
నకిలీ ఉద్యోగాల ముఠాపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో జనసేన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బుధవారం జనసేన నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ సీనియర్ నాయకుడు అంబటి తిరుపతిరావులు మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్‌లో శివ అనే వ్యక్తి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని జనసేన ఎంపీ, మంత్రుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దరఖాస్తులు స్వీకరిస్తూ, నగదు వసూలు చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. పత్రికల్లో దీనిపై వార్తలు వచ్చాయని గుర్తుచేవారు. శివకు, అతని వెనుక ఉన్న ముఠాతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చల్లాకుల కోటేష్, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు చిగురుశెట్టి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.