రాజ్యలక్ష్మి బాధ్యత తీసుకుంటాం..
దుగ్గొండి: కూతురు, కుమారుడు, భర్తను కోల్పోయి పక్షవాతంతో బాధపడుతున్న అభాగ్యురాలు కూచన రాజ్యలక్ష్మి జీవన బాధ్యతను జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ తీసుకుంటుందని జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ రాచర్ల సురేశ్ అన్నారు. మండలంలోని స్వామిరావుపల్లి గ్రామంలో ఆరేళ్ల క్రితం కూతురు, నాలుగు రోజుల క్రితం కుమారుడు మృతి చెందగా రెండు రోజుల క్రితం భర్త రవి బలవన్మరణానికి పాల్పడిన విషయం విధితమే. ఈమేరకు మంచానికి పరిమితమై అచేతన స్థితిలో ఉన్న రాజ్యలక్ష్మి దీనస్థితిపై పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా న్యాయసాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి నిర్మలాగీతాంబ, న్యాయసాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్.. రాజ్యలక్ష్మి పరిస్థితిని పరిశీలించాలని జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ రాచర్ల సురేశ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన ఆదివారం స్వామిరావుపల్లిలో రాజ్యలక్ష్మిని పరామర్శించారు. కుటుంబంలో జరిగిన మరణాలపై అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యలక్ష్మిని అనాథ ఆశ్రమాలలో చేర్పించడంతో పాటు వైద్య ఖర్చులు, పోషణ అంతా జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ భరిస్తుందన్నారు. ఖర్మకాండలు ముగిసిన అనంతరం తాము తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు అన్నీ సౌకర్యాలు ఉన్న ఆశ్రమాలలో చేర్పిస్తామని వివరించారు. ఆయన వెంట నరహరి బుచ్చిరెడ్డి, తుమ్మలపెల్లి మహేందర్, చిరంజీవి, దాసరి రాజు పాల్గొన్నారు.
● డిస్ట్రిక్ట్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ రాచర్ల సురేశ్
Comments
Please login to add a commentAdd a comment