పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Published Sun, Feb 16 2025 1:27 AM | Last Updated on Sun, Feb 16 2025 1:25 AM

పరిసర

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ వడ్డే శంకర్‌

చేబ్రోలు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎటువంటి కాలుష్యం లేని ఆహారం, గాలి, మంచి నీటిని అందించగలుగుతామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ వడ్డే శంకర్‌ అన్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. వేజెండ్ల గ్రామంలోని హౌసింగ్‌ లేఅవుట్‌ –1 లో జరిగిన కార్యక్రమంలో సోక్‌ పిట్‌ కొలతలు, నిర్మాణ పనివిధానాన్ని వడ్డే శంకర్‌ పరిశీలించి అవగాహన కల్పించారు. గ్రామంలో మంజూరైన 62 సోక్‌ పిట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బందికి, మండల, గ్రామ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. చెత్తబుట్టలపై ఎంపీడీఓ ఎ. ఉమాదేవి అవగాహన కల్పించారు. ఈవోపీఆర్డీ టి.ఉషారాణి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాలరావు, ఓబుల్‌ రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

వృద్ధురాలిపై లైంగికదాడి, హత్య కేసులో

నిందితులు అరెస్ట్‌

కాకుమాను: ఇటీవల పెదనందిపాడు శివారులోని పూరి గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలిపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పెదనందిపాడు పోలీసు స్టేషన్‌లో శనివారం సీఐ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన పెదనందిపాడు శివారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో పూరి గుడిసెలో నివశిస్తున్న వృద్ధురాలు(64)పై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థులైన పాలపర్తి మంజు, పాలపర్తి సాంబ అనే ఇద్దరు యువకులు లైంగికదాడి చేసి హత్య చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిందితుల కోసం పేరేచర్ల, అనకాపల్లి, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈక్రమంలో శుక్రవారం పెదనందిపాడు పరిసర ప్రాంతాల్లో నిందితులు ఉన్నారనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు. పెదనందిపాడు ఎస్‌ఐ మధు పవన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

యువకుడిపై దాడి.. హత్యాయత్నం

● తీవ్రంగా కొట్టి, రైలు పట్టాలపై పడేసేందుకు తీసుకెళుతున్న నిందితులు

● అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని అడ్డుకున్న రాత్రి గస్తీ పోలీసులు

తెనాలిరూరల్‌: యువకుడిపై దాడి చేయడమే కాకుండా రైలు పట్టాలపై పడేసి హతమార్చేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. యువకుడిని కారులో తీసుకెళుతుండగా వారి వాహనాన్ని పోలీసులు ఆపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి... పట్టణంలోని నందులపేటకు చెందిన యువకుడు మణి హైదరాబాద్‌లో వ్యభిచార గృహం నడిపేవాడు. అక్కడి పోలీసులకు విషయం తెలిసి దాడులు నిర్వహించగా తెనాలికి తిరిగి వచ్చేశాడు. హైదరాబాద్‌లో ఇతని వద్ద కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన సతీష్‌ పని చేశాడు. కొన్ని నెలల జీతం బకాయి ఉంది. తరచూ మణికి ఫోన్‌ చేసి బకాయి గురించి అడుగుతుండడంతో సతీష్‌ను శుక్రవారం సాయంత్రం విజయవాడకు రమ్మని చెప్పాడు. తన ఇద్దరు స్నేహితులతో కలసి కారులో విజయవాడ వెళ్లిన మణి, సతీష్‌ను కారులో ఎక్కించుకుని దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. అదే కారులో రాత్రికి తెనాలికి తీసుకువచ్చి ఇక్కడి సుల్తానాబాద్‌లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మరోసారి తీవ్రంగా దాడి చేశారు. రైలు పట్టాలపై పడేసి చంపేస్తామని చెప్పి అర్ధరాత్రి దాటాక కారులో తీసుకెళుతుండగా రాత్రి గస్తీ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాన్ని నిలిపి ప్రశ్నించడంతో విషయం తెలుసుకుని బాధితుడు సతీష్‌ను వైద్యశాలకు పంపి చికిత్స అందించారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత 1
1/1

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement