
కష్టాలన్నీ దాటే మహాశక్తి అతివ
నెహ్రూనగర్: కష్టాలను దాటి ముందుకు వెళ్లగల మహాశక్తి అతివ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న మహిళామణులకు అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళా నాయకత్వం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వంటి ఎందరో ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. అతివలు ఆర్థిక అక్షరాస్యత పెంచుకుంటే కుటుంబాలు ప్రగతి పథాన పయనిస్తాయని చెప్పారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళల సాధికారిత, ఆర్థిక స్వాతంత్య్రం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉంటే 90 శాతం లైంగిక వేధింపులు ముందుగానే అరికట్టవచ్చన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలోనూ పరిమితులు పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయరాదన్నారు. మహిళల భద్రత కోసం మీ కోసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా సాధికారిత వైపు అందరూ ప్రయాణించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిలు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపీఐటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజా వలి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, సీపీఓ శేషశ్రీ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, మెప్మా పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ మేయరు సజీలా, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసులు, వెంకట కృష్ణయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
ఘనంగా అంతర్జాతీయ
మహిళా దినోత్సవం

కష్టాలన్నీ దాటే మహాశక్తి అతివ
Comments
Please login to add a commentAdd a comment