
పత్తి రైతుపై విత్తన భారం
ధరలు పెంచడం బాధాకరం
అసలే వ్యవసాయం గిట్టుబాటు కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచడం పుండు మీద కారం చల్లినట్లే. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తుంటాను. సుమారు 30 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. అంటే విత్తనాల కోసం అదనంగా రూ.వెయ్యికిపైగానే వెచ్చించాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేస్తున్నాం. ఏటా నష్టాలు చవిచూస్తున్నాం. ఇప్పటికై నా పత్తి విత్తన ధరలను తగ్గించాలి.
–వంగా నవీన్‌రెడ్డి,
జొన్నలగడ్డ, గుంటూరు రూరల్ మండలం
●
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులు ఖరీఫ్ సీజన్‌లో సుమారు 1.22 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఇందులో గుంటూరు జిల్లాలో 25 వేల హెక్టార్లు, పల్నాడు జిల్లాలో 97 వేల హెక్టార్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇది ప్రధాన పంటల్లో ఒకటి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు సుమారు 11 లక్షల విత్తన ప్యాకెట్లు డిమాండ్ ఉంటుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. 475 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర గతంలో రూ.864 ఉండగా, ప్రస్తుతం రూ.901లకు చేరింది. అంటే ప్యాకెట్‌కు రూ.37 పెరిగింది. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల రైతులపై అదనంగా రూ.4.07 కోట్ల భారం పడనుంది. గత ఏడాది సాగు సమయంలో సరిగా వర్షాలు లేక, తర్వాత అధిక వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఆ బాధ నుంచి కోలుకోకుండానే ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరగడం ఇబ్బంది కలిగిస్తోంది.

పత్తి రైతుపై విత్తన భారం