బాబోయ్.. ఇవేం స్పీడ్ బ్రేకర్లు?
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యలు వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. బైక్ రేసర్ల ఆట కట్టించేందుకు ప్రధాన రహదారులైన లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, విద్యానగర్, పట్టాభిపురం, స్తంభాలగరువు వంటి ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను అడ్డగోలుగా నిర్మించారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
● నగరంలోని స్పీడ్ బ్రేకర్లతో వాహన చోదకులకు నిత్యం నరకం ● నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మాణం ● బ్యాలెన్స్ తప్పుతుండటంతో ప్రమాదాల బారిన బైకు చోదకులు
తీవ్ర ఇబ్బందులు
లక్ష్మీపురం: పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గుజ్జనగుండ్ల నుంచి విద్యానగర్, రింగ్‌రోడ్డు, కొరిటెపాడు వరకు ఒక్కో ప్రదేశంలో మూడు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. ఈ విషయం గ్రహించిన అధికారులు మూడు స్పీడ్ బ్రేకర్లకు బదులు కొన్నిచోట్ల నామమాత్రంగా రెండు స్పీడ్ బ్రేకర్లుగా సరి చేశారు. ఇంకా చాలాచోట్ల అలాగే ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రోడ్డులోని నగరాలు వెళ్లే మార్గంలో ఇరువైపులా మూడు స్పీడ్‌బ్రేకర్లు అడ్డగోలుగా వేయడంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
యూటర్న్‌లలో ప్రమాదకరంగా..
ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ప్రతి చోట దాదాపు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో యూటర్న్ తీసుకునే సమయంలో వాహనదారుల సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. భారీ వాహనాలు అటుగా ప్రయాణించే సమయంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్లను సరిచేసి వాహనదారులు స్పీడ్ తగ్గించి ఎలాంటి ప్రమాదాలబారిన పడకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా నగరవాసులు కోరుతున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం పట్టాభిపురం, స్తంభాలగరువు మీదుగా పలు ప్రదేశాలలో స్పీడ్ బ్రేకర్లను ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేశారు. పైగా వాటిపై కనీసం నిర్దేశిత రంగులు కానీ, రేడియం లైట్లు, కలర్‌లుగానీ వేయక పోవడంతో రాత్రి వేళ వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైకు రేసర్ల కట్టడికి సిబ్బందితో నిఘా పెట్టడం, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలేగానీ ఇలా అడ్డగోలుగా స్పీడ్ బ్రేకర్లు వేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెబుతారని జనం మండిపడుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
యువత బైక్ రేసుల్లో పాల్గొనకుండా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులకు సూచించాం. వారి నిబంధనల ప్రకారం స్పీడ్ బ్రేకర్లను నిర్మించారు. రేడియం పెయింట్ వేయించాల్సిందిగా వెస్ట్ ట్రాఫిక్ సీఐ ద్వారా లేఖ కూడా పంపాం. రింగ్ రోడ్డు వైపు ఉన్న రెండు స్పీడ్ బ్రేకర్లు యూటర్న్ వద్ద ఉన్నందున పరిశీలించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. స్పీడ్ బ్రేకర్లు పెట్టినా బైక్ రేసర్ల స్పీడ్ తగ్గడం లేదు. బ్రేకర్లతో పాటు జిగ్‌జాగ్ స్టాప్ బోర్డులను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.రమేష్, ట్రాఫిక్ డీఎస్పీ
ప్రమాణాలు పాటించని స్పీడ్ బ్రేకర్ల దెబ్బకు నగరవాసుల నడుం విరిగినంత పనవుతోంది. చాలాసార్లు బైకు బ్యాలెన్స్ కుదరక అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బైకుపై వెనుక భాగంలో కూర్చున్నవారు జారి కింద పడుతున్నారు. ఇక వృద్ధులు బైకు నడపాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పేషెంట్లు అటుగా వెళ్లాలన్నా, వారిని బైకుపై తీసుకెళ్లాలన్నా బైకు నడిపేవారికి నరకమే. గర్భిణుల పరిస్థితి చెప్పే పనే లేదు. విద్యాసంస్థలకు పిల్లలను తీసుకుని బ్యాగులతో వచ్చీపోయే తల్లులు స్కూటీలను ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అదుపు చేయలేక బెంబేలెత్తుతున్నారు. పురుషులు కూడా చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. పలువురి జేబుల్లోని సెల్‌ఫోన్‌లు కింద పడటం, వాటిని తీసుకోవడానికి వాహనాలు పక్కకు ఆపి మళ్లీ వెనక్కి రావాల్సిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కాస్త ఖరీదైన కార్లు కింది భాగం స్పీడ్ బ్రేకర్లకు తగులుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. పైగా వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని యజమానులు వాపోతున్నారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
బాబోయ్.. ఇవేం స్పీడ్ బ్రేకర్లు?
Comments
Please login to add a commentAdd a comment