నారీ వివక్ష లేని సమాజంతోనే అభ్యున్నతి
గుంటూరు రూరల్: నారీ వివక్షత లేని సమాజంతో అభ్యున్నతి సాధ్యమని, మహిళలకు విద్య, ఉపాధి, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలలో సమాన అవకావాలు ఇవ్వాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి పిలుపునిచ్చారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో మహిళా శాస్త్రవేత్తల కృషి మరువలేనిదని కొనియాడారు. మహిళా రక్షణ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ ఎ. మణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అన్ని కమిటీలతో, పలు స్కీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీ అగ్రికల్చర్ కమిషనర్ బి. రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురని తెలిపారు. సమాజంలో మార్పుకోసం, లింగవివక్షత, అసమానతలను అధిగమించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ అధికారులకు సత్కారాలు అందించారు. ఉత్తమ మహిళా రైతులుగా మన్యం జిల్లా పార్వతీపురం మండలం వంజరపుగూడాకు చెందిన మర్రి నవ్య, తూర్పుగోదావరి జిల్లా నిడిగల్లుకు చెందిన వేమగిరి అన్నపూర్ణ, పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన కిలారి జయమ్మ, ఒంగోలు జిల్లా సంతపేటకు చెందిన గుల్లపల్లి సుజాత, తిరుపతికి చెందిన కె. యువరాణి, శ్రీ సత్యసాయి జిల్లా ఉప్పునేసినపల్లికి చెందిన నారా నాగలక్ష్మిలకు ఉత్తమ మహిళా రైతు పురస్కారాలు అందించి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment