తూర్పు కాంగ్రెస్లో తీన్మార్!
మూడు వర్గాలుగా అధికార పార్టీ నాయకులు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం తూర్పు కాంగ్రెస్లో దుమారం రేపుతోంది. వరంగల్ మండలంలో ఒక్కరికి కూడా మార్కెట్ కమిటీలో చోటు దక్కకపోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాశిబుగ్గ, లక్ష్మీపురం ప్రాంతాలకు చెందిన ఇద్దరు సీనియర్లకు మార్కెట్ పాలకవర్గంలో చోటు కల్పిస్తామని అధికార పార్టీ ముఖ్యనేతలు హామీ ఇచ్చారు. తమకు తప్పకుండా అవకాశం వస్తుందని ఆశతో ఎదురు చూసిన నాయకులు.. పాలకవర్గంలో పేర్లు లేకపోవడంతో తలెత్తుకోని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మూడు వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు చెలామణి అవుతున్నారు. పాత సీనియర్ల వర్గానికి సీనియర్ నాయకుడు, ఒక వర్గానికి ధర్మారానికి చెందిన నాయకుడు, మరో వర్గానికి ఎల్బీనగర్కు చెందిన నాయకుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇందులో కాంగ్రెస్లోకి వచ్చిన ఒకే గ్రూపునకు చెందిన వారికి మార్కెట్ పదవులు లభించడంతో మరోవర్గం నాయకులు ఎల్బీనగర్లోని సీనియర్ నాయకుడి ఇంట్లో సమావేశమై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసిన తమకు న్యాయం జరగలేదని నాయకులు, కార్యకర్తలు తన ఇంటికి వచ్చి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సీనియర్ నాయకుడు నల్గొండ రమేశ్ తెలిపారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లినా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారే ముందు ఉంటున్నారని, ఎన్నికల సమయంలో టికెట్ రాదని, వస్తే గెలవరని ప్రచారం చేసిన నాయకులే ఇప్పుడు కార్లలో కొండా దంపతుల ముందు ఉంటున్నారని అసంతృప్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కొండా దంపతుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్లు రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment