
మణిపాల్‌లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్‌లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్, లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ తెలిపారు. బుధవారం మణిపాల్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేయం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అవయవాల్లో ప్రధానమైనదని, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా లివర్ సరిగ్గా పనిచేయాలన్నారు. మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ప్రోగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న 60 మంది రోగులలో దాదాపు 13 మంది రోగులు ఈ కొత్త ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ఈఆర్‌ఏఎస్ కార్యక్రమం నుంచి విజయవంతంగా ప్రయోజనం పొందారని వివరించారు. మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ తక్కువ సమయంలో మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా మారిందన్నారు. పిల్లలలో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడిని నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలల క్రితం కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న నాలుగు సంవత్సరాల బాలుడికి జీవించి వున్న దాతనుంచి కాలేయ మార్పిడిని విజయవంతంగా మణిపాల్ హాస్పిటల్ వైద్యబృందం శస్త్రచికిత్స నిర్వహించిందని తెలిపారు. సాధారణంగా కాలేయ మార్పిడి తరువాత రోగిని 20 రోజులలో డిశ్చార్జి చేస్తారని, కానీ ఇటీవల 56 సంవత్సరాల వయస్సు గల కాకినాడకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్‌కు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం 5 రోజుల్లో డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ అరవింద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ రాజేష్ చంద్ర పాల్గొన్నారు.