ కూడా ఠంచనుగా అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుం బాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్. లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం ఒక సరికొత్త ప్రయోగం. ‘‘మేం 20 రాష్ట్రాల్లో పర్యటించాం. ఇలాంటి పథకం ఎక్కడా చూడలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా పలు సంక్షేమ పథకాలతో ఈబీసీలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించడం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది’’ అని నాటి ఈబీసీ కమిషన్ ఛైర్మన్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించారు. దానికి వైఎస్ స్పందిస్తూ.. ‘అది మా ప్రభుత్వ బాధ్యత’ అని వినమ్రంగా సమాధానమిచ్చారు.
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా వైఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో సీఎంగా ఉన్న వైఎస్.. బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 11గంటలు. గిరిజన గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం, కాన్సెప్ట్ స్కూళ్లపై వైఎస్ తో మాట్లాడారు. గిరిజన, పేద విద్యార్థులకు సరైన విద్య అందితే అద్భుతాలు సృష్టిస్తారని.. దేశ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తారని కలాం చెప్పారు. గిరిజన గురుకులాలు, ఆంగ్ల మాధ్యమంలో బోధన వంటి అంశాలను చేపట్టడంలో మీరు దేశానికే రోల్ మోడల్ అని ప్రశంసించారు. అప్పుడు వైఎస్.. ‘మీ ఆశీర్వాదాలు కావాలి సర్’ అంటే.. ఆయన ‘గాడ్ బ్లెస్ యు రాజశేఖర్’ అని దీవించారు.
డాక్టర్ వైఎస్సార్‌కు రైతులంటే ఎనలేని అభిమానం. రైతులను నిర్లక్ష్యం చేస్తే కన్నతల్లిని నిర్లక్ష్యం చేసినట్లేనని చెప్పేవారు. రైతులకు నీళ్లిస్తే వారు ఎవరి మీదా ఆధారపడరని, రైతు బాగుం టేనే దేశం బాగుంటుందని స్పష్టం చేసేవారు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగునీరందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందం చూడడమే తన ఆకాంక్ష అన్నారు. జలయజ్ణం పేరిట రాష్ట్ర సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి వసతి కల్పించారు.
వైఎస్ పాలించిన ఐదేళ్లూ రాష్ట్రంలో వర్షాలకు లోటు లేదు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రమంతటా జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. ‘వాన దేవుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆశీర్వదించాడు’ అని వైఎస్ తరచూ చెప్పేవారు. దాదాపు 200 లక్షల టన్నుల ధాన్యం దిగుబడితో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఆవిర్భవించింది. ‘‘అధికారంలోకి వచ్చి, నేను సీఎం అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించలేని నాడు నేను ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా కొనసాగను’’ అని ఢిల్లీ పెద్దలకు తేల్చిచెప్పిన ధీశాలి వైఎస్సార్. 2004లో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేశారు. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అంతకముందు సచివాలయంలో జరిగిన చర్చలో కొందరు ఆర్థిక భారం అన్నారు. ‘‘పారిశ్రామికవేత్తలకు కోరినన్ని రాయితీలు ఇస్తారు. పేదవాడికి అన్నం పెట్టడానికి మనకు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తాయా? ఇదేం పద్ధతయ్యా? ఇంతవరకు నేను ప్రారంభించిన పథకం ఏదైనా ఆగిపోయిందా? లేదు కదా?’’ అని వైఎస్ స్పష్టం చేశారు. పావలా వడ్డీ, అభయహస్తం, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి ప్రతి పథకాన్ని గొప్పగా అమలు చేశారు. ప్రతి పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు.
బీహెచ్‌ఈఎల్ ప్రాజెక్టును ఒక కేంద్రమంత్రి 2009లో రాజ స్తాన్ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ‘‘దేశంలో మళ్లీ యూపీఏ అధికారంలోకి రావడానికి ఏపీనే కారణం. 30కి పైగా ఎంపీ సీట్లు ఇచ్చాం. ఈ ప్రాజెక్టు గనుక రాజస్తాన్ తీసుకెళ్తే నేను ఢిల్లీలో అడుగుపెట్టను. ఇది నా మాటగా ప్రధానికి చెప్పండి’’ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్‌కు చెప్పగా ‘‘రాజశేఖర్ చెప్పింది అక్షరాలా నిజం. మన్నవరం ప్రాజెక్టును ఏపీకే ఇద్దాం. నేనే శంకుస్థాపన చేయడానికి వెళ్తా. ఈ విషయాన్ని ఆయనకు చెప్పండి’’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో హాలీవుడ్ నటుడు, నాటి కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్ ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీరు ఇంత ఫిట్‌గా ఉన్నారు. 9 కోట్ల జనాభా గల ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని ఒత్తిడిలో ఉండే మీకు ఇది ఎలా సాధ్యం?’ అని అడిగారు. ‘పాజిటివ్ థింకింగ్’ అని వైఎస్ చిరునవ్వుతో బదులిచ్చారు.
ఎ. చంద్రశేఖర్ రెడ్డి
వ్యాసకర్త వైఎస్ మాజీ మీడియా కార్యదర్శి
అన్నం పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులా?
Published Thu, Jul 8 2021 1:56 AM | Last Updated on Thu, Jul 8 2021 3:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment