దాతపై పచ్చ నేతల దౌర్జన్యం
నాదెండ్ల: సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణానికి స్థలమిచ్చిన దాతను కూటమి నేతలు తీవ్ర వేధింపులకు గురిచేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన 75 ఏళ్ల పచ్చవ కోటేశ్వరరావు రెండు పర్యాయాలు గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 2020 ఆగస్టు 28న పచ్చవ వెంకటేశ్వర్లు కుమారుడు అనిల్‌కుమార్ వద్ద 20 సెంట్లు కొనుగోలు చేశారు. ఈ స్థలంలో 10 సెంట్లు సచివాలయ నిర్మాణానికి, 5 సెంట్లు రైతు భరోసా కేంద్రానికి దానపత్రం రాసి రిజిస్టర్ జరిపింపారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి భార్గవ్‌కు దస్తావేజులను అందించారు. 20 సెంట్లలో 15 సెంట్లు దానమివ్వగా మిగిలిన 5 సెంట్లలో సెంటున్నరను రైతు భరోసా కేంద్రానికి దారి నిమిత్తం వదిలిపెట్టారు. రెండు రోజుల క్రితం ఆ మూడున్నర సెంట్లలో తన గేదెలకు షెడ్డు వేసేందుకు గుంతలు తీయించారు. ఇక్కడ ఆయనకు స్థలం లేదని గ్రామ టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. షెడ్డు కోసం తీసిన గుంతలను పూడ్చివేయటమే కాక ఇదేమని అడిగినందుకు కోటేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. దీంతో కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. ఇంతటితో వదలక కోటేశ్వరరావుపై నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ నిమిత్తం గత రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుండి రాత్రి వరకూ అక్కడే ఉంచుతున్నారు. గ్రామంలోకి వెళ్తే గొడవ అవుతుందని, టీడీపీ నాయకులు ఒప్పుకోవటం లేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీనిపై బాధిత మాజీ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గతంలో సచివాలయం, ఆర్‌బీకే భవనాలపై దాతలు పచ్చవ కోటేశ్వరరావు, పెద్దబ్రహ్మమ్మ దంపతుల పేరిట శిలాఫలకాలు ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ నిర్మాణానికి రూ.40 లక్షలు, ఆర్‌బీకే నిర్మాణానికి రూ.21.80 లక్షల వ్యయంతో పనులు చేశామన్నారు. సంబంధిత బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, నేటి వరకూ రూ.47 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. మరో రూ.14 లక్షలు రావాల్సి ఉందన్నారు. గ్రామంలోని టీడీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులతో ఇబ్బందులకు గురిచేయించటం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి రాఘవయ్య ప్రోద్బలంతోనే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎం.ప్రసాద్, పి. శౌరిరాజులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
సచివాలయం, ఆర్‌బీకే భవనాలకు 15 సెంట్లు దానమిచ్చిన కోటేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్, 75 ఏళ్ల వృద్ధుడిపై టీడీపీ నేతల దాడి
దాతపై పచ్చ నేతల దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment