ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్యాయత్నం
యద్దనపూడి: యద్దనపూడి పీహెచ్‌సీ పరిధిలోని జాగర్లమూడి గ్రామంలో గతంలో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి... యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలో సరోజిని ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తుండేది. ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తోటి సిబ్బందితో పాటు గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌ఓ విజయమ్మ నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని సందర్శించి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆమెను వివరణ కోరారు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో వైద్యాధికారి శ్రీహర్ష నాలుగు నెలల క్రితం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి ఆమెను సరెండర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో యద్దనపూడి పరిధిలోనే హాజరు వేసుకుంటూ తనకు వేతనం మంజూరు చేయడం లేదని కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యాధికారి శ్రీహర్షపై ఒత్తిడి చేస్తూ అతనితో వివాద పడింది. కొన్ని రోజులుగా వివాదం నడుస్తుందని ఆస్పత్రి సిబ్బంది స్వయంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జీతాలు, విధులు నిర్వహించాల్సిన ప్రాంతం విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో పర్చూరు పోలీస్ స్టేషన్‌లోను, యద్దనపూడి పోలీస్ స్టేషన్‌లోను వైద్యాధికారి శ్రీహర్షపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తనను మానసికంగా వైద్యాధికారి, ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది.
● ఈ విషయమై డీఎంహెచ్‌ఓ విజయమ్మను వివరణ కోరగా గతంలో సరోజిని విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు రావడంతో సాధారణ తనిఖీల్లో భాగంగా విచారించామన్నారు. ఈ విచారణలో రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతోపాటు అక్కడి స్థానిక వైద్యసిబ్బందితో పాటు ప్రస్తుతం వైద్యాధికారి శ్రీహర్షతోపాటు గతంలో ఉన్న వైద్యాధికారిపై కూడా పలు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైద్యసిబ్బంది ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారి శ్రీహర్ష జిల్లా కేంద్రానికి సరెండర్ చేయగా తాము ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు చెప్పారు.
● ఈ విషయమై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా యద్దనపూడి పీహెచ్‌సీ కేంద్రం నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చారు. ఆమెకు మరోచోట బదిలీ చేసేందుకు ఎంఎల్‌సీ కోడ్ అడ్డుగా వచ్చిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఆర్డీ కార్యాలయానికి వచ్చి జాగర్లమూడి గ్రామంలో పని చేసుకుంటానని ప్రాధేయపడిందని, కానీ ఆమెకు యద్దనపూడీ పీహెచ్‌సీలో పనిచేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఆమెకు వేతనాలు మంజూరు చేసే అధికారం యద్దనపూడి పీహెచ్‌సీ వైద్యాధికారికి లేదన్నారు. ఈ ఆత్మహత్యయత్నం ఘటన ఇప్పుడే తెలిసిందని, వాస్తవాలు విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment