
ఆసుపత్రులకు ఫైర్ నిబంధనలను సవరించండి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో క్లినిక్స్, చిన్న, మధ్య తరహా ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ విషయంలో ఫైర్ ఎన్‌ఓసీ చాలా సమస్యగా ఉందని, ఫైర్ నిబంధనలను కొన్ని సవరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్‌ను కోరింది. విజయవాడలోని ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ ఆధ్వర్యంలో గురువారం మాదిరెడ్డి ప్రతాప్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్’ సందర్భంగా ఐఎంఏ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులకు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి. నందకిషోర్, ఐఎంఏ ఫైర్ సేఫ్టీ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.శ్రీనివాస రాజు, ఫైర్ ఎన్‌ఓసీ విషయంలో ఎదురవుతున్న సమస్యలను డీజి దృష్టికి తీసుకువెళ్లారు. క్లినిక్స్, చిన్న, మధ్య తరహా ఆసుపత్రిలో కూడా భారీ అగ్నిమాపక పరికరాలు అమర్చుకోవాలనడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. వీటివల్ల ఆర్థిక భారం తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. డీజి ఫైర్ సర్వీసెస్ ,మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ వైద్యులు ఫైర్ ఎన్ ఓసీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానన్నారు. డీజీని కలిసిన వారిలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మోటూరు సుభాష్ చంద్రబోస్, ఐఎంఏజాతీయ యాక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి. ఫణిధర్, కోశాధికారి డాక్టర్ టి.కార్తీక్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవకుమార్, డాక్టర్ డి.అమరలింగేశ్వర రావు తదితరులు ఉన్నారు.
ఫైర్ డీజీకి ఐఎంఏ విజ్ఞప్తి