
మృత్యువుతో పోరాడి ఆగిన గుండె..
డోర్నకల్: తల్లి కర్కశత్వానికి ఓ చిన్నారి బలైంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు కన్న తల్లే కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగించింది. హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఒకరు కోలుకోగా మరొకరి పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డోర్నకల్ మండలం జోగ్యాతండాకు చెందిన వాంకుడోత్ వెంకటేశ్, ఉష దంపతులకు వరుణ్‌తేజ్(7), నిత్యశ్రీ(5) పిల్లలు ఉన్నారు. వెంకటేశ్ నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఉష పిల్లలతో కలిసి జోగ్యాతండాలోని అత్తగారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ నెల 5న వరుణ్‌తేజ్, నిత్యశ్రీ ఇంటి వద్ద ఆడుకుంటూ కిందపడి వాంతులు చేసుకున్నారు. నానమ్మ బుజ్జి పిల్లలను పరిశీలించి ఆరా తీయగా తమకు తల్లి కూల్‌డ్రింక్ తాగించిందని తెలిపారు. కొద్దిసేపటి తరువాత తల్లి ఉష రావడంతో పిల్ల లను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు తల్లిని నిలదీశారు. దీంతో పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై చిన్నారుల బాబాయి వాంకుడోత్ రాంబాబు ఈ నెల 10న డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 15 రోజుల తర్వాత వరుణ్‌తేజ్ కోలుకోగా నిత్యశ్రీ పరిస్థితి విషమించి మృతి చెందింది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ హైదరాబాద్ వెళ్లి నిత్యశ్రీ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, నిత్యశ్రీ మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇంటికి చేరిన వరుణ్‌తేజ్..
చికిత్స పొంది కోలుకున్న వరుణ్‌తేజ్ శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. తన చెల్లి మృతి చెందిందనే విషయం అర్థం కాక అమాయకంగా చూస్తున్న వరుణ్‌తేజ్‌ను చూసినవారు కంటతడి పెట్టారు.
చికిత్స పొందుతున్న చిన్నారి మృతి
19 రోజుల క్రితం కూల్‌డ్రింక్‌లో
గడ్డి మందు కలిపి తాగించిన తల్లి

మృత్యువుతో పోరాడి ఆగిన గుండె..
Comments
Please login to add a commentAdd a comment