భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బబ్బేపల్లి కొండపై
మంటల కలకలం
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి కొండపై గురువారం రాత్రి మంటలు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండపై నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు మంటల సమీపం లోకి వెళ్లి పరిశీలించారు. గొర్రెలు లేదా పశువుల కాపర్లు పొరపాటున విసిరిన సిగరెట్ లేదా బీడీలు మంటలకు కారణమై ఉండవచ్చని మొదట భావించారు. కానీ ఒకేసారి నాలుగైదు వైపుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసి ఎవరైనా కావాలని చేశారా.. అనే అనుమానం గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్‌ను వివరణ కోరగా.. మంటలకు కారణం పొరపాటా లేక ఎవరైనా కావాలని చేశారా.. అనే విషయం శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి చెబుతామన్నారు.
మూడు పూరిళ్లు దగ్ధం
రూ.11లక్షల ఆస్తి నష్టం
నిజాంపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని నక్షత్రనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని మోపిదేవి శివనాగరాజు గృహంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు పూరిళ్లకు మంటలు వ్యాపించి మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సంఘటనా స్థలానికి రేపల్లె అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.11లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఐదు హాస్పిటళ్లకు
జరిమానాలు
నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన 77 ఫిర్యాదులపై కమిటీ సభ్యులు విచారించారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్యసేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రవి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment