చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్‌... | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్‌...

Published Thu, Jul 6 2023 7:32 AM | Last Updated on Thu, Jul 6 2023 7:50 AM

- - Sakshi

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీ జాతీయ అధ్యక్షుడి ఇంటి పేరు (నారా)తో ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తే రాజకీయంగా అన్నివిధాలా కలిసొస్తుందని ‘భాష్యం’ వేసిన భారీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. విరాళాల పేరిట పార్టీకి, సేవ అంటూ ప్రజలకు డబ్బులు విరజిమ్మితే మేలు జరుగుతుందనుకుంటే అది కాస్తా తిరగబడింది. కాదు... కాదు... ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్‌ నాయకులు ఆ మేరకు చేయగలిగారు.

తమకు రాజకీయంగా పొగ పెడుతున్నారనే అంచనాకు వచ్చిన సీనియర్లు అందుకు తగ్గట్టే వ్యూహాత్మకంగా పావులు కదిపి అధిష్టానం ఆదేశం పేరిట పరోక్షంగా మొన్న ఉయ్యూరి శ్రీనివాస్‌కు, నేడు భాష్యం ప్రవీణ్‌కు చెక్‌ పెట్టారు. గుంటూరు సీనియర్ల రాజకీయ ఎత్తుగడలకు నారా చంద్రబాబునాయుడు, లోక్‌ష్‌లకు షాక్‌ తగిలినట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండ్రీకొడుకులు తలచిందొకటి కాగా పరిణామాలు తద్భిన్నంగా ఉన్నాయని, దీన్నిబట్టి చంద్రబాబు, లోకేష్‌లు తలపట్టుకోక తప్పదని పార్టీలోని పలువురు సీనియర్లు వాఖ్యానిస్తుండటం పరిశీలనాంశం.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ చాలాకాలంగా గుంభనంగా ఉంటోంది. కార్యక్రమాలు నిరాసక్తంగా సాగుతున్నాయి. గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌ అసలు కనిపించడంలేదనేది తెలిసిందే. ఇతర సీనియర్ల పనితీరు నిరాశాజనకమని పలుదఫాలు చంద్రబాబు సీరియస్‌ అయిన సందర్భాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లోనే కొత్తవారిని ప్రోత్సహిస్తూ సీనియర్లకు చెక్‌ పెడుతున్నట్లు సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఆర్థికంగా స్థితిమంతుల్ని గుర్తించి సేవా కార్యక్రమాల పేరిట వారిని తొలుత ప్రోత్సహించడం ఆ తరువాత రాజకీయంగా వినియోగించుకోవడం బాబుకు ఆనవాయితీ అని ఆ పార్టీ నేతలే గుర్తుచేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే ఉయ్యూరి శ్రీనివాస్‌ అనే ఎన్‌ఆర్‌ఐని గుంటూరులో సేవా కార్యక్రమాల పేరిట ఉసిగొల్పారు. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు పాల్గొన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడం, ముగ్గురు పేదలు మృతిచెందడం తెలిసిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ ఆశిస్తున్న సీనియర్లు పలువురు ఆ కార్యక్రమం సందర్భంగా ఎలా వ్యవహరించారో తెలిసిందే.

కారణాలేమైనా ఉయ్యూరి శ్రీనివాస్‌ ఆ తరువాత దాదాపు కనిపించడంలేదు. లోకేష్‌ మాట ఇచ్చారని, బాబు ఆశీస్సులు తనకే ఉన్నాయనే ధీమాతో భాష్యం ప్రవీణ్‌ చిలకలూరిపేట స్థానాన్ని ఆశిస్తూ సేవా కార్యక్రమాలను కొన్ని నెలలుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ భారీఎత్తున విరాళం ఇవ్వడం, ఒంగోలులో మహానాడు జరిగినప్పుడు యడ్లపాడు మండల పరిధిలో పెద్దఎత్తున భోజన సదుపాయాలు ఏర్పాటుచేయడం, శిబిరాలు ఏర్పాటు, పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. తన టికెట్‌కే ఎసరు పెడుతున్నారని కంగారుపడిన మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు తనదైన శైలిలో పావులు కదిపారు.

నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి ద్వారా భాష్యం ఫౌండేషన్‌ పేరిట కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, తద్వారా పార్టీశ్రేణులకు, ప్రజలకు విభిన్న సంకేతాలు వెళుతున్నాయని చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్‌ల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారనేది సమాచారం. దీంతో రంజాన్‌ తోఫా ఆగిపోయింది. తన పేరిట కాకుండా ‘నారా ఫౌండేషన్‌’తో కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి అడ్డు ఉండదని భాష్యం ప్రవీణ్‌ వేసిన ఎత్తుగడను సీనియర్లు దెబ్బతీశారు.

సీనియర్లు కూడబలుక్కునే చేశారా?
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో నారా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు బుధవారం అధికారికంగా ప్రకటన జారీచేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సంస్థ నిర్వహించే కార్యకలాపాలలో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించారు. ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇదిలాఉండగా, ఫేక్‌ లెటర్ల గురించి కలత చెందవద్దని నారా ఫౌండేషన్‌ పేరిట బుధవారం పొద్దుపోయాక చిలకలూరిపేటలో ఫ్లెక్సీలు వెలవటం కొసమెరుపు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలువురు సీనియర్లకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అందుకు తగ్గట్లే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లోకేష్‌ ఆశీస్సులతో అంటూ పలువురు రంగంలోకి వస్తున్నారనేది గుర్తించిన సీనియర్లు కూడబలుక్కున్నారనేది విశ్వసనీయ సమాచారం. తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో మౌనం మొత్తానికే చేటు తెస్తుందనేది వారి అవగాహనగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీచేస్తే తెనాలి టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఇప్పటికే అవగతమైనట్లు ఉంది. టికెట్‌ ఎలాగైనా సాధించుకోవాలని పోటీలుపడి సత్తెనపల్లిలో కార్యక్రమాలు కొనసాగించిన కోడెల శివరాం, వై.వి.ఆంజనేయులు, శివనాగమల్లేశ్వరరావులకు చంద్రబాబు జెల్ల కొట్టారు.

తనను అత్యంత పరుషపదజాలంతో దూషించిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలను బాబు అప్పగించారు. ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన రాయపాటికి, ఆయన కుటుంబానికి ఎలాంటి హామీ లేకపోగా, పెదకూరపాడు, గురజాల, వినుకొండ, తాడికొండ, గుంటూరు వెస్ట్‌ తదితర నియోజకవర్గాల నుంచి కొత్తకొత్త పేర్లు వినిపిస్తుండటంతో సీనియర్లలో కంగారు మొదలైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ‘జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా సీనియర్‌ అయిన పత్తిపాటి పుల్లారావుకే టికెట్‌పై అనుమానం వస్తున్నప్పుడు రేపు మాకై నా అదే పరిస్థితి దాపురించదనే గ్యారంటీ ఏముంది’.

అందుకే అధినేతకు మా ఉద్ధేశమేంటో తెలియజెప్పాలనుకున్నాం. లోకేష్‌కు చెక్‌ పెట్టాలని కూడబలుక్కున్నాం అని సీనియర్‌ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ‘మా వద్ద డబ్బులున్నాయి. సేవల పేరిట ఖర్చుపెట్టేస్తాం. టిక్కెట్‌ తెచ్చేసుకుంటాం... అంటుంటే మేం సీనియర్లుగా చూస్తూ ఉండిపోవాలా? అందుకే అధికారికంగా ‘నారా ఫౌండేషన్‌’ కార్యక్రమాలకు చెక్‌ పెట్టించాం’ అని మరో నాయకుడు అభిప్రాయపడటం గుంటూరు టీడీపీలోని తాజా రాజకీయాలకు అద్దం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement