
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
రామన్నపేట: ఈనెల 20వ తేదీన కత్తితో భార్య, అత్తామామలపై దాడికి పాల్పడిన నిందితుడు కోట చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఈమేరకు ఆదివారం మట్టెవాడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. వరంగల్ శంభునిపేటలో పెయింటింగ్, రాడ్‌బైడింగ్ వర్క్స్ చేసే చంద్రశేఖర్ తనకు వరుసకు మామ అయ్యే జన్ను బాబు కూతురు పల్లవిని ప్రేమించి పెద్దల అంగీకారంతో 2022లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి నిందితుడు చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో అతిగా మద్యం తాగుతున్నాడు. ఈ విషయంలో భార్య వద్దని వారించేది. కుమారుడు జన్మించినా చంద్రశేఖర్ తన పద్ధతి మార్చుకోకపోవడంతో పల్లవి తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు తన ఇంటికి రావాలని కోరినా పల్లవి.. చంద్రశేఖర్ వద్దకు వెళ్లకపోవడంతో పగ పెంచుకున్నాడు. అలాగే, వేరే వారితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో భార్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం పల్లవిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పల్లవి కేకలు వేయగా బయట ఉన్న తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం పోలీసులు పాపయ్యపేటచమన్ దగ్గర వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో నిందితుడు ఆటో దిగి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment