
చెరువును చెరబట్టారు
● అక్రమ తవ్వకాలు జరిపి జేబులు నింపుకొంటున్న వైనం ● ట్రాక్టరుకు రూ.650 వసూలు చేస్తూ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి ● గ్రామంలో బావుల్లో నీరు ఇంకిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● టీడీపీలో ఇరువర్గాల పోరుతో షాడో ప్రజా ప్రతినిధి వద్దకు చేరిన మట్టి పంచాయితీ
పాములపాడు చెరువులో టీడీపీ నేతల మట్టి దందా
పాములపాడు(తాడికొండ): తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో టీడీపీ నాయకుల మట్టి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతుంది. పూడికతీత పేరుతో గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా తెలుగుతమ్ముళ్లు అక్రమ దందాకు తెరలేపారు. తాగునీటి చెరువులో అక్రమ తవ్వకాలకు తెరలేపి మట్టిని అందిన కాడికి అమ్ముకొని జేబులు నింపుకొంటున్నారు. ట్రాక్టరుకు రూ.650 నుంచి దూరాన్ని బట్టి రూ.1000 వరకు వసూలు చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారు. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి సమాచారం ఇచ్చి తీర్మానం చేసిన అనంతరం అందరి ఆమోదంతో చెరువు అభివృద్ధి చేసి గట్లు పట్టిష్టం చేయాలి. సీనరేజీ రూపంలో వచ్చిన ఆదాయాన్ని పంచాయతీలో జమచేయాల్సి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా వెనకేసుకుంటున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు.
షాడో ప్రజా ప్రతినిధి చెంతకు పంచాయితీ
పాములపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల పంచాయితీ షాడో ప్రజా ప్రతినిధి చెంతకు చేరింది. ఇరువర్గాలు తమకు వాటా అందడం లేదంటూ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదులు చేయడంతో తెరవెనుక ఉన్న సదరు ప్రజా ప్రతినిధి పోలీసు, రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేసి బుధవారం మట్టి తవ్వకాలను నిలుపుదల చేయించారు. అనంతరం అక్రమ మైనింగ్ చేస్తున్న తమ్ముళ్లు కార్యాలయానికి చేరుకొని ఏం మాట్లాడారో ఏమో తెలియదు కానీ సాయంత్రానికి అంతా చక్కబెట్టుకొని మళ్లీ దందా ప్రారంభించారు.
● దీనిపై తాడికొండ సీఐ కె.వాసును వివరణ కోరగా ఎలాంటి అనుమతులు లేనందున మట్టి తవ్వకాలు నిలిపివేయించడం జరిగిందన్నారు. తిరిగి ప్రారంభించిన సంగతి తమకు తెలియదని, మైనింగ్ జరుగుతుంటే నిలుపుదల చేయిస్తానని తెలిపారు.
నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం మైనింగ్ నిర్వహించాలంటే పంచాయతీ తీర్మానం, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి అనుమతులు ఏమీ లేకుండానే జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గత 5 రోజులుగా ఈ తంతు రాత్రి పగలు, తేడా లేకుండా కొనసాగుతుండటంతో గ్రామస్తులు జేబులు గుల్ల చేసుకొని మట్టిని తోలుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు మరమ్మతుల పేరుతో పరిమితికి మించిన లోతు తవ్వి టీడీపీ నాయకులు జేబులు నింపుకొంటుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి సరే దోపిడీకి తెరలేపి జనం జేబులు గుల్ల చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

చెరువును చెరబట్టారు