
నేడు దుగ్గిరాల ఎంపీపీ పదవికి ఎన్నిక
దుగ్గిరాల: దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇన్‌చార్జి ఎంపీపీగా షేక్ జబీన్ వ్యవహరిస్తున్నారు. ఎన్నిక నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తహసీల్దార్ ఐ.సునీత తెలిపారు. ఇదిలా ఉంటే మంచికలపూడి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవికి కూడా గురువారం ఎన్నిక జరగనుంది.
గుంటూరు రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నిక నేడు
గుంటూరు రూరల్: రూరల్ మండలం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికను గురువారం ఉదయం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మండల అభివృద్ది అధికారి బి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: ప్రతిష్టాత్మకమైన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఫలితాలూ అదేరోజు వెలువడతాయి. అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కోసం మొత్తం మూడు బూత్‌లు ఏర్పాటు చేశారు. 2,016 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ముగిస్తుంది. గంట తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ రాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థులు బాధ్యతలు స్వీకరిస్తారు.