
రాష్ట్రంలో కూటమి లిక్కర్ మాఫియా
● టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలు అప్పగింత ● వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ మాఫియా కొనసాగుతోందని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండిపడ్డారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్ ౖవైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిషేధించగా, ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యం పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సారాయి, మద్యం ఏరులై ప్రవహిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్వరమే మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలను అప్పగించారని ఆరోపించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 30 శాతం వాటా ఇచ్చి, ఊరుకు ఎనిమిది బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూములను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రూ.వేల కోట్లు టీడీపీ నేతల చేతులు మారుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు గతంలో బెల్ట్‌షాపులు రద్దు చేస్తామని సంతకం చేశారని, ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 43 వేల బెల్ట్ షాప్‌లను రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 4,300 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 33 శాతం తగ్గించారని తెలిపారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నాయకులకు వచ్చేలా చేశారని, క్వాటర్ బాటిల్‌కు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బెల్డు షాప్‌ల ఏర్పాటుకు సైతం లంచం కింద రూ.2 లక్షలు చెల్లిస్తున్నారని తెలిపారు. తద్వారా తాగునీటి సీసాల విక్రయాలు, పర్మిట్లు ఇస్తున్నారని విమర్శించారు. గతంలోని మద్యం పాలసీపై చంద్రబాబు ఏ–3గా ఉన్నారని, ఆ కేసు ఏమైందనేది చూసుకోవాలని అన్నారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆ కేసులో వైఎస్ జగన్‌ను ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో బలవంతంగా రాజ్ కసిరెడ్డి పేరు చెప్పించారని ఆరోపించారు.