కోళ్ల వ్యర్థం.. రూ.కోట్ల వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

కోళ్ల వ్యర్థం.. రూ.కోట్ల వ్యాపారం

Published Fri, Jan 31 2025 1:22 AM | Last Updated on Fri, Jan 31 2025 1:22 AM

కోళ్ల వ్యర్థం.. రూ.కోట్ల వ్యాపారం

కోళ్ల వ్యర్థం.. రూ.కోట్ల వ్యాపారం

వరంగల్‌ అర్బన్‌ : కోళ్ల వ్యర్థాలే కదా అని తీసిపారేయకండి. ఆ వ్యర్థాలే కాంట్రాక్టర్‌కు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. సదరు కాంట్రాక్టర్‌ బల్దియాకు నామమాత్రపు చెల్లింపులు చేస్తూ, మిగతాది జేబులో వేసుకుంటున్నారు. అధికారులు తమకు వచ్చే నెలవారీ కమిషన్లే మహా భాగ్యమంటూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ‘గ్రేటర్‌’ఆదాయానికి గండిపడుతోంది. ఇది ఎలా అనుకుంటున్నారా.. అయితే కథనం పూర్తి చదవండి. నగరంలో సుమారు 1,500కు పైగా చికెన్‌ సెంటర్లు ఉన్నాయి. ఇక కాలనీల్లో చిన్నా, చితకా 500కుపైనే ఉంటాయి. ఈ చికెన్‌ సెంటర్ల నుంచి ప్రతిరోజూ సుమారు 4వేల నుంచి 5వేల కిలోల వరకు వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. గతంలో వ్యర్థాలను బయట పోసేందుకు చికెన్‌ సెంటర్ల యజమానులు అష్టకష్టాలు పడేవారు. కొన్నేళ్లుగా ఆ వ్యర్థాలకు డిమాండ్‌ పెరిగింది. కోళ్లదాణా, చేపల చెరువులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్దియా ఆధ్వర్యంలో సేకరించేందుకు టెండర్‌ నిర్వహించారు. అందులో టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి ఉచితంగా వ్యర్థాలు సేకరించి బయటి మార్కెట్‌లో విక్రయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిలో వ్యర్థానికి రూ.20 చొప్పున ధర పలుకుతుంది. ఇలా నగరంలో రోజుకు రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వ్యాపారం సాగుతోంది. ప్రతిఏటా కోళ్ల వ్యర్థాల వ్యాపారం రూ.2.50 కోట్ల నుంచి 3.10కోట్ల వరకు వ్యాపారం సాగుతుంటుంది. ప్రతీ శనివారం, సోమవారం, గురువారం విధిగా కాంట్రాక్టర్లు చికెన్‌ వ్యర్థాలను సేకరిస్తున్నారు. చికెన్‌ సెంటర్ల యజమానులు వ్యర్థాల సేకరణ నిమిత్తం బల్దియాకు యూజర్‌చార్జీలు చెల్లిస్తారు. కానీ కాంట్రాక్టర్‌ నెలనెలా వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని దుకాణాల్లో సేకరించకుండా ఉండడంతో దుర్వాసన భరించలేని వారు కాంట్రాక్టర్‌ అడిగిన డబ్బులు ముట్టజెబుతుండడం గమనార్హం.

పేరుకే టెండర్‌.. అంతా మామూళ్ల వ్యవహారం

కోళ్ల వ్యర్థాల తరలింపునకు టెండర్‌ నిమితమాత్రమే. కానీ దానికి వెనుక పెద్దఎత్తున చేతులు మారుతున్నాయి. బల్దియాకు ప్రతినెలా రూ.70వేలు సదరు కాంట్రాక్టర్‌ చెల్లిస్తున్నారు. కానీ సదరు కాంట్రాక్టర్‌ 2వేలకు పైగా ఉన్న చికెన్‌ సెంటర్‌ నిర్వహకుల వ్యర్థాల తరలింపు పేరిట నెలకు రూ.300 నుంచి రూ. 500 వరకు ప్రతీషాపునుంచి వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా చికెన్‌ వ్యర్థాలను తిరిగి కోళ్ల దాణ చేపల చెరువులకు తరలిస్తూ రూ.కోట్లు సమకూర్చుకుంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వరంగల్‌ పశ్చిమ కీలకనేత సిఫార్సు మేరకు టెండర్‌ అప్పగించారు. మరికొద్ది నెలల్లో ఈ టెండర్‌ కాలం గడువు ముగియనుండడంతో కాంట్రాక్టర్లు ఓ మంత్రి ద్వారా తమకే టెండర్‌ దక్కేలా బల్దియా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వ్యర్థాల సేకరణకు నెలనెలా వసూళ్లు, ఆ వ్యర్థాలకు బయటి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో సేకరణ, తరలింపు టెండర్‌కు కాంట్రాక్టర్లు పోటీపడుతున్నారు.

నిబంధనల మేరకు వసూలు చేస్తున్నాం

కోళ్ల వ్యర్థాలకు ఏడాదిన్నర క్రితం టెండర్లు జరిగాయి. ఆ నిబంధనల మేరకు కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాం. చికెన్‌ సెంటర్ల యజమానులనుంచి డబ్బులు వసూలు చేయొద్దు. నాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా.

– రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్‌

నగరంలో చికెన్‌ సెంటర్లు

1500

ప్రతిరోజూ ఉత్పత్తయ్యే వ్యర్థాలు

4 నుంచి 5వేల కిలోలు

వ్యర్థాలను కిలోల చొప్పున విక్రయిస్తే :

రూ.80వేల నుంచి లక్ష (రోజుకు)

ఏటా కోళ్ల వ్యర్థాలతో ఆదాయం : రూ.2.65 కోట్ల నుంచి

రూ. 3.60కోట్లు

నగరంలోని చికెన్‌ సెంటర్లనుంచి ప్రతినెలా వసూళ్లు

చేతులు మారుతున్న లక్షల రూపాయలు

‘గ్రేటర్‌’కు చెల్లించేది నామమాత్రమే

మరికొద్ది నెలల్లో ముగియనున్న

టెండర్‌ గడువు

తిరిగి దక్కించుకునేందుకు

కాంట్రాక్టర్ల పోటాపోటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement