బీఆర్ఎస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి మరో గులాబీ మాజీ ఎమ్మెల్యే..! | - | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి మరో గులాబీ మాజీ ఎమ్మెల్యే..!

Published Wed, Mar 13 2024 1:20 AM | Last Updated on Wed, Mar 13 2024 11:31 AM

- - Sakshi

 హైదరాబాద్‌లో కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ

 బీఆర్‌ఎస్‌కు, జిల్లా అధ్యక్ష పదవికి నేడు రాజీనామా

తర్వాత కమలం పార్టీలో చేరే అవకాశం

 ఆ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన?

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ రానున్న నేపథ్యంలో కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. గులాబీ పార్టీకి చెందిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేసి సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌మున్షీ తదితరులను కలిశారు. డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, కొందరు పీఏసీసీఎస్‌ అధ్యక్షులు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరారు. తాజాగా, మంగళవారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్‌స్థాయి అధ్యక్షుల విజయ సంకల్పసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు మార్తినేని ధర్మారావు తదితరులతో అరూరి రమేష్‌ హైదరాబాద్‌ ఐటీసీ కాకతీయ హోటల్‌లో అమిత్‌షాను కలిశారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడిన అనంతరం బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై అసంతృప్తితోనే..

బీఆర్‌ఎస్‌లో కీలకంగా మారిన కొందరు నేతల తీరుపై అసంతృప్తితోనే అరూరి రమేష్‌ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలోనే ఉంటూ ద్రోహం చేసిన వారే ఇప్పుడు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎంపీ టికెట్‌ ఇస్తామని చెబుతూనే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కనీసం నియంత్రించడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుంటున్న తనను జిల్లాకు చెందిన ఓ నాయకుడు నిత్యం సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడని, పార్టీ శ్రేణుల వద్ద తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడంటూ పేర్కొన్నారు. అధిష్టానానికి నివేదించినా కట్టడి చేసే ప్రయత్నం చేయలేదని మనస్తాపం చెందిన ఆయన.. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనుండటం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది.

రాజీనామాకు కారణాలు నేడు వెల్లడి..
ఐటీసీ కాకతీయ హోటల్‌లో అమిత్‌షాతో భేటీ అయిన అరూరి రమేష్‌.. అ తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా సుమారు అరగంట ఏకాంతంగా మాట్లాడినట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆయన ఈ మేరకు బీఆర్‌ఎస్‌కు, వరంగల్‌ జిల్లా అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేయనున్నారు. ఉదయం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తన రాజీనామాకు కారణాలు, పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓటమి చెందిన ఆయన వరంగల్‌ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ టికెట్‌ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో మొదట కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో చర్చలు జరిపి ఆ తర్వాత అమిత్‌షాను కలిసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా బీజేపీలోకి అరూరి రమేష్‌ను ఆహ్వానించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement