వివక్షపై న్యాయ విద్యార్థుల ఆవేదన
● ఏఎన్‌యూలో విభాగాధిపతి మార్పునకు డిమాండ్ ● లేదంటే తమకు టీసీలిచ్చి పంపించాలని వేడుకోలు ● ఆందోళనకు దిగిన విద్యార్థులతో రిజిస్ట్రార్ చర్చలు ● సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ
పెదకాకాని: వివక్షతో న్యాయ శాస్త్రం విభాగాధిపతి, కొందరు ఆచార్యులు తమను మొదటి ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఎల్‌ఎల్‌ఎం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం న్యాయ శాస్త్ర విభాగానికి వెళ్లి విద్యార్థులతో, ఆచార్యులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాజరు సరిపోలేదని కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులను విభాగాధిపతి పరీక్షలకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకంటే తక్కువ రోజులు క్లాసులకు వచ్చిన వారిని పరీక్షలకు అనుమతించారని, ఇదేంటని ప్రశ్నించారు. వివక్ష రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభాగాధిపతి, కొందరు ఆచార్యుల వేధింపులు తట్టుకోలేక పలువురు విద్యార్థులు టీసీలు సైతం తీసుకొని అర్ధాంతరంగా వెళ్లిపోయారని తెలిపారు. ఈ వైఖరి సరికాదని, దీనిపై విచారణ జరపాలని కోరారు. గత సంవత్సరం కూడా హాజరు సరిపోలేదని 11 మంది విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదని, వారిలో ఎక్కువ శాతం అణగారిన సామాజిక వర్గాల వారే ఉన్నారని గుర్తుచేశారు. దీనిని వర్సిటీ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విభాగంలో ఓ ఆచార్యుడు సుదీర్ఘకాలం సెలవు పెట్టి తరగతులకు రాకపోయినా హాజరైనట్లు చూపించారని, అతడే కొందరు విద్యార్థులకు హాజరు లేకపోయినా పరీక్షలు అనుమతించారని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు వివక్షతోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. మరికొందరు విద్యార్థులు మాట్లాడుతూ కిషోర్ అనే ఆచార్యుడు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అని, ఎంతో ప్రతిభ కలిగిన ఆయన అర్ధాంతరంగా సెలవు పెట్టి వెళ్లిపోవటం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, దీని వెనక కొన్ని వర్గాల కుట్ర ఉందని ఆరోపించారు. అన్ని విషయాలు విన్న రిజిస్ట్రార్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు వివాదాలకు దిగవద్దని ఆదేశించారు. కొందరు అతిథి ఆచార్యులు మాట్లాడుతూ తమ విషయంలో కూడా విభాగాధిపతి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమను అవమానకరంగా చూస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. తరగతులకు నిత్యం హాజరుగాని ఓ వర్గం విద్యార్థికి హాజరు వేసి ప్రథమ ఇంటర్నల్ పరీక్ష రాయించిన ఓ అతిథి ఆచార్యుడు వివాదాన్ని ముందుగానే ఊహించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment