అవినీతి శుద్ధిపూసలు
తెనాలిఅర్బన్: తెనాలి పురపాలక సంఘంలోని ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గైర్హాజరైన పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు అటెండెన్స్ వేసి వారి నుంచి నెలకు కొంత నగదు లంచంగా తీసుకుంటున్నారు. ఫలితంగా తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తెనాలి పట్టణ జనాభా సుమారు రెండు లక్షలు. 40 వార్డులు ఉన్నాయి. వీటిని తొమ్మిది పారిశుద్ధ్య డివిజన్లుగా అధికారులు విభజించారు. వీటిలో రెండు డివిజన్లలో ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తుండగా, మిగిలిన ఏడు డివిజన్లలో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. రోజూ పట్టణంలో 80 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది.
అటెండెన్స్ వేయించుకుని ఇళ్లకు..
తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణను నలుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు, నలుగురు హెల్త్ అసిస్టెంట్లు పర్యవేక్షిస్తారు. 82 మంది పర్మినెంట్, 320 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు, 40 మంది నగర దీపికలు పారిశుద్ధ్య పనులు చేస్తారు. శానిటరీ డివిజన్ కార్యాలయానికి ఉదయం 5 గంటలకు కార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వచ్చి అటెండెన్స్ వేయించుకున్న తర్వాత కేటాయించిన ప్రాంతాలకు వెళ్తారు. పట్టణంలో మొత్తం 402 మంది కార్మికులు ఉంటే రోజూ పనికి వచ్చేది మాత్రం 350 మందే. ఉదయం అటెండెన్స్ కాగానే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోతారు.
రోజుకు రూ.వెయ్యి వసూలు
పర్మినెంట్ వర్కర్లలో సగం మంది రోజూ పనికి రారు. వీరికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అటెండెన్స్ వేసి రోజుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తారనే ఆరోపణ ఉంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్హాజరైతే వారి నుంచి రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తారని సమాచారం. మున్సిపల్ కమిషనర్ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసి అటెండెన్స్‌లో తేడాలు గమనించారు. ఇన్‌స్పెక్టర్లను మందలించారు. బదిలీ వర్కర్ల(కార్మికుడు తన స్థానంలో మరొకరితో పని చేయించడం) పద్ధతీ పట్టణంలో పరిపాటిగా మారింది.
మామూళ్లు మామూలే
శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వీధి దుకాణదారుల వద్ద, కబేళా వద్ద మాంసం విక్రేతల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
గ్యాంగ్ వర్కులోనూ దోపిడేనే...
తెనాలిలో ఏదోఒక ప్రాంతంలో రోజూ గ్యాంగ్ వర్కు జరుగుతుంటుంది. సగటున 30 నుంచి 40 మందితో మురుగు కాలువలు బాగు చేయిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ముప్పావు మందీ పని చేయరు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తవించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికై న ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే హెల్త్ సెక్షన్‌ను ప్రక్షాళన చేయాలి.
తెనాలి మున్సిపల్ హెల్త్ విభాగంలో అక్రమాలు
అరకొర సిబ్బందితోనే పారిశుద్ధ్య పనులు 402 మందికి పనిచేసేది 350 మందిలోపే విధులకు రాకుండానే కార్మికులకు హాజరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ల చేతివాటం
ప్రక్షాళన చేస్తున్నాం
హెల్త్ సెక్షన్‌లో లోపాలున్న మాట వాస్తవం. ఇప్పటికే అధికారులు, సిబ్బందితో సమీక్షలు జరిపి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించాం. కొద్ది రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపడతాం.
–బండి శేషన్న, కమిషనర్, తెనాలి పురపాలక సంఘం
అవినీతి శుద్ధిపూసలు
Comments
Please login to add a commentAdd a comment