ప్రకృతి సాగుకు ఫ్రాన్స్ బృందం ప్రశంసలు
గుంటూరు రూరల్: ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేసిన పెరటి తోటలను పరిశీలించడానికి ఫ్రాన్స్ బృందం సోమవారం కొల్లిపర మండలంలోని అత్తోట, దావులూరు పాలెం గ్రామాలను సందర్శించింది. రైతు సాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఏపీసీఎన్‌ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ఆధ్వర్వంలో ఈ తోటలు సాగు అవుతున్నాయి. ముందుగా గుంటూరులోని కృషి భవనంలో ఏపీసీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) కే రాజకుమారితో ఫ్రాన్స్ బృందం సభ్యులు సమావేశమయ్యారు. డీపీఎం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం బృంద సభ్యులు అత్తోట, దావులూరిపాలెం గ్రామాలలో 365 రోజుల కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, ఏ గ్రేడ్, ఏటీఎం, సూర్య మండలంలోని పలు మోడల్స్‌ను పరిశీలించారు. బీజామృతం, ఘన జీవామృతం తయారీ తెలుసుకున్నారు. అభ్యుదయ గ్రామ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నారని బృందం ప్రశంసించింది. కార్యక్రమంలో నాగలక్ష్మి, ఎంటీఎల్ మాధవి, ఎంటీ పాండురంగారావు, ఎన్‌ఎఫ్‌ఎఫ్ రజిని, అవినాష్, ఆర్‌వైఎస్‌ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment