గంజాయి, మాదకద్రవ్యాల నిరోధానికి చర్యలు
ఆర్‌పీఎఫ్, జీఆర్పీ అధికారులు
తెనాలిరూరల్: మాదకద్రవ్యాలు, గంజాయిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు తెలిపారు. గంజాయితోపాటు ఇతర మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాల రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు తెనాలి రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి వచ్చిన పోలీస్ జాగిలం ‘లియో’ ప్రయాణికుల లగేజి, ప్లాట్‌ఫాంలు, రైల్వే పార్సిల్ కార్యాలయం, ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లలో తనిఖీ చేసింది. ప్లాట్‌ఫాంలపై కొందరి ప్రయాణికుల లగేజిని పరిశీలించడంతో గంజాయి, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను గుర్తించే యత్నం చేసింది. ఈ సందర్భంగా తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ ఎం.శివరామకృష్ణయ్య మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను తీసుకువస్తుండడంతో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జాగిలాలతో తనిఖీలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తెనాలి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టినట్టు వివరించారు. గంజాయి, మాదకద్రవ్యాల గురించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబరు 14500కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో విజయవాడ ఆర్‌పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఏఎస్‌ఐ బి. విజయరాజు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ పీఎస్‌ఎన్ మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment